
న్యూఢిల్లీ: భారత చదరంగంలో నేటితరం సంచలన విజేతలతో పోల్చుకుంటే అరవింద్ చిదంబరం ఆలస్యంగా వికసించిన చాంపియన్. ఇప్పటికే టీనేజ్‌లోనే దొమ్మరాజు గుకేశ్, ఆర్.ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి అంతర్జాతీయ చెస్ టోర్నీలు, ఎలో రేటింగ్స్‌లో సత్తా చాటుకున్నారు. కానీ 64 గడుల బరిలో అరవింద్ 25 ఏళ్ల వయసులో వార్తల్లోకెక్కాడు.
ప్రాగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా భారత్‌లో కొత్త చదరంగ చక్రవర్తిగా అవతరించాడు. వయసు రీత్యా అతను లేటే కావొచ్చు... కానీ లేటెస్ట్ చాంపియన్‌గా భారత క్రీడాఖ్యాతిని పెంచాడు. గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్‌లతో కలిసి ఇప్పుడు నాలుగో స్తంభమయ్యాడు.
విజేతగా మలచిన తల్లి
మధురైలో పుట్టిన అరవింద్ పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల వయసులోనే కన్నతండ్రి లోకాన్ని వీడితే... కన్నతల్లే అన్నీ తానై పెంచింది. జీవితబీమా (ఎల్‌ఐసీ) ఏజెంట్‌గా పనిచేస్తూ మదురై నుంచి చెన్నైకి మారి బతుకుబండిని లాగించింది. ఏడేళ్ల వయసులో తాత చెస్‌లో ఓనమాలు నేర్పితే అందులోనే కెరీర్‌ను ఎంచుకున్నాడు. విఖ్యాత వేలమ్మాళ్ స్కూల్‌లో విద్యనభ్యసించిన అరవింద్ చదువుకునే రోజుల్లో ఇప్పటి ప్రపంచ చాంపియన్ గుకేశ్‌కు సీనియర్.
గుకేశ్ కూడా వేలమ్మాళ్ విద్యార్థే! ప్రాగ్ మాస్టర్స్‌లాంటి మేటి టోర్నీల్లో సాధారణంగా టాప్–20 ర్యాంకింగ్ ప్లేయర్లకు పాల్గొనే అవకాశముంటుంది. అంతకుమించి ర్యాంకుల్లో ఉంటే నిర్వాహకుల నుంచి వైల్డ్‌కార్డ్‌లాంటి ఎంట్రీలు ఉండాల్సిందే. అలా వచ్చిన అవకాశాన్ని అరవింద్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.
2013లో తొలి జీఎమ్ నార్మ్
భారత విఖ్యాత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 2013లో మాగ్నస్ కార్ల్‌సన్‌కు ప్రపంచ చెస్ చాంపియన్ కిరీటాన్ని కోల్పోయిన ఏడాదే పాఠశాల విద్యనభ్యసిస్తున్న అరవింద్ తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎమ్) నార్మ్ పొందాడు. అక్కడి నుంచి అతని ఆట మరో దశకు చేరడంతో 2015లో గ్రాండ్‌మాస్టర్ హోదా లభించింది. అడపాదడపా టోర్నీల్లో గెలుస్తున్నప్పటికీ 2019 అతని కెరీర్‌ను మలుపుతిప్పింది.
భారత ఓపెన్‌లో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఇలా మూడు విభాగాల్లోనూ అరవింద్ విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. దాంతో పాటే తొలిసారి 2700 ఎలో రేటింగ్‌లోకి వచ్చేశాడు. ఇప్పుడు ప్రాగ్ టైటిల్‌తో లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అరవింద్ 14వ స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున నాలుగో ర్యాంకర్‌గా
ఎదిగాడు.
Comments
Please login to add a commentAdd a comment