అవార్డులు కొత్తేమీ కాదు ఆదుకోండి.. | Padmasri Chinna Pillai Suffering With Poverty Tamil Nadu | Sakshi
Sakshi News home page

పేదరికంలో చిన్నపిళ్లై

Published Mon, Jan 28 2019 11:18 AM | Last Updated on Mon, Jan 28 2019 12:44 PM

Padmasri Chinna Pillai Suffering With Poverty Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన చిన్నపిళ్లైని పేదరికం వెంటాడుతోంది. తనను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. తనకు అవార్డులు కొత్తేమీ కాదని, పద్మశ్రీ అవార్డు ఆనందమేనని చిన్నపిళ్లై వ్యాఖ్యానించారు.దక్షిణ తమిళనాడు అన్ని రంగాల్లో ఒకప్పుడు వెనుక బడి ఉండేది. ప్రధానంగా మదురై, తిరునల్వేలి, విరుదుగనర్‌ జిల్లాల్లో కందువడ్డి వేధింపులు మరీ ఎక్కువే. వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న దృష్ట్యా, రైతు కూలీలు మరీ ఎక్కువే. ఈ సమయంలో 1990లో  మహిళలు స్వయం ఉపాధి కల్పన, వారి జీవితాల్లో వెలుగు లక్ష్యంగా మదురైకు చెందిన చిన్నపిళ్లై (67) కదిలారు. కళంజియం పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. స్వయం సహాయక బృందాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు.

కందువడ్డి వేధింపుల భారి నుంచి గ్రామీణ ప్రజల్ని రక్షించేందుకు  ఉపాధి అవకాశాల మెరుగుకు చర్యలు తీసుకున్నారు. స్వయం సహాయక బృందాలకు రుణాల్ని ఇప్పించి, వృత్తి శిక్షణతో బలోపేతం చేశారు. వారి కాళ్లపై వాళ్లే నిలబడే స్థాయికి గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారు. అలాగే, మద్యపానానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పినా, మద్దతు కరువే. బాల్య వివాహాల్ని అడ్డుకోవడంలో చిన్నపిళ్లై సఫలీకృతులయ్యారు. ఆమె సామాజిక సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా, వ్యక్తిగతం చిన్నపిళ్లై ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రస్తుతం పేదరికంలో ఉన్న ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఇస్తున్న రూ. వెయ్యి వితంతువు పింఛన్‌ ఒక్కటే ఆదరణగా మారింది.

వాజ్‌పేయి ఆశీర్వాదం: పద్మశ్రీ అవార్డుకు ఎంపి కైన చిన్నపిళ్లైని మీడియా కదిలించగా, తనకు వచ్చిన అవార్డులు, పేదరికం, ఆరోగ్య సమస్యలను వివరించారు. తనకు అవార్డులు కొత్తేమీ కాదన్నారు. అప్పట్లో దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి తన కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకునిమరి బిరుదును ప్రదానం చేశారన్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అవ్వయార్‌ బిరుదును ప్రదానం చేసిందన్నారు. బిరుదులు వస్తుంటాయని, అయితే, గ్రామీణ మహిళలు మరింత ఆర్థిక ప్రగతి సాధించాలన్నదే తన తపనగా పేర్కొన్నారు. ఇప్పుడు మద్యం రక్కసి గ్రామాల్లో అనేక కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదనను మద్యానికి తగలబెడుతున్నారని, మహిళలు దాచుకున్న నాలుగు రాళ్లను లాక్కెళ్తున్న వాళ్లు ఎక్కువగానే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవ్వయార్‌ బిరుదు అందుకునే సమయంలో మద్యం దుకాణాల్ని మూసి వేయాలని సీఎంకు విజ్ఞప్తి చేయడానికి ప్రయత్నించానని, అయితే, ఆయన దారిదాపుల్లోకి వెళ్లకుండా అధికారులు తనను అడ్డుకోవడం జరిగిందన్నారు. మహిళా సంక్షేమంపై చిత్త శుద్ధి ఉంటే, మద్యం దుకాణాల్ని మూసి వేయడానికి సీఎం పళనిస్వామి చర్యలు చేపట్టాలని కోరారు.

పేదరికంలో ఉన్నా : సామాజిక సేవ అన్నది ఓ వైపు ఉన్నా, దానిని కొనసాగించేందుకు తగ్గ బలం ఇప్పటికీ ఉందన్నారు. అయితే, వ్యక్తిగతంగా తాను పేదరికంలో ఉన్నట్టు, ఆరోగ్య సమస్యలూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు రూ.వెయ్యి వితంతు పెన్షన్‌ను అందిస్తోందని, ఇది మందులకు సరిపోతున్నట్టు చెమ్మగిళ్లుతున్న కళ్లను తుడుచుకుంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పేదరికంతో తాను కొట్టుమిట్టాడుతున్నానని, ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే,  పేద విద్యార్థులకు ఉపాధి కల్పన అవకాశాలు మెరుగు పరచాలని, బాల్య వివాహాలు అడ్డుకునేందుకు విస్తృతంగా ముందుకు సాగాలన్న తపనతో కళంజియం ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement