చిన్నపిళ్లై
సాక్షి, చెన్నై: ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మదురైకి చెందిన చిన్నపిళ్లై(67) కటిక పేదరికంలో కాలం వెళ్లదీస్తున్నారు. రెండున్నర దశాబ్దాలకు పైగా గ్రామీణ మహిళాభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ తమిళనాట కోరలు చాచిన కంతు వడ్డీకి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు. కళంజియం పేరిట సంస్థను స్థాపించి మహిళల్ని ఏకంచేసి బాల్య వివాహాల్ని అడ్డుకుంటున్నారు. పద్మశ్రీకి ఎంపికైన సందర్భంగా మీడియా పలకరించగా.. తాను పేదరికంలో ఉన్నానని, ప్రభుత్వం అందించే వితంతు పింఛను రూ.వెయ్యితో కాలం నెట్టుకు వస్తున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు.తనకు స్త్రీ శక్తి పురస్కారం అందజేసిన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి తనకు పాదాభివందనం చేశారని ఆమె గుర్తు చేశారు.
అ‘సామాన్యుల’కు గుర్తింపు
న్యూఢిల్లీ: సమాజ సేవ చేస్తున్న పలువురు సామాన్యులను ఈ ఏడాది పద్మ అవార్డులు వరించాయి. అందులో టీ విక్రేత, రూపాయికే పేదలకు వైద్యం అందిస్తున్న డాక్టర్ దంపతులు, దళితుల కోసం పాఠశాలను నెలకొల్పిన రిటైర్డ్ ఐపీఎస్ తదితరులున్నారు. ఒడిశాలో 100 ఎకరాలను సాగుచేసేందుకు ఒంటరిగా 3 కి.మీ మేర కాలువ తవ్విన గ్రామస్తుడు, మథురలో వేయికి పైగా ముసలి, జబ్బుపడిన ఆవుల బాగోగులు చూస్తున్న జర్మన్ పౌరురాలు కూడా తమ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను గెలుచుకున్నారు.
కటక్‌కు చెందిన దేవరపల్లి ప్రకాశరావు టీ అమ్మడం ద్వారా వచ్చిన లాభాలతో మురికివాడల్లో నివసిస్తున్న పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. మహారాష్ట్రలో నక్సల్స్ ప్రభావిత మేల్ఘాట్ జిల్లాలో స్మిత, రవీంద్ర కోల్హె అవే వైద్య దంపతులు స్థానిక గిరిజనులకు మూడేళ్లుగా కేవలం రూ.1, రూ.2 కే వైద్యం అందిస్తున్నారు. ఇక బిహార్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జ్యోతికుమార్ సిన్హా మహాదళిత్ ముసాహర్ కులానికి చెందిన విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమ పాఠశాలను స్థాపించారు.
రెసిడెన్షియల్ వసతి కూడా ఉన్న ఈ పాఠశాలలో 1 నుంచి 12 తరగతుల వరకు 320 మంది విద్యార్థులు చేరారు. ‘కెనాల్ మ్యాన్ ఆఫ్ ఒడిశా’గా పేరొందిన దైతారి నాయక్..పర్వతాల నుంచి నీటిని పొలాలకు పారించేందుకు బైత్రాని గ్రామంలో ఒక్కడే సుమారు నాలుగేళ్లు శ్రమించి మూడు కి.మీ పొడవైన కాలువను తవ్వి నీటి ఎద్దడి తీర్చారు. ‘గౌ మాతాకీ ఆశ్రయదాత్రి’గా పేరొందిన జర్మనీకి చెందిన ఫ్రెడరిక్ ఇరినా బ్రూనింగ్ మథురలో 1200 గోవులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. పద్మశ్రీకి ఎంపికైన.. అస్సాంకు చెందిన ఇంజినీరింగ్ డ్రాపౌట్ ఉద్ధవ్ కుమార్ భరాలి దానిమ్మ గింజలు తీసే, వెల్లుల్లి పొట్టు తొలిచే యంత్రాలను తయారుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment