జరిగేవన్నీ మంచికనీ... | special chit chat with kota srinivasarao | Sakshi
Sakshi News home page

జరిగేవన్నీ మంచికనీ...

Published Wed, Jul 5 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

జరిగేవన్నీ మంచికనీ...

జరిగేవన్నీ మంచికనీ...

నేను నా దైవం

కొడుకు జారిపడితే.. మనకు నొప్పేస్తుంది. కొడుకు చేయిజారిపోతే.. కడుపు తరుక్కుపోతుంది. కొడుకే లేకపోతే... వాడి బదులు మనం పోతే బాగుండనిపిస్తుంది. తుపాన్‌ను భరించిన చెట్టు.. ఇంకా నిలబడే ఉందంటే దాని వేళ్ళలో దైవబలం ఉన్నట్టే! చెట్టంత కొడుకు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తోటలో మిగిలిన మొక్కలతో గడుపుతున్న కోటశ్రీనివాసరావు కన్నీళ్లలో జీవనవేదన కనిపించింది. ఆయన మాటల్లో.. ‘జరిగేవన్నీ మంచికనీ...’ అన్న స్పృహ ధ్వనించింది.

నా కొడుకు పెద్ద దెబ్బ కొట్టాడండీ. ఏమిటో అంతా.. ఆత్రేయగారు అన్నట్టు.. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికనీ...’ అనుకోవడమే మన పని.

సర్, ఈ విశ్రాంత సమయం దైవాన్ని తలచుకోవడానికి, జీవితాన్ని విశ్లేషించుకోవడానికి అవకాశంగా భావిస్తున్నారా?
అంతేకదమ్మా! ఇంక మిగిలింది అదే కదా! దేవుడు ఓ వైపేమో పేరు ప్రఖ్యాతులు బోలెడన్ని ఇచ్చాడు. మరో వైపు జీవితకాలం భరించు.. అనే కష్టం ఇచ్చాడు. (కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్‌ ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు) దేవుడి గొప్పతనం ఏంటంటే ఈ రెండింటినీ తట్టుకునేంత (చేతిని చాతీ మీద పెట్టుకుంటూ) గుండెను ఇచ్చాడు. ఇంకొకరైతే ఏమైపోయేవారో... ఆ కుర్చీలో కూర్చుని (ఇంటి హాల్‌లో గోడ మీద కోట చేసిన సినిమా పాత్రల ఫొటోలు అతికించి ఉన్నాయి) ఆ ఫొటోల వంక చూస్తుంటాను. జీవితంలో చేసిన తప్పులు, ఒప్పులు అన్నీ జ్ఞాపకం వస్తుంటాయి. కాకపోతే నమ్మేదొకటే.. తప్పొప్పులు ఎక్కడికీ పోవు. ఇక్కడే ఆ ఫలితాన్ని చూస్తాం. మంచి చేస్తే మంచే చూస్తాం, చెడు చేస్తే చెడూ చూస్తాం.

కొడుకును దూరం చేశాడని దేవుడి మీద కోపం తెచ్చుకుంటున్నారా?
కోపమా?! ఆయన ముందు మనమెంతటి వారం. అయినా మన ఖర్మకు ఆయన మీద కోపం తెచ్చుకోవడం ఎందుకు? అలా ఎప్పుడూ జరగలేదు. కానీ, దుఃఖం. ఇలా రాసిపెట్టి ఉంది. ఏం చేస్తాం...?
     
దైవం గురించి బాగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తోంది..
వృత్తే దైవంగా భావించాను. ఆ వృత్తిని అర్థం చేసుకుంటూ ఎదిగాను. అందులోని మంచి చెడులను ఇప్పుడు విశ్లేషించుకుం టున్నాను. మొదట్లో నేనీ రంగానికి వచ్చినప్పుడు ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడూ సినిమాల కోసం ప్రయత్నించింది లేదు. నాటకాలు వేసేవాడిని. యాదృచ్చికంగా టి.కృష్ణ గారు నా నాటకం చూసి, ‘వందేమాతం’ సినిమాలో చిన్న అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నటనే నా జీవితం అయిపోయింది. బ్యాంకులోనే ఉండి ఉంటే ఓ అధికారిని అయ్యేవాడినేమో. ఆ జీవితానికి ఈ జీవితానికీ ఎక్కడా పోలిక లేదు. ఇదంతా భగవంతుని దయ కాకపోతే మరేముంటుంది. నలుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములం. అన్నగారు పోయారు. మిగతా అందరం ఎప్పుడైనా కలుస్తుంటాం. ఎవరి ప్రాప్తం వారిది.

ఇంత జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి ఏవిధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు?
వేంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాను. ఉదయాన్నే నిద్రలేచినప్పుడు ఆయన్ని తలుచుకొని ఓ దణ్ణం పెట్టుకుంటాను. అంతకు మించి పూజలు ఏమీ చేయను. గుళ్లకు వెళుతుంటాను. దైవం అంటే నా ఒక్కడికే కాదు అందరికీ ఉన్నాడని గట్టిగా నమ్ముతాను. మనసుకు అలసటగా అనిపించినప్పుడు ఓ అరగంట మౌనంగా కూర్చుంటాను. దైవాన్ని తలుచుకుంటూ మౌనంగానే ప్రార్థిస్తుంటాను.

మీ పిల్లలు సరే, మనవలకు దైవం గురించి ఎలాంటి విషయాలు చెబుతుంటారు?
అప్పుడు పిల్లలకు చెప్పడానికి నాకు టైమ్‌ లేదు. ఇప్పటి పిల్లలు చాలా బిజీ! నేర్పడానికి, చెప్పడానికేమీ లేదు. పొద్దున ఏడింటికి వెళితే తిరిగి రాత్రి ఏడు దాటాకే వస్తారు. వాళ్ల పుస్తకాలు, వ్యాపకాలతోనే వారికి సరిపోతుంది. మనం ఏదైనా చెబితే చికాకు పడతారు. మార్పు ఎందుకొచ్చింది అని చెప్పలేం. అలా వచ్చిందంతే! వాళ్లకు సమయం దొరికినప్పుడు ‘ఏదో ఒకటి తెలుసుకోండిరా!’ అని అంటుంటాను. వింటే వింటారు, లేకపోతే లేదు. ఈ రోజు ఒకరో ఇద్దరో కాదు ప్రపంచమే అలా ఉంది. ఈ తరాన్ని మార్చండి అని చెప్పలేం. సమాజపరిస్థితులు అలా ఉన్నాయి. భగవంతుడే మార్పు తేవాలి.

మీ జ్ఞాపకాలలో దైవం మీకిచ్చిన అదృష్టం గురించి తలుచుకుంటుంటారా?
అదే ఇప్పుడు చేస్తున్నది. పుస్తకాలు చదివే అలవాటు లేదు. నా జీవితమే నాకు పెద్ద పుస్తకం. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకోవడం అంటే సాధారణ విషయంకాదు. నా కంటే ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. కానీ, ఆ అదృష్టం నన్ను వరించింది. ఇది భగవంతుడిచ్చిందే కదా! మంచైనా చెడైనా నేను చేసిన పాత్రలలో కనీసం 50 క్యారెక్టర్లయినా గుర్తుకు వస్తుంటాయి. అప్పటికీ ఇప్పటికీ నిలిచిపోయే క్యారెక్టర్‌ ‘అహ నా పెళ్లంట’ సినిమాలోనిది. మహానుభావుడు జంధ్యాలగారి ద్వారా ఆ అదృష్టాన్ని దక్కించాడు దేవుడు. ఎప్పుడైనా ఒక సినిమా గురించి బాధపడతాను. ‘పంజరం’ సినిమాలో యవ్వనంలో ఉన్న హీరోయిన్‌ని పెళ్లి చేసుకొని, అనుమానంతో ఆ పిల్లను పీడించే స్వభావమున్న పాత్ర అది. 102, 103 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా ఆ సీన్‌ చేశాను. కానీ, ఆ సినిమా రెండు, మూడు రోజుల కన్నా మించి ఆడలేదు. ఇలా మంచి చెడులను తలుచుకుంటూ ఉంటాను.

నేనిది కోల్పోయాను స్వామీ.. అని దేవుని ముందు చెప్పుకున్న సందర్భం?
రెండున్నాయి. ఒకటి సరైన సమయంలో కుటుంబంతో గడపలేకపోయాను. షూటింగ్స్‌ ఉండి నెలకి, రెండు నెలలకు ఓసారి ఇంటికి వచ్చిన రోజులున్నాయి. నాకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పిల్లల చిన్నతనంలో వారి అచ్చటా ముచ్చట పెద్దగా చూసుకుంది లేదు. వారి వెనకాల ఉండి సెట్‌ చేసింది లేదు. నా అదృష్టం ఏంటంటే పిల్లలు చదువుకుని, బుద్ధిమంతులుయ్యారు. రెండోది– జనరల్‌ నాలెడ్జి లేకుండా పోయింది. పొద్దున్న ఐదింటికో, ఆరింటికో వెళ్లిపోయేవాడిని. తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి దాటి ఏ రెండో అయ్యేది. ప్రపంచంలో ఏం జరుగుతుంది అని కూడా పట్టించుకోలేదు. ఈ రెండింటి గురించి తలుచుకొని నాలో నేను ఏడుస్తూ ఉంటాను. ఎట్లా అయిపోయిందంటే అప్పుడు తినడానికి టైమ్‌ లేదు. ఇప్పుడు తిందామంటే తినలేను. అప్పట్లో ఎవరు ఏం చేసేవారో కూడా తెలిసేది కాదు.

పుట్టినరోజులు, పెళ్లిరోజులు.. ఏవీ పట్టేవి కావు. ఎవరికైనా టైమ్‌ వస్తే టైమ్‌ ఉండదని అర్థమైంది. ఆ రోజులు అలా గడిచిపోయాయి.నా కొడుకు పెద్ద దెబ్బ కొట్టాడండీ. ఏమిటో అంతా.. ఆత్రేయగారు అన్నట్టు.. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికనీ...’ అనుకోవడమే మన పని. జీవితం వెళ్లిపోయింది. వెళుతోంది. ఈ వయసులో పితృశోకం భరించవచ్చు. పుత్ర శోకం భరించలేం. తండ్రిగా ఆ బా«దను అనుభవిస్తున్నాను. ఈ దుఃఖాన్ని ఎవరూ పూడ్చలేరు.

తెలిసినతను రోగంతో బాధపడుతూ ఇంకో రెండు నెలలో పోతాడనగా వెళ్లి చూసొచ్చాను. ఆయన్ను చూస్తూ ఒకాయన అన్నాడు ‘ఏంటయ్యా! ఇది.. ఇలా అయిపోయావు’ అన్నాడు. అప్పుడు అన్నాను ‘అనుభవించాడు కదా! ఇప్పుడు అనుభవిస్తున్నాడు’ అని. నేనూ అంతేగా! అన్నీ చూశాను. అర్థం చేసుకున్నాను. దేవుడు ఈ కష్టం ఇచ్చాడని ఏడుస్తూ కూర్చుంటే నన్ను నమ్ముకున్నవారు ఉన్నారు. వాళ్లేమై పోతారు. ఎలాగూ తప్పదు కాబట్టి.. నడిపించాలి అంతే!

ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవడా నికి ఆశ్రమాలకు వెళ్ళాలనుకోవడం లేదా?
ఇంతవరకు చేయలేదు. జనరేషన్‌ మార్పు కారణంగా ఇప్పుడు చాలా మటుకు పిల్లలు ఫారిన్‌లో ఉంటున్నారు. అక్కణ్ణుంచి డబ్బులు పంపిస్తుంటారు. ఇక్కడ అమ్మానాన్న ఏదో ఉన్నామంటూ దిక్కులేకుండా ఉంటారు. అదంతా విని, చూసి తట్టుకోవడం కష్టం అనిపిస్తుంది.
 
రోజంతా ఎలా గడుపుతుంటారు?
మనవలు, మనవరాలు ఉన్నారు. వారి బాగోగులు గమనించడం. కాసేపు టీవీ చూడడం, భోజనం చేయడం, నిద్రపోవడం..  తప్పదు. అంత తీరికలేకుండా ఉండి ఇప్పుడు ఇలా కూర్చోవడం అంటే ఏం చేయగలం...  భగవంతుడు అలా రాసిపెట్టాడు.   

మనుషుల్లో దైవత్వాన్ని  చూశారా?
ఎదుటివాడికి సాయపడటం అంటే అక్కడ దైవం ఉన్నట్టే! కాలే కడుపుకి ఒక ముద్ద పెట్టినా చాలు కదా. అలాంటివారిని చూస్తూనే ఉంటుంటాం.

మీరే దేవుడు అని ఎవరైనా అన్న సందర్భం...?
ఎంతమాట. అలా అని మనం చెప్పుకోకూడదు. కొందరు అంటుంటారు కానీ అది నాకు నచ్చదు. నా దగ్గర పనిచేసేవాళ్లు, తెలిసినవాళ్లు కష్టం లేకుండా ఉన్నారా, లేరా! అని చూస్తాను. ఎవరైనా కష్టం ఉంది బాబూ అని వస్తే.. సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో పది, పదిహేను లక్షలదాకా ఖర్చు పెట్టి ఉంటాను. అదంతా చెప్పుకోవడం నాకిష్టం లేదు. కష్టం ఉన్నదని వాళ్లు పది అడిగితే నేను పది ఇవ్వలేకపోవచ్చు. కానీ, మూడో నాలుగో ఇచ్చి ఉంటాను. ఈ రోజుకు కూడా ఒకరి ముందు చెయ్యి చాపే అవకాశం రానివ్వలేదు దేవుడు. అంతకు మించి ఏమున్నది. పిల్లలకూ అదే చెబుతుంటాను. మనం బతకాలి. పదిమందిని బతికించేలా ఎదగాలి అని.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement