అక్క, వదిన పాత్రలతో గుర్తింపు సంపాదించుకుంది సత్య కృష్ణన్. ఆనంద్, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరైంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'మా అమ్మానాన్న ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులే. అమ్మది రాజమండ్రి, నాన్నది గుంటూరు. నేను పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే! నాన్న చనిపోయాక మా స్నేహితులు, నాన్న ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్‌గా నిలబడ్డారు. ఆర్థికంగా కూడా సాయం చేశారు. సినిమాల్లోకి అనుకోకుండా వచ్చాను. నాకు ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు.
ఇన్నేళ్ల కెరీర్‌లో..
ఆనంద్ సినిమాలో చేసినటువంటి పాత్ర నాకు ఇంతవరకు మళ్లీ రాలేదు. బొమ్మరిల్లు సినిమా హిట్టయింది. కానీ అందులో నా పాత్ర నిడివి ఎక్కువుంటే బాగుండనిపించింది. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉండటం అంటే అంత ఈజీ కాదు. ఇన్నేళ్ల కెరీర్‌లో నన్ను ఇబ్బంది పెట్టింది ఏమీ లేదు. అలా అని ఇండస్ట్రీ అంటే కేక్ వాక్ కాదు. పని చేసేటప్పుడు ఎవరైనా ఏమైనా అంటే అవి పట్టించుకోవద్దు. విసుక్కోవడం, తిట్టడం.. ఇలాంటివి సర్వసాధారణం. నేను మీతో ఎలా ఉన్నానో.. మీరు నాతో అలా ఉండంటి అని చెప్తూ ఉంటాను.
నా లైన్‌లోకి రానివ్వను
క్యాస్టింగ్ కౌచ్ విషయానికి వస్తే ఇది ప్రతిచోటా ఉంది. సముద్రంలో నీటితో పాటు ఉప్పు కూడా ఉంటుంది. ఇదీ అలాగే! నాకైతే అలాంటి అనుభవం ఎదురవలేదు. ఎవరైనా అలాంటి వైబ్స్ ఇచ్చినా నా లైన్‌లోకి రానివ్వను. ప్రపంచంలో ఎక్కువ అందంగా ఉండేది అమ్మాయిలే కదా.. అందుకే ఆడవాళ్లే ఇలాంటి సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటున్నారు. మనం ఎలా ఉన్నాం, మనల్ని మనం ఎలా కాపాడుకున్నామనేదే ముఖ్యం.
ఇలాంటి ఒత్తిడికి లొంగిపోతారు
ఎవరైనా అతి చేస్తున్నట్లు అనిపిస్తే నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు అని ధైర్యంగా చెప్పగలగాలి. ఇలా చెప్తే మనకు పాత్రలు ఇవ్వరేమో అని కెరీర్ గురించి భయపెడటం కరెక్ట్ కాదు. ఇది తప్ప ఇంకో ఛాన్స్ లేదనుకునేవాళ్లు ఇలాంటి ఒత్తిడికి లొంగిపోతారు. ఈ మాటలు చెప్పడం ఈజీనే కానీ ఆ పరిస్థితిలో ఉన్న వాళ్లు ఎంత నరకం చూసుంటారో ఊహించలేం. ఏదేమైనా సరే మాతో వర్కవుట్ కాదని ధైర్యంగా చెప్పగలగాలి' అని చెప్పుకొచ్చింది సత్య.
Comments
Please login to add a commentAdd a comment