ఒకే మామిడి చెట్టుకు 300 కాయలు కాస్తాయి. అయితే ఆ కాయలు ఒక్కోటి ఒక్కో రకం. ఒక కొమ్మకు రసాలైతే ఒక కొమ్మకు తోతాపురి.. ఇలా ప్రపంచంలో ఏ చెట్టూ కాయదు. దీనిని సాధ్యం చేసి ‘మ్యాంగో మేన్ ఆఫ్ ఇండియా’గా పేరు పొందాడు లక్నోకు చెందిన కలీముల్లా ఖాన్. జీవితం మొత్తాన్ని మామిడి సాగుకు అంకితం చేసిన కలీముల్లా మామిడి తోట ఒక దర్శనీయ స్థలం.
‘ప్రపంచంలో మామిడి పండు అంత అందమైన పండు మరొకటి లేదు’ అంటారు కలీముల్లా ఖాన్. ఆయనికిప్పుడు 80 దాటాయి. లక్నో నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే మలిహామాద్‌లో ఆయన మామిడి ఉద్యానవనం ఉంది. ‘ఇది ప్రపంచ మామిడి చెట్లకు కాలేజీ లాంటిది. ఎవరైనా మామిడి పండ్ల గురించి ఇక్కడ చదవాల్సిందే’ అంటాడాయన.
మలిహాబాద్ ఉత్తరప్రదేశ్‌లో మామిడితోటలకు ప్రసిద్ధి. కలీముల్లా కుటుంబం కూడా మామిడి తోటల పెంపకంలో తాత తండ్రుల కాలం నుంచి ఉంది. ‘నేను సెవెన్త్ ఫెయిల్ అయ్యాను. మా ఊళ్లో పిల్లల్ని ఇళ్ల నుంచి కూడా బయటకు రానీయరు తల్లిదండ్రులు. అలా పెరిగాను. కొన్నాళ్లు ఆ పనీ ఈ పనీ చేసి మామిడి నర్సరీలో పని చేయడం మొదలుపెట్టాను. నాకు 18 ఏళ్ల వయసులో అంటు కట్టి మొదటి మామిడి మొక్కను నాటాను. కాని ఆ రోజు నుంచి భారీ వర్షం. దేవునికి ఇష్టం లేదనుకున్నాను. ఆ మొక్క బతకలేదు. కాని అంటు కట్టే విధానంతో కొత్త కొత్త మామిడి రకాలు సృష్టించాలన్న నా పిచ్చి పోలేదు. 1970లో నా పెళ్లయ్యింది. అప్పుడే ఈ మామిడి తోటలో ప్రయోగాలు మొదలెట్టాను’ అంటాడాయన.
ఒకేచెట్టుకు 315 రకాలు
ఒకేచెట్టు కొమ్మలకు రకరకాల పండ్ల అంటు కడుతూ చెట్టును విస్తరించడమే కాదు, దాని ప్రతికొమ్మకూ కొత్తరకం కాయలను సృష్టించాడు కలీముల్లా. ‘ఇన్ని రకాల కాయలు ఒకే చెట్టుకు కాసినప్పుడు మనుషులందరూ ఒకేరీతిన ఎందుకు కలిసి ఉండకూడదు’ అని ప్రశ్నిస్తాడాయన. ‘నేను సృష్టించిన ఒకరకం కాలాపహాడ్ పండును జుర్రుకుంటే మూడు రకాల రుచులు వస్తుంది’ అంటాడాయన. కొన్ని రకాల అంటు మామిళ్లకు కలీముల్లా ‘అమితాబ్, ‘సచిన్’, ‘నమో’ అనే పేర్లు పెట్టాడు. కరోనాలో సేవచేసి మరణించిన డాక్టర్లకు నివాళిగా ఒక మామిడిరకాన్ని సృష్టించి ‘డాక్టర్’వెరైటీ అని నామకరణం చేశాడు.
కలీముల్లాకు 2008లో పద్మశ్రీ వచ్చింది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా నాకు 400 అవార్డులు ఉద్యానవన విభాగంలో వచ్చాయి. చాలా వాటిని మా పిల్లలు వెళ్లి తీసుకొస్తుంటారు అంటాడాయన. ‘నాకు మన దేశం అంటే ప్రేమ. అమెరికా నుంచి చాలామంది వచ్చి నా విధానాలు తెలుసుకుని వెళ్లారు. మన దేశం వాళ్లే నా వల్ల ఎక్కువ ప్రయోజనం పొందడం లేదని అనిపిస్తోంది. నా జ్ఞానాన్ని నా వాళ్లకు పంచాలనే నా తపన అని భావోద్వేగంతో అంటాడు కలీముల్లా.
‘మా తోటకు రండి. మామిడి తినిపోండి’ అని సదా ఆహ్వానిస్తుంటాడాయన.
మ్యాంగో మ్యాన్
Published Sat, Jun 24 2023 5:15 AM | Last Updated on Sat, Jun 24 2023 7:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment