తపన కొద్దీ ఇంటిపంటలు! | Cultivation of home crops of Green leafy vegetables | Sakshi
Sakshi News home page

తపన కొద్దీ ఇంటిపంటలు!

Published Tue, Sep 4 2018 5:44 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 AM

Cultivation of home crops of Green leafy vegetables - Sakshi

టమాటా మొక్కలకు ఆసరా కల్పిస్తున్న రమేశ్‌బాబు; చిత్రంలో లెట్యూస్, క్యారట్‌ మొక్కలు నిలువు పందిళ్లకు పాకిన బీర, దొండ చుక్కకూర కోస్తున్న సావిత్రి

రసాయనిక అవశేషాల్లేని తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలన్న తపన ఉండాలే గానీ దంపతులిద్దరూ ఉద్యోగస్తులైనా ఇంటిపట్టునే పండించుకోవడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని కరీంనగర్‌కు చెందిన దంపతులు సూదం రమేశ్‌బాబు, సావిత్రి దంపతులు చాటిచెబుతున్నారు. సావిత్రి కరీంగనర్‌ పోలీసు శాఖలో సినియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. జమ్మికుంటలో పుట్టిన రమేశ్‌బాబు గ్రానైట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కరీంనగర్‌లో స్థిరపడ్డారు. నగర శివార్లలోని తీగలగుట్టపల్లెలో సొంత భవనాన్ని నిర్మించుకున్నారు. ఇంటి చుట్టూ మొక్కల పెంపకం కోసం ఖాళీ ఉంచుకున్నారు. మామిడి, జామ చెట్లు పెంచుతున్నారు.

ఈ దశలో తుమ్మేటి రఘోత్తమరెడ్డి మిద్దె తోట చూసి స్ఫూర్తిపొంది మేడపైన 1300 చ.అ.ల ఖాళీ టెర్రస్‌పై నిక్షేపంగా ఇంటిపంటలు పెంచుకోవచ్చని గ్రహించారు. 2016 మేలో మడులు నిర్మించుకొని ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టారు. వర్షాకాలం–చలికాలాల్లో 3–4 నెలల పాటు తమ మిద్దెపై తాము పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలనే తింటున్నారు. ఇతర కాలాల్లో పాక్షికంగా తమ మిద్దెతోట ఉత్పత్తులపై ఆధారపడుతున్నామని రమేశ్‌బాబు తెలిపారు.

మట్టి రెండు పాళ్లు, ఒక పాలు గొర్రెల ఎరువును కలిపిన మట్టిమిశ్రమంతో కుండీలు, మడుల్లో సేంద్రియ ఇంటి పంటలు పండిస్తున్నారు. 4 అడుగుల వెడల్పున ఎత్తు మడులను ఇటుకతో సిమెంటు మడులు నిర్మించి ఆకుకూరలు, టమాటా, ఎర్ర/పచ్చ బెండ మొక్కలు సాగు చేస్తున్నారు. కొన్ని సిమెంటు తొట్లను ఏర్పాటు చేసుకొని దానిమ్మ, సీతాఫలం చెట్లు పెంచుతున్నారు. పాత ఎయిర్‌కూలర్‌ టబ్‌లలో ఆకుకూరలు వేశారు. 30 మట్టి కుండీల్లో మొక్కజొన్న విత్తారు. పాలకూర, చుక్క, బచ్చలి, వామ, బచ్చలి, గోంగూరలతోపాటు విదేశీ ఆకుకూర లెట్యూస్‌ను కూడా సాగు చేస్తున్నారు.

బీట్‌రూట్, క్యారెట్‌ దుంప పంటలున్నాయి. రమేశ్‌బాబు మిద్దెతోట ప్రత్యేకతల్లో ఒకటి.. నిలువు పందిళ్లు. టెర్రస్‌ అంచుల్లో గోడకు నిలువు పందిళ్లు వేసి.. నేతిబీర, పొట్ల తీగలను పాకించారు. ఎత్తుమడిలో వేసిన టమాటా మొక్కలకు పందిరి వేసి, మొక్కలు పడిపోకుండా ఉండేందుకు గుడ్డ పేలికలతో పందిరి కర్రలకు కట్టారు. దీంతో అన్ని మొక్కలకు సమానంగా ఎండ తగిలి, చీడపీడల బెడద అంతగా లేకుండా ఉంటుందని రమేశ్‌బాబు తెలిపారు.

సేంద్రియ ఇంటిపంటల రుచి అద్భుతం
సేంద్రియ ఇంటిపంటల రుచి అద్భుతమని చెబుతూ.. తమ మేడపై పెరిగిన క్యాబేజి, బెండకాయలు, చుక్కకూరలను రుచి చూసిన తన బంధుమిత్రుల్లో చాలా గిరాకీ ఉందని రమేశ్‌బాబు (90327 70630) చమత్కరించారు. ఇంటిపంటలైనా, పూలైనా దేశీ వంగడాలు పెంచుకోవడమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. ఫేస్‌బుక్‌/టెలిగ్రాం బృందాల ద్వారా తమ అనుభవాలను ఇతరులకు పంచుతూ మరి కొన్ని కుటుంబాలను ఇంటిపంటల సాగుకు ఉపక్రమించేలా స్ఫూర్తినిచ్చిన రమేశ్‌బాబు, సావిత్రి దంపతులకు ‘సాక్షి ఇంటిపంట’ హృదయపూర్వకంగా అభినందిస్తోంది!

అమృత్‌మట్టిలో ఆరోగ్యవంతమైన పంటలు
టెర్రస్‌ మీద అడుగునే ఇటుకలను మూడు వరుసలుగా పేర్చిన మడిలో అమృత్‌ మట్టిని తయారు చేస్తూ వాటంతట అవే మొలిచిన పంటలను ఆయన సాగు చేస్తున్నారు. గొర్రెల ఎరువు, మట్టి మిశ్రమంలో సాగవుతున్న పంటలకు, అమృత్‌ మట్టిలో సాగవుతున్న పంటలకు స్పష్టమైన వ్యత్యాసం ఉన్నట్లు తాను గమనించానన్నారు. ఎండాకులు, కొమ్మలు, రెమ్మలను అమృత్‌జల్‌(గోమూత్రం, పేడ, బెల్లం కలిపి తయారు చేస్తారు)లో రోజంతా నానబెట్టి మడిలో వేసిన తర్వాత అనేక దశల్లో అమృత్‌ మిట్టి రూపొందుతుంది. నెల తర్వాత నవధాన్యాలు చల్లి 22 రోజులకోసారి, 42 రోజులకోసారి ఆ మొక్కలను పిలకలు కత్తిరించి అమృత్‌ మట్టి మడిలోనే ఆచ్ఛాదనగా వేయాలి.

63 రోజులకు పెరిగిన మొక్కలను మరోసారి కత్తిరించి ఆచ్ఛాదనగా వేయాలి. అయితే, అమృత్‌ మట్టి తయారీని ప్రారంభించిన నెల రోజులకే వర్షాలు రావటంతో నేతిబీర, దొండ మొక్కలు మొలిచాయి. వీటిని పీకెయ్యడం ఎందుకులే అని అలాగే వదిలేశారు. కుండీలు, మడుల్లో పెరిగే తీగజాతి కూరగాయల కన్నా అమృత్‌ మట్టిలో పెరిగే ఇంటిపంటలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయని, చీడపీడల బెడద కూడా తక్కువేనని రమేశ్‌బాబు అన్నారు. సాధారణ మట్టిమిశ్రమం కన్నా అమృత్‌మట్టిలో పంటలు వేసుకోవడమే ఉత్తమన్నది అనుభవపూర్వకంగా గ్రహించానని, దీని వల్ల మడుల బరువు కూడా తగ్గిపోతుందని రమేశ్‌బాబు తెలిపారు.


అమృత్‌మట్టి మడి; మొక్కజొన్న కుండీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement