Green leafy vegetables and vegetable cultivation
-
తపన కొద్దీ ఇంటిపంటలు!
రసాయనిక అవశేషాల్లేని తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలన్న తపన ఉండాలే గానీ దంపతులిద్దరూ ఉద్యోగస్తులైనా ఇంటిపట్టునే పండించుకోవడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని కరీంనగర్‌కు చెందిన దంపతులు సూదం రమేశ్‌బాబు, సావిత్రి దంపతులు చాటిచెబుతున్నారు. సావిత్రి కరీంగనర్ పోలీసు శాఖలో సినియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. జమ్మికుంటలో పుట్టిన రమేశ్‌బాబు గ్రానైట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కరీంనగర్లో స్థిరపడ్డారు. నగర శివార్లలోని తీగలగుట్టపల్లెలో సొంత భవనాన్ని నిర్మించుకున్నారు. ఇంటి చుట్టూ మొక్కల పెంపకం కోసం ఖాళీ ఉంచుకున్నారు. మామిడి, జామ చెట్లు పెంచుతున్నారు. ఈ దశలో తుమ్మేటి రఘోత్తమరెడ్డి మిద్దె తోట చూసి స్ఫూర్తిపొంది మేడపైన 1300 చ.అ.ల ఖాళీ టెర్రస్‌పై నిక్షేపంగా ఇంటిపంటలు పెంచుకోవచ్చని గ్రహించారు. 2016 మేలో మడులు నిర్మించుకొని ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టారు. వర్షాకాలం–చలికాలాల్లో 3–4 నెలల పాటు తమ మిద్దెపై తాము పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలనే తింటున్నారు. ఇతర కాలాల్లో పాక్షికంగా తమ మిద్దెతోట ఉత్పత్తులపై ఆధారపడుతున్నామని రమేశ్‌బాబు తెలిపారు. మట్టి రెండు పాళ్లు, ఒక పాలు గొర్రెల ఎరువును కలిపిన మట్టిమిశ్రమంతో కుండీలు, మడుల్లో సేంద్రియ ఇంటి పంటలు పండిస్తున్నారు. 4 అడుగుల వెడల్పున ఎత్తు మడులను ఇటుకతో సిమెంటు మడులు నిర్మించి ఆకుకూరలు, టమాటా, ఎర్ర/పచ్చ బెండ మొక్కలు సాగు చేస్తున్నారు. కొన్ని సిమెంటు తొట్లను ఏర్పాటు చేసుకొని దానిమ్మ, సీతాఫలం చెట్లు పెంచుతున్నారు. పాత ఎయిర్‌కూలర్ టబ్‌లలో ఆకుకూరలు వేశారు. 30 మట్టి కుండీల్లో మొక్కజొన్న విత్తారు. పాలకూర, చుక్క, బచ్చలి, వామ, బచ్చలి, గోంగూరలతోపాటు విదేశీ ఆకుకూర లెట్యూస్‌ను కూడా సాగు చేస్తున్నారు. బీట్రూట్, క్యారెట్ దుంప పంటలున్నాయి. రమేశ్‌బాబు మిద్దెతోట ప్రత్యేకతల్లో ఒకటి.. నిలువు పందిళ్లు. టెర్రస్ అంచుల్లో గోడకు నిలువు పందిళ్లు వేసి.. నేతిబీర, పొట్ల తీగలను పాకించారు. ఎత్తుమడిలో వేసిన టమాటా మొక్కలకు పందిరి వేసి, మొక్కలు పడిపోకుండా ఉండేందుకు గుడ్డ పేలికలతో పందిరి కర్రలకు కట్టారు. దీంతో అన్ని మొక్కలకు సమానంగా ఎండ తగిలి, చీడపీడల బెడద అంతగా లేకుండా ఉంటుందని రమేశ్‌బాబు తెలిపారు. సేంద్రియ ఇంటిపంటల రుచి అద్భుతం సేంద్రియ ఇంటిపంటల రుచి అద్భుతమని చెబుతూ.. తమ మేడపై పెరిగిన క్యాబేజి, బెండకాయలు, చుక్కకూరలను రుచి చూసిన తన బంధుమిత్రుల్లో చాలా గిరాకీ ఉందని రమేశ్‌బాబు (90327 70630) చమత్కరించారు. ఇంటిపంటలైనా, పూలైనా దేశీ వంగడాలు పెంచుకోవడమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్/టెలిగ్రాం బృందాల ద్వారా తమ అనుభవాలను ఇతరులకు పంచుతూ మరి కొన్ని కుటుంబాలను ఇంటిపంటల సాగుకు ఉపక్రమించేలా స్ఫూర్తినిచ్చిన రమేశ్‌బాబు, సావిత్రి దంపతులకు ‘సాక్షి ఇంటిపంట’ హృదయపూర్వకంగా అభినందిస్తోంది! అమృత్‌మట్టిలో ఆరోగ్యవంతమైన పంటలు టెర్రస్ మీద అడుగునే ఇటుకలను మూడు వరుసలుగా పేర్చిన మడిలో అమృత్ మట్టిని తయారు చేస్తూ వాటంతట అవే మొలిచిన పంటలను ఆయన సాగు చేస్తున్నారు. గొర్రెల ఎరువు, మట్టి మిశ్రమంలో సాగవుతున్న పంటలకు, అమృత్ మట్టిలో సాగవుతున్న పంటలకు స్పష్టమైన వ్యత్యాసం ఉన్నట్లు తాను గమనించానన్నారు. ఎండాకులు, కొమ్మలు, రెమ్మలను అమృత్‌జల్(గోమూత్రం, పేడ, బెల్లం కలిపి తయారు చేస్తారు)లో రోజంతా నానబెట్టి మడిలో వేసిన తర్వాత అనేక దశల్లో అమృత్ మిట్టి రూపొందుతుంది. నెల తర్వాత నవధాన్యాలు చల్లి 22 రోజులకోసారి, 42 రోజులకోసారి ఆ మొక్కలను పిలకలు కత్తిరించి అమృత్ మట్టి మడిలోనే ఆచ్ఛాదనగా వేయాలి. 63 రోజులకు పెరిగిన మొక్కలను మరోసారి కత్తిరించి ఆచ్ఛాదనగా వేయాలి. అయితే, అమృత్ మట్టి తయారీని ప్రారంభించిన నెల రోజులకే వర్షాలు రావటంతో నేతిబీర, దొండ మొక్కలు మొలిచాయి. వీటిని పీకెయ్యడం ఎందుకులే అని అలాగే వదిలేశారు. కుండీలు, మడుల్లో పెరిగే తీగజాతి కూరగాయల కన్నా అమృత్ మట్టిలో పెరిగే ఇంటిపంటలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయని, చీడపీడల బెడద కూడా తక్కువేనని రమేశ్‌బాబు అన్నారు. సాధారణ మట్టిమిశ్రమం కన్నా అమృత్‌మట్టిలో పంటలు వేసుకోవడమే ఉత్తమన్నది అనుభవపూర్వకంగా గ్రహించానని, దీని వల్ల మడుల బరువు కూడా తగ్గిపోతుందని రమేశ్‌బాబు తెలిపారు. అమృత్‌మట్టి మడి; మొక్కజొన్న కుండీలు -
ఆస్పత్రిలో అమృతాహారం!
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కి పేరు. దీన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేశారు. ఇది 500 పడకల ఆసుపత్రి. ఇక్కడి రోగులకు ఆసుపత్రి సేవల్లో భాగంగా భోజనం అందుతుంది. వారికి సహాయకులుగా వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం బయట క్యాంటీన్లకు వెళ్లాల్సి వచ్చేది. వారికి కూడా ఆసుపత్రి ప్రాంగణంలోనే భోజనం అందిస్తే బాగుంటుందనే ఆలోచనతో సత్యసాయి సేవాదళ్ ట్రస్టు ఆధ్వర్యంలో మూడేళ్ల క్రితం ఉచిత నిత్యాన్నదానం ప్రారంభించారు. మధ్యాహ్నం 300–350 మంది వరకూ, రాత్రి పూట 300 మంది వరకూ రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ఇందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలనే ఉపయోగిస్తుండటం విశేషం. రిమ్స్ ప్రాంగణంలో నిత్యాన్నదానం క్యాంటీన్లో అన్నంతో పాటు సాంబారు, ఒక కూర, పచ్చడితో అరటిపండు, బొప్పాయి పండ్ల ముక్కలు కూడా అందిస్తున్నారు. తొలుత ఈ క్యాంటీన్‌కు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు మొత్తం బయట మార్కెట్లోనే కొనుగోలు చేసేవారు. అలాగాకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేసిన ఆకుకూరలు, కూరగాయలైతే రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మేలైనవనే ఉద్దేశంతో శ్రీకాకుళానికి చెందిన సామాజిక సేవకురాలు పేర్ల అనురాధ చొరవ చూపి కూరగాయల సాగు ప్రారంభించారు. ఇప్పుడు క్యాంటీన్లో రోజువారీ అవసరాలకు ఈ ప్రకృతి సాగు తోట నుంచే వెళ్తున్నాయి. ‘‘నిత్యాన్నదానం కోసం కేటాయించిన భవనం వెనుక దాదాపు వెయ్యి గజాల ఖాళీ స్థలం వృథాగా ఉండేది. దీనిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా ప్రకృతి సేద్య విధానంలో పండించిన కూరగాయలు, ఆకుకూరల రుచి చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి ఇంటి వద్ద కొన్నిరకాల కూరగాయల మొక్కలు పెంచేవాళ్లం. ఆ ఆసక్తితోనే రిమ్స్‌లో ఆ ఖాళీ స్థలం ప్రకృతి సాగు కోసం ఇవ్వాలని జిల్లా కలెక్టరును కోరాం. రెండేళ్ల క్రితం అనుమతి రాగానే బయటి నుంచి సారవంతమైన మట్టి తెప్పించి వేయించాం. పశువుల గెత్తం కూడా వేశాం. తొలుత టమాటా, మునగ, వంకాయలు, పచ్చిమిర్చి సాగు ప్రారంభించాం. తర్వాత ముల్లంగి, దొండ, గోంగూర, కొత్తిమీర.. వేశాం. వాటిలో అత్యధికంగా గోంగూర, కొత్తిమీర రోజువారీ వంటకు సరిపోతోంది. సాంబారులో వాడకానికి కంది కూడా పండిస్తున్నాం. కరివేపాకు, కొత్తిమీర, గోంగూర పూర్తిగా ఇక్కడిదే వంటకు వినియోగిస్తున్నాం. వీటికి రసాయనిక ఎరువులు వేయలేదు. కేవలం వర్మికంపోస్టు ఎరువు తీసుకొచ్చి వేస్తున్నాం. చీడపీడల సమస్య కూడా కనిపించలేదు. ఎప్పుడైనా కనిపిస్తే దశపత్ర కషాయం, వేపనూనె పిచికారీ చేయిస్తున్నాం. పంటల మధ్యలో బంతి మొక్కలు పెంచడం ద్వారా చీడపీడలను నియంత్రిస్తున్నాం. పచ్చిమిర్చి రోజూ రెండు మూడు కిలోల వరకూ వస్తాయి. వచ్చే వేసవిలో అందుబాటులోకి వచ్చేలా ఇప్పుడు కొన్ని రకాల కూరగాయల మొక్కలు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సాయి భక్తులు కాళీప్రసాద్, అన్నపూర్ణ గార్ల సహకారంతో అరటితో పాటు మామిడి, సపోట, ఉసిరి, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు పెంచుతున్నాం. సాక్షి ‘సాగుబడి’లో వచ్చే కథనాలు, సూచనలు మాకెంతో ఉపయోగపడుతున్నాయి. ఈ స్ఫూర్తితో శ్రీకాకుళంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద పూలమొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే పెంచుతున్నాం. ప్రతిరోజూ పూజలకు వాటి పూలు సరిపోతున్నాయి’’ అని అనురాధ చెబుతున్నారు. – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, ఫొటోలు: కుప్పిలి జయశంకర్ -
రాయిలాపూర్.. కూరగాయల సాగులో జోరు
మేడ్చల్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని రాయిలాపూర్ కూరగాయల సాగుకు పెట్టింది పేరు. సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ వ్యయసాయం లాభసాటిదని వీరు నిరూపిస్తున్నారు. ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుంటూ లాభాలబాటలో పయనిస్తున్నారు. సాగులో డ్రిప్, స్ప్రింక్లర్లు వినియోగిస్తూ తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధిస్తున్నారు. గ్రామంలో దాదాపు 200 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, పుదినా, టమాట, బెండ, దొండ, సోరకాయ, వంకాయ, మిర్చి తదితరవాటిని ఇక్కడ ప్రధానంగా సాగు చేస్తున్నారు. మండల వ్యవసాయాధికారులు, గ్రామంలోని ఆదర్శ రైతులు కలిసి రైతులకు పంటల సాగులో తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి లభిస్తున్న అవకాశాలను రైతులకు వివరించి వారిని సబ్సిడీపై ట్రాక్టర్లు, డ్రిప్ పరికరాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ కూరగాయలు సాగు చేస్తున్న వందమంది రైతుల్లో 50 మంది యువకులే కావడం గమనార్హం. వీరిలో కూడా డిగ్రీలు చదివిన వారున్నారు. ఈ గ్రామంలో కూరగాయలు సాగవుతున్న దాదాపు అన్ని పొలాలకు డ్రిప్, స్ప్రింకర్ల సదుపాయం ఉండటం విశేషం. డ్రిప్ సదుపాయంతో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని ఈ గ్రామ రైతులు చెబుతున్నారు. బిందుసేద్యం ద్వారా వ్యవసాయం చేస్తే కనీసం 50శాతం అధికంగా దిగుబడులు సాధించవచ్చని వారు పేర్కొంటున్నారు. కూలీల కొరత లేదు.. రాయిలాపూర్‌లో కుటుంబ సభ్యులందరూ సాగులో పాలు పంచుకుంటారు. పెద్దలు, పిల్లలు అన్న తేడా లేకుండా అందరూ ఇక్కడ సాగులో మమేకమవుతున్నారు. పెద్దలు విధిగా పొలాల్లో పనులు చేసుకుంటుండగా, పిల్లలు మాత్రం పాఠశాలలకు సెలవులు ఉన్న రోజు పొలాల్లో పనులు చేస్తూ కాలం గడుపుతారు. ఇలా అందరూ సాగులో భాగమవుతుం డటంతో ఇక్కడ కూలీలకు కొరత అనేదే లేదు. రాయిలాపూర్‌లో సాగు చేసిన కూరగాయలను నగరానికి తరలిస్తున్నారు. ఎకరా అంతకంటే తక్కువ భూమిలో సాగు చేస్తున్న రైతులు మాత్రం పొలాల్లోనే వ్యాపారులకు కూరగాయలను విక్రయిస్తున్నారు. కూరగాయల ధరలకు మార్కెట్లో స్థిరత్వం లేకపోవడంపై వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వారం కిలో రూ. 30 ఉండే టమాట, మరో వారం రూ. 2కు కూడా అమ్ముడు పోవడం లేదని చెబుతున్నారు. ధరల్లో స్థిరత్వం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మరింత మంది రైతులు కూరగాయల సాగుపై దృష్టి పెట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా మేడ్చల్‌లో మార్కెట్ ఏర్పాటు చేస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని, నగరానికి కూరగాయలు తరలించడంతో రవాణా ఖర్చు అధికమవుతున్నట్లు చెబుతున్నారు.