మేడ్చల్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని రాయిలాపూర్ కూరగాయల సాగుకు పెట్టింది పేరు. సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ వ్యయసాయం లాభసాటిదని వీరు నిరూపిస్తున్నారు. ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుంటూ లాభాలబాటలో పయనిస్తున్నారు. సాగులో డ్రిప్, స్ప్రింక్లర్లు వినియోగిస్తూ తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధిస్తున్నారు.
గ్రామంలో దాదాపు 200 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, పుదినా, టమాట, బెండ, దొండ, సోరకాయ, వంకాయ, మిర్చి తదితరవాటిని ఇక్కడ ప్రధానంగా సాగు చేస్తున్నారు. మండల వ్యవసాయాధికారులు, గ్రామంలోని ఆదర్శ రైతులు కలిసి రైతులకు పంటల సాగులో తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి లభిస్తున్న అవకాశాలను రైతులకు వివరించి వారిని సబ్సిడీపై ట్రాక్టర్లు, డ్రిప్ పరికరాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు.
ఇక్కడ కూరగాయలు సాగు చేస్తున్న వందమంది రైతుల్లో 50 మంది యువకులే కావడం గమనార్హం. వీరిలో కూడా డిగ్రీలు చదివిన వారున్నారు. ఈ గ్రామంలో కూరగాయలు సాగవుతున్న దాదాపు అన్ని పొలాలకు డ్రిప్, స్ప్రింకర్ల సదుపాయం ఉండటం విశేషం. డ్రిప్ సదుపాయంతో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని ఈ గ్రామ రైతులు చెబుతున్నారు. బిందుసేద్యం ద్వారా వ్యవసాయం చేస్తే కనీసం 50శాతం అధికంగా దిగుబడులు సాధించవచ్చని వారు పేర్కొంటున్నారు.
కూలీల కొరత లేదు..
రాయిలాపూర్‌లో కుటుంబ సభ్యులందరూ సాగులో పాలు పంచుకుంటారు. పెద్దలు, పిల్లలు అన్న తేడా లేకుండా అందరూ ఇక్కడ సాగులో మమేకమవుతున్నారు. పెద్దలు విధిగా పొలాల్లో పనులు చేసుకుంటుండగా, పిల్లలు మాత్రం పాఠశాలలకు సెలవులు ఉన్న రోజు పొలాల్లో పనులు చేస్తూ కాలం గడుపుతారు. ఇలా అందరూ సాగులో భాగమవుతుం డటంతో ఇక్కడ కూలీలకు కొరత అనేదే లేదు.
రాయిలాపూర్‌లో సాగు చేసిన కూరగాయలను నగరానికి తరలిస్తున్నారు. ఎకరా అంతకంటే తక్కువ భూమిలో సాగు చేస్తున్న రైతులు మాత్రం పొలాల్లోనే వ్యాపారులకు కూరగాయలను విక్రయిస్తున్నారు. కూరగాయల ధరలకు మార్కెట్లో స్థిరత్వం లేకపోవడంపై వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వారం కిలో రూ. 30 ఉండే టమాట, మరో వారం రూ. 2కు కూడా అమ్ముడు పోవడం లేదని చెబుతున్నారు.
ధరల్లో స్థిరత్వం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మరింత మంది రైతులు కూరగాయల సాగుపై దృష్టి పెట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా మేడ్చల్‌లో మార్కెట్ ఏర్పాటు చేస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని, నగరానికి కూరగాయలు తరలించడంతో రవాణా ఖర్చు అధికమవుతున్నట్లు చెబుతున్నారు.
రాయిలాపూర్.. కూరగాయల సాగులో జోరు
Published Sun, Feb 9 2014 3:00 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement