ఇంటిపంటలతో ఉషారాణి; నీరు చిలికితే విత్తనాలు చెదిరిపోకుండా వస్త్రం కప్పాలి..
వేసవి ఇంటి పంటల కోసం కూరగాయల నారు పోసుకోవడానికి ఇది తగిన సమయం. కొబ్బరి పొట్టు, వర్మీకంపోస్టు లేదా కంపోస్టు, మట్టి కలిపిన మిశ్రమంలో నారు పోసుకోవచ్చు. నారు పోసుకునే ట్రే లేదా మడి మరీ ఎక్కువ లోతున మట్టి మిశ్రమం వేయనవసరం లేదు. జానెడు లోతు ఉంటే సరిపోతుంది.
మట్టి మిశ్రమాన్ని ట్రేలో నింపిన తర్వాత వేళ్లతో లేదా పుల్లతో సాళ్లు మాదిరిగా చేసుకోవాలి. ఆ సాళ్లలో విత్తనాలు విత్తుకున్న తర్వాత పక్కన మట్టిని కప్పి చదరంగా చేయాలి. విత్తనాలు మరీ లోతున పడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ట్రే పైన గుడ్డ కప్పాలి. తడి ఆరిపోకుండా చూసుకుంటూ.. నీటిని తేలిగ్గా చిలకరించాలి. మట్టిలో విత్తనాలు నీరు చిలకరించినప్పుడు చెదిరిపోకుండా ఉండాలంటే.. పల్చటి గుడ్డను కప్పి.. దానిపైన నీటిని చిలకరించాలి.
చలి ఉధృతంగా ఉంది. కాబట్టి విత్తనం మొలక రావాలంటే కొంత వెచ్చదనం కావాలి. నారు పోసుకునే ట్రే పైన పాలిథిన్ షీట్ చుట్టినట్టయితే 5–7 రోజుల్లో మొలక రావడానికి అవకాశం ఉంటుంది. మొలక వచ్చిన తర్వాత పాలిథిన్ షీట్‌ను తీసేయవచ్చు.
వేసవిలో కాపు వచ్చే అవకాశం ఉన్న ఏమేమి రకాల కూరగాయలకు ఇప్పుడు నారు పోసుకోవచ్చు? అన్నది ప్రశ్న. చలికాలంలో మాత్రమే వచ్చే నూల్‌కోల్, క్యాబేజి, కాలీఫ్లవర్ వంటì వాటిని ఇప్పుడు విత్తుకోకూడదు. వంగ (గ్రీన్ లాంగ్, పర్పుల్ లాంగ్, పర్పుల్ రౌండ్, గ్రీన్ రౌండ్), మిర్చి (ఎల్లో కాప్సికం, రెడ్ కాప్సికం, గ్రీన్ చిల్లీ, ఆర్నమెంటల్ చిల్లీ), టమాట (సాధారణ రకం, స్ట్రాబెర్రీ టమాట)తోపాటు.. వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి, బ్రకోలి, క్యారట్, స్కార్లెట్ రకాలను ఇప్పుడు టెర్రస్‌పై ట్రేలలో ఇంటిపంటల సాగు కోసం విత్తుకోవచ్చు. వేసవిలో కూరగాయలను పొందాలనుకునే వారు వెంటనే విత్తుకోవాలి.
– ఉషారాణి (81217 96299), వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు,రాజేంద్రనగర్, సేంద్రియ ఇంటి పంటల సాగుదారు
విత్తనాలను ఇలాకప్పేయాలి, ఇలా విత్తుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment