వర్షాభావం...కరెంటు కోతలు... తగ్గిపోయిన భూగర్భజలాలు..కళ్లముందే నాశమైపోతున్న పంటలు...లక్షల రూపాయలు పెట్టుబడి...రోజుల తరబడి చేసిన రెక్కల కష్టం.. అంతా వృధా..మెతుకుసీమ రైతుల కష్టాలివి. అయినా చాలా మంది సాగునీరు తగినంత లేకపోయినా చెరువుకిందో..బావికిందో వరిసాగు చేస్తారు..మళ్లీ మళ్లీ నష్టపోతారు.
కానీ గంగాపూర్ వాసులు మాత్రం కష్టాల సాగుకు స్వస్తి పలికారు. ఉన్న నీటితోనే పండే ఆరుతడి పంటలైన కూరగాయల సాగుపై దృష్టి సారించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ అందరికీ స్ఫూర్తి నిలుస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోలేక ఆత్మహత్యలే దిక్కనుకుంటున్న రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.
చిన్నకోడూరు, న్యూస్‌లైన్: మండలంలోని గంగాపూర్ ఓ చిన్న గ్రామం. గ్రామంలోని వారంతా దాదాపు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు వెయ్యి ఎకరాల భూమి ఉండగా, సాగులో ఉన్నది మాత్రం 400 ఎకరాలు. అందులోనూ 250పైగా ఎకరాల సాగులో ఉన్నది కూరగాయల పంటలే. వర్షాభావం..సాగునీరు లభ్యత తక్కువగా ఉండడం..కరెంటు కోతల నేపథ్యంలో ఈ గ్రామంలోని రైతులంతా ఆరుతడి పంటలైన కూరగాయలు సాగుకు సిద్ధయ్యారు.
మిర్చి, టమాట, బెండకాయల, ఆకుకూరలను పండిస్తున్నారు. పెట్టుబడి తక్కువ...ఆదాయం ఎక్కువగా ఉండడంతో ఒకరిని చూసి మరొకరు ఇలా గ్రామంలోని రైతులంతా కూరగాయల బాటే పట్టారు. వీరు పండించిన పంటలను సమీపంలోని సిద్దిపేట, కరీంనగర్ మార్కెట్లో విక్రయిస్తారు. వెంటనే పైసలొస్తాయి...చేసిన కష్టం మరచిపోతారు. అందుకే చాలా మంది రైతులు ఇంటికి కావాల్సిన మేరకు వరి పండించి...మిగతా పొలంలో కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
శ్రమకు తగ్గ ఫలితం ఉంది
కూరగాయల పంటలను సాగు చేయడం వల్ల శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుందని పలువురు రైతులు అంటున్నారు. ముఖ్యంగా మిర్చి విత్తనాలను ఒక్కసారి నాటితే పదిహేను రోజులకు ఒక సారి పంట దిగుబడి వస్తుంది. ఈ విధంగా నెలల తరబడి రావడంతో రైతులు ఈ పంటను నిరంతరంగా పండిస్తున్నారు. వీరు చేసే సాగులో కనీసం ఒక ఎకరం మిర్చి, కూరగాయల సాగు ఉండటం విశేషం. తక్కువ పెట్టుబడులతో మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయలను సరఫరా చేస్తుండటం రైతులకు మంచి ఆదాయ మార్గంగా మారింది.
ప్రోత్సాహం అవసరం
ఆరుతడి పంటలే సాగు చేయాలంటూ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న గంగాపూర్ రైతులను ప్రోత్సాహించాల్సి ఉంది. రాయితీపై కూరగాయల విత్తనాలు, డ్రిప్ పరికరాలు, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తే సాగు విస్తీర్ణం మరింత పెంచుతామంటున్నారు గంగాపూర్ రైతులు. అంతేకాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలతో సూచనలు, సలహాలు ఇప్పించడంతో పాటు పంటల కొనుగోలు, రవాణా బాధ్యత సర్కార్ తీసుకుంటే తమకు మేలు జరుగుతుందని వారంతా చెబుతున్నారు.
కూరల ఊరు గంగాపూరు
Published Sun, Jan 19 2014 1:34 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement