‘ఉద్యాన’ రైతులకు 90 రోజులు సబ్సిడీపై అందజేస్తాం
పరికరాల కోసం రైతుల నుంచి రోజూ దరఖాస్తుల స్వీకరణ
వచ్చే మార్చికల్లా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ లక్ష్యం చేరాలి
వ్యవసాయ, అనుబంధ శాఖల సమీక్షలో మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతులకు రానున్న 90 రోజులపాటు ప్రతీరోజు రూ.కోటి విలువైన డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. ఇందుకోసం రైతుల నుంచి ఈ 90 రోజులపాటు నిత్యం దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
కొంతకాలంగా నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని యాసంగి నుంచి అమలుచేసి రైతులకు నాణ్యమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పామ్‌తోపాటు ఉద్యాన పంటలకు కూడా డ్రిప్, స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు 2.31 లక్షల ఎకరాలకు చేరిందని తెలిపారు. ఆయిల్‌పామ్ ప్లాంటేషన్‌లో తక్కువ పురోగతి ఉన్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, వచ్చే ఏడాది మార్చికల్లా ముందుగా నిర్దేశించిన లక్ష ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు.
8.59 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ
రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు మార్కెటింగ్ శాఖ అధికారులు 3,56,633 మంది రైతుల నుంచి మద్దతు ధరతో 8,59,272.68 మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించినట్లు అధికారులు మంత్రి తుమ్మలకు వివరించారు. గత సంవత్సరం ఇదే సమయానికి 1,99,108.43 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించినట్లు గుర్తుచేశారు. మరో రెండు నెలలపాటు పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
అలాగే, ప్రాథమిక సహకార సంఘాల పనితీరు మెరుగుపరిచి ఎక్కువ మంది రైతులకు వాటి సేవలు చేరేలా నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆ శాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్‌కుమార్, హారి్టకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment