Drip equipment
-
రోజూ రూ.కోటి డ్రిప్ పరికరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతులకు రానున్న 90 రోజులపాటు ప్రతీరోజు రూ.కోటి విలువైన డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. ఇందుకోసం రైతుల నుంచి ఈ 90 రోజులపాటు నిత్యం దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.కొంతకాలంగా నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని యాసంగి నుంచి అమలుచేసి రైతులకు నాణ్యమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పామ్‌తోపాటు ఉద్యాన పంటలకు కూడా డ్రిప్, స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు 2.31 లక్షల ఎకరాలకు చేరిందని తెలిపారు. ఆయిల్‌పామ్ ప్లాంటేషన్‌లో తక్కువ పురోగతి ఉన్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, వచ్చే ఏడాది మార్చికల్లా ముందుగా నిర్దేశించిన లక్ష ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. 8.59 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు మార్కెటింగ్ శాఖ అధికారులు 3,56,633 మంది రైతుల నుంచి మద్దతు ధరతో 8,59,272.68 మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించినట్లు అధికారులు మంత్రి తుమ్మలకు వివరించారు. గత సంవత్సరం ఇదే సమయానికి 1,99,108.43 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించినట్లు గుర్తుచేశారు. మరో రెండు నెలలపాటు పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే, ప్రాథమిక సహకార సంఘాల పనితీరు మెరుగుపరిచి ఎక్కువ మంది రైతులకు వాటి సేవలు చేరేలా నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆ శాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్‌కుమార్, హారి్టకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ క్యాన్ డ్రిప్!
సేంద్రియ ఇంటిపంటల సాగులో ద్రవ జీవామృతం, ఆవుమూత్రం, జీవన ఎరువులను కూరగాయ మొక్కలకు సులభంగా అందించడానికి ఉపయోగపడే అతి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి ఇది. పుల్లయ్యగారి బ్రహ్మానందరెడ్డి, అనిత దంపతులు వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో తమ ఇంటి వద్ద పెరట్లో కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడం రెండు నెలల క్రితం ప్రారంభించారు. తాము నివాసం ఉండే భవనం పక్కనే 40 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవున ఖాళీ స్థలం(ఎర్ర నేల)లో సేంద్రియ పెరటి తోట సాగు చేస్తున్నారు. ఈ పెరటి తోటకు రోజువారీగా నీటిని, జీవామృతం, జీవన ఎరువులు వంటి ద్రవ రూప ఎరువులను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో అందించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఇంటిపైన నిర్మించిన వాటర్ ట్యాంకు నుంచి నీటిని సరఫరా చేసే పైపునకు గేట్ వాల్ సిస్ఠం ఏర్పాటు చేసుకొని.. ఇన్లైన్ డ్రిప్పర్ లైన్ల ద్వారా నీటిని కూరగాయ మొక్కలకు అందిస్తున్నారు. రోజువారీగా నీటిని అందించడానికి ఇది పనికొచ్చింది. అయితే, ద్రవ రూప ఎరువులను కూడా నీటితోపాటే అందించేదెలా? అని ఆలోచించారు. తాగునీటి సరఫరా కోసం ఉపయోగించే 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను ఏర్పాటు చేసి, దీని ద్వారా డ్రిప్ లైన్‌ను అనుసంధానం చేస్తూ సునాయాసంగా ద్రవ రూప ఎరువులను సైతం ఇంటిపంటలకు ఇవ్వగలుగుతున్నారు. తొలుత నీరు.. తర్వాత ద్రవ రూప ఎరువులు.. మిత్రుడు ప్రకృతి వ్యవసాయదారుడు ప్రవీణ్‌కుమార్ రెడ్డి తోడ్పాటుతో అనేక రకాల ప్రయోగాలు చేసే క్రమంలో ఈ ‘లో కాస్ట్ ఫర్టిగేషన్ సిస్టమ్ ఫర్ కిచెన్/టెర్రస్/అర్బన్ గార్డెనింగ్’ను రూపొందించామని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. వడకట్టిన ద్రవజీవామృతం లేదా ఆవు మూత్రం లేదా అజోస్పిరిల్లమ్, ఫాస్పోబాక్టీరియా వంటి జీవన ఎరువుల ద్రావణాలను 3 రోజులకు ఒక్కో రకాన్ని ఇంటిపంటలకు అందిస్తున్నారు. 20 లీటర్ల వాటర్ క్యాన్‌లో 2 నుంచి 4 లీటర్ల ద్రవ జీవామృతం లేదా ఆవు మూత్రం లేదా జీవన ఎరువుల ద్రావణాన్ని కలుపుతారు. పెరటి తోటలో బ్రహ్మానందరెడ్డి, అనిత ద్రవ రూప ఎరువుల సరఫరా ఇలా.. వాటర్ క్యాన్‌కు పైన ఎయిర్ వాల్వ్ బిగించారు. ఎయిర్ వాల్వ్ మూతను విప్పి.. అందులో నుంచి వాటర్ క్యాన్లోపలికి ద్రవ రూప ఎరువులను వడకట్టి పోస్తారు. ఆ తర్వాత డ్రిప్ ద్వారా నీటిని వదులుతారు. వాటర్ క్యాన్ లోపలకు నీరు వెళ్లేందుకు కింది భాగం నుంచి ఒక ఇన్లెట్, బయటకు నీరు పోవడానికి పై భాగంలో ఒకటి, కింది భాగంలో మరొకటి అవుట్ లెట్లను బిగించారు. ద్రవ రూప ఎరువులను వాటర్ క్యాన్ ద్వారా నీటితో కలిపి వెళ్లేలా చేయాలనుకున్నప్పుడు.. క్యాన్ పై భాగంలోని అవుట్ లెట్ ద్వారా నీటిని బయటకు వెళ్లేలా చేస్తారు. అలా చేయడం ద్వారా 10–15 నిమిషాల పాటు ద్రవరూప ఎరువులు నీటితో కొద్దికొద్ది కలిసి ఇంటిపంటలకు సరఫరా అవుతున్నదని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అవుట్ లెట్ మొదట కింది భాగంలో మాత్రమే ఏర్పాటు చేశానని, అప్పుడు 5 నిమిషాల్లోనే ద్రవ రూప ఎరువు పూర్తిగా వెళ్లిపోయేదన్నారు. క్యాన్‌కు పై భాగంలో అవుట్ లెట్ ఏర్పాటు చేయడం వల్ల 10–15 నిమిషాల పాటు ద్రవ రూప ఎరువుతో కూడిన నీటిని 70 అడుగుల పొడవు డ్రిప్ వరుసలో ఉన్న చివరి మొక్కలకు కూడా అందించగలుగుతున్నామని ఆయన వివరించారు. రసాయనిక అవశేషాల్లేని మిర్చి, వంగ, బీర, సొర, టమాటాలతోపాటు గోంగూర, చుక్క, పాల కూరలను పండించి, బంధుమిత్రులకు కూడా రుచి చూపిస్తున్నామని బ్రహ్మానందరెడ్డి(94411 85563), అనిత సంతోషంగా తెలిపారు. -
డ్రిప్ పరికరాల దొంగ అరెస్ట్
అనంతపురం: అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగుచింతలపల్లి గ్రామంలో డ్రిప్ పరికరాల చోరీకి పాల్పడుతున్న ఓ దొంగను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి కొన్ని డ్రిప్ పరికరాలు, 6,100 మీటర్ల పైపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. -
కూరల ఊరు గంగాపూరు
వర్షాభావం...కరెంటు కోతలు... తగ్గిపోయిన భూగర్భజలాలు..కళ్లముందే నాశమైపోతున్న పంటలు...లక్షల రూపాయలు పెట్టుబడి...రోజుల తరబడి చేసిన రెక్కల కష్టం.. అంతా వృధా..మెతుకుసీమ రైతుల కష్టాలివి. అయినా చాలా మంది సాగునీరు తగినంత లేకపోయినా చెరువుకిందో..బావికిందో వరిసాగు చేస్తారు..మళ్లీ మళ్లీ నష్టపోతారు. కానీ గంగాపూర్ వాసులు మాత్రం కష్టాల సాగుకు స్వస్తి పలికారు. ఉన్న నీటితోనే పండే ఆరుతడి పంటలైన కూరగాయల సాగుపై దృష్టి సారించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ అందరికీ స్ఫూర్తి నిలుస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోలేక ఆత్మహత్యలే దిక్కనుకుంటున్న రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. చిన్నకోడూరు, న్యూస్‌లైన్: మండలంలోని గంగాపూర్ ఓ చిన్న గ్రామం. గ్రామంలోని వారంతా దాదాపు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు వెయ్యి ఎకరాల భూమి ఉండగా, సాగులో ఉన్నది మాత్రం 400 ఎకరాలు. అందులోనూ 250పైగా ఎకరాల సాగులో ఉన్నది కూరగాయల పంటలే. వర్షాభావం..సాగునీరు లభ్యత తక్కువగా ఉండడం..కరెంటు కోతల నేపథ్యంలో ఈ గ్రామంలోని రైతులంతా ఆరుతడి పంటలైన కూరగాయలు సాగుకు సిద్ధయ్యారు. మిర్చి, టమాట, బెండకాయల, ఆకుకూరలను పండిస్తున్నారు. పెట్టుబడి తక్కువ...ఆదాయం ఎక్కువగా ఉండడంతో ఒకరిని చూసి మరొకరు ఇలా గ్రామంలోని రైతులంతా కూరగాయల బాటే పట్టారు. వీరు పండించిన పంటలను సమీపంలోని సిద్దిపేట, కరీంనగర్ మార్కెట్లో విక్రయిస్తారు. వెంటనే పైసలొస్తాయి...చేసిన కష్టం మరచిపోతారు. అందుకే చాలా మంది రైతులు ఇంటికి కావాల్సిన మేరకు వరి పండించి...మిగతా పొలంలో కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శ్రమకు తగ్గ ఫలితం ఉంది కూరగాయల పంటలను సాగు చేయడం వల్ల శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుందని పలువురు రైతులు అంటున్నారు. ముఖ్యంగా మిర్చి విత్తనాలను ఒక్కసారి నాటితే పదిహేను రోజులకు ఒక సారి పంట దిగుబడి వస్తుంది. ఈ విధంగా నెలల తరబడి రావడంతో రైతులు ఈ పంటను నిరంతరంగా పండిస్తున్నారు. వీరు చేసే సాగులో కనీసం ఒక ఎకరం మిర్చి, కూరగాయల సాగు ఉండటం విశేషం. తక్కువ పెట్టుబడులతో మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయలను సరఫరా చేస్తుండటం రైతులకు మంచి ఆదాయ మార్గంగా మారింది. ప్రోత్సాహం అవసరం ఆరుతడి పంటలే సాగు చేయాలంటూ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న గంగాపూర్ రైతులను ప్రోత్సాహించాల్సి ఉంది. రాయితీపై కూరగాయల విత్తనాలు, డ్రిప్ పరికరాలు, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తే సాగు విస్తీర్ణం మరింత పెంచుతామంటున్నారు గంగాపూర్ రైతులు. అంతేకాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలతో సూచనలు, సలహాలు ఇప్పించడంతో పాటు పంటల కొనుగోలు, రవాణా బాధ్యత సర్కార్ తీసుకుంటే తమకు మేలు జరుగుతుందని వారంతా చెబుతున్నారు.