లోటుకు జవాబు.. పెంపే | 6 lakh above metric tonnes of vegetable deficit over state requirements | Sakshi
Sakshi News home page

లోటుకు జవాబు.. పెంపే

Published Sun, Jan 20 2019 1:24 AM | Last Updated on Sun, Jan 20 2019 1:24 AM

6 lakh above metric tonnes of vegetable deficit over state requirements - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కూరగాయల ఉత్పత్తిలో రాష్ట్రం అత్యంత వెనుకబడి ఉంది. దీంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడమే సరైన పరిష్కారమని ఉద్యానశాఖ భావించి తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రజలు రోజువారీ ప్రధానంగా 20 రకాల కూరగాయలను వినియోగిస్తుంటారు. ఇలా ఏడాదికి 22.28 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు అవసరం కాగా, కేవలం 15.94 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే లభిస్తున్నాయి. అంటే 6.34 లక్షల మెట్రిక్‌ టన్నుల లోటు ఉంది. ఈ 20 రకాల్లో టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి వంటి ఆరు రకాలు అవసరానికి మించి ఉత్పత్తి అవుతుండగా, పచ్చిమిర్చి, కాకర , బీర, సొరకాయ, దోసకాయ, బీన్స్, క్యాప్సికం, బంగాళదుంప, చేమగడ్డ, క్యారట్, కందగడ్డ, ఆకుకూరలు, ఉల్లిగడ్డలు సహా 14 రకాలకు తీవ్ర కొరత నెలకొని ఉంది. ఇక ఆరు రకాల్లో వినియోగం 7.99 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఉత్పత్తి 8.66 లక్షల మెట్రిక్‌ టన్నులుంది. అంటే 66,760 మెట్రిక్‌ టన్నులు అదనంగా ఉత్పత్తి అవుతున్నాయి. మిగిలిన 14 రకాలు 14.29 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా, ఉత్పత్తి 7.28 లక్షల మెట్రిక్‌ టన్ను లు మాత్రమే . ఈ 14 రకాల వరకు చూస్తే దాదాపు సగం అంటే 7.01 లక్షల మెట్రిక్‌ టన్నుల కొరత ఉంది. దీంతో ఈ సాగును అదనంగా 2.13 లక్షల ఎకరాల్లో చేయాలని ఉద్యానశాఖ ప్రతిపాదించింది.  

ఎనిమిది రకాల పండ్లకూ కొరతే... 
రాష్ట్రంలో వినియోగించే ఎనిమిది రకాల పండ్ల ఉత్పత్తి తక్కువగా ఉంది. జామ, ద్రాక్ష, యాపి ల్, కర్బూజ, నేరేడు, అరటి, పైన్‌ ఆపిల్, దాని మ్మ అవసరానికంటే 4.46 లక్షల మెట్రిక్‌ టన్నుల లోటు ఉంది. యాపిల్‌ ఇక్కడ పండే పంట కాదు కాబట్టి ఆ చర్చ లేదు. జామ 23 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో కేవలం 13 వేల మెట్రిక్‌ టన్నులే పండుతోంది. ద్రాక్ష 27 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా, కేవలం 3 వేల మెట్రిక్‌ టన్నులే ఉత్పత్తి అవుతోంది. అరటి పండ్లు 3.39 లక్షల మెట్రిక్‌ టన్నులు గాను, 73 వేల మెట్రిక్‌ టన్నులే . దానిమ్మ 49 వేల మెట్రిక్‌ టన్నులకు గాను, కేవలం 11 వేల మెట్రిక్‌ టన్నులే ఉత్పత్తి అవుతోంది.

ఆయా పండ్ల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే అదనంగా 38 వేల ఎకరాల్లో పండ్ల సాగు చేయా లని ఉద్యానశాఖ ప్రభుత్వానికి నివేదించింది. మామిడి, బొప్పాయి, పుచ్చకాయ, సపోటా, కమలా, బత్తాయి పండ్ల ఉత్పత్తి అవసరానికి మించి 9.43 లక్షల మెట్రిక్‌ టన్నులు అదనంగా ఉత్పత్తి అవుతుండటం గమనార్హం. అందులో మన జనాభాకు మామిడి 60 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా, 4.82 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అవుతోంది. బొప్పాయి 3 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో 51 వేల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అవుతోంది. అదనంగా ఉత్పత్తి అవు తున్న పండ్లను ఎగుమతి చేయాలని ఉద్యానశాఖ భావిస్తోంది.అందుకోసం ఆహారశుద్ధి పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం నెలకొని ఉంది. కొరత నెలకొన్న పండ్ల కోసం అదనంగా 38 వేల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement