బత్తాయి చెట్ల నుంచి పండ్లు కోసే రోబోని ఇజ్రేలుకు చెందిన కంపెనీ నానోవెల్ రూపొందించింది. దీనికి వివిధ ఎత్తుల్లో 6 రోబోటిక్ చేతుల్ని అమర్చారు. తోట మధ్యలో వెళ్తూ చెట్టు కొమ్మలకు తగినంత సైజు పెరిగిన, పక్వానికి వచ్చి రంగు మారిన పండ్లను కృత్రిమ మేధతో గుర్తించి కోసేలా దీన్ని రూపొందించారు. వాక్యూమ్ టెక్నాలజీతో పండును పట్టుకొని, తొడిమెను కత్తిరిస్తుంది. చేతిలోకి వచ్చిన పండు కన్వేయర్ బెల్ట్ ద్వారా బుట్ట లోకి చేరుతుంది. ఈ పనులన్నీ రోబో తనంతట తానే చేసేస్తుంది. దూరం నుంచి చూస్తే చిన్న చక్రాలున్న షెడ్డు మాదిరిగా కనిపించే ఈ రోబో.. ప్రస్తుతం ఒక ట్రాక్టర్ లాక్కెళ్తూ ఉంటే పండ్లను కోస్తుంది. మున్ముందు ట్రాక్టర్ అవసరం లేకుండా తనంతట తానే కదిలి వెళ్లేలా దీన్ని మెరుగు పరచనున్నట్లు నానోవెల్ కంపెనీ ప్రకటించింది.
అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో భారీ బత్తాయి తోటల యజమానులను కోత కూలీల కొరత వేధిస్తోంది. ఈ రోబో వారికి ఊరటనిస్తుందని నానోవెల్ ఆశిస్తోంది. కాలిఫోర్నియా సిట్రస్ రీసెర్చ్ బోర్డుతో ఒప్పందం చేసుకున్న ఈ కంపెనీ బత్తాయిలు కోసే ఈ రోబో పనితీరును కాలిఫోర్నియా బత్తాయి, నారింజ తోటల్లో పరీక్షంచబోతున్నది. అక్కడి భారీ కమతాల్లో సాగయ్యే సిట్రస్ పండ్ల తోటల అవసరాలకు అనుగుణంగా ఈ రోబోకు అవసరమైన మార్పులు చేర్పులు చేయబోతున్నారు.
ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లండన్‌లో జరిగే వరల్డ్ అగ్రి–టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో కూడా ఈ రోబోను ప్రదర్శించబోతున్నామని నానోవెల్ సీఈవో ఇసాక్ మేజర్ చెప్పారు. భారీ తోటల్లో పండ్ల కోత కూలీల కొరతను ఎదుర్కొంటున్న అమెరికా, స్పెయిన్, ఇటలీ తదితర దేశాల్లో ఈ భారీ రోబోకు ఆదరణ బాగుంటుందని భావిస్తున్నామన్నారు. అంటే, సమీప భవిష్యత్తులో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఇటువంటి రోబోలు రాబోతున్నాయి.
పండ్లను కోయటంతో పాటు మిగిలిన కాయలు ఎన్ని ఎప్పటికి కోతకు వస్తాయి? తోటలో చెట్ల స్థితిగతులపై కూడా గణాంకాలను ఈ రోబో సేకరించటం వల్ల తోట యజమానులకు వెసులుబాటు కలుగుతుంది.
ఆరు రోబోటిక్ చేతులతో ఏకకాలంలో పనిచేసే ఈ భారీ రోబో గంటకు బుట్ట (400 కిలోల) ఆరెంజ్‌లను కోయగలదు. రాత్రీ పగలు తేడా లేకుండా 24 గంటల్లో 20 బుట్టల (8 టన్నులు) పండ్లు కోయగలదు. అందువల్ల దీన్ని ‘బాహుబలి రోబో’ అనొచ్చు! ఇక ధర ఎంతో.. అంటారా? అది కూడా భారీగానే ఉంటుంది మరి!
Comments
Please login to add a commentAdd a comment