సాగుకు స్కానింగ్‌ | State govt has focused exclusively on Collection of crops data | Sakshi
Sakshi News home page

సాగుకు స్కానింగ్‌

Published Sun, Jan 20 2019 2:11 AM | Last Updated on Sun, Jan 20 2019 2:16 AM

State govt has focused exclusively on Collection of crops data - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వివిధ ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునే పరిస్థితికి చరమగీతం పాడాలని, రైతు ఆదాయాన్ని మరింత పెంచాలని భావిస్తోంది. విరివిగా ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపించాలని యోచిస్తోంది. అందుకు రాష్ట్ర వ్యవసాయాన్ని పంట కాలనీలుగా తయారు చేయాలని నిర్ణయించింది. ఇటీవల సీఎం కేసీఆర్‌ వ్యవసాయశాఖ, దాని అనుబంధ విభాగ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు పంట కాలనీల ఏర్పాటుపై సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. పంటల వివరాలతో పాటు రైతుల వివరాలను సేకరించనుంది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 60 లక్షల మంది రైతులు ఒక్కొక్కరు ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేస్తారో తెలుసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. దాదాపు 3 నెలల పాటు సర్వే చేపట్టాలని నిర్ణయించింది.

అందుకు అవసరమైన 26 అంశాలతో కూడిన నమూనా సర్వే పత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) రైతుల వద్దకు వెళ్లి ఈ సమాచారాన్ని సేకరించనున్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణను ఈ నెల 25 లోపు పూర్తిచేసి, వచ్చే ఖరీఫ్‌లో పైలట్‌ ప్రాజెక్టు కింద పంట కాలనీలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఈవోలు సేకరించే సమాచారంతో పట్టాదారు నంబర్, రైతు పేరు, తండ్రి పేరు, ఆధార్‌ నంబర్, పుట్టిన తేదీ, ఫోన్‌ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, సామాజిక పరిస్థితి, ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణం ఉంది సర్వే నంబర్‌ వారీగా నమోదు చేసుకుంటారు. నీటి సదుపాయం, బోరు బావుల ద్వారా ఎంత పండుతుంది.. కాలువల కింద ఎంత సాగవుతుందో అంచనా వేస్తారు. వర్షాధార సాగు విస్తీర్ణం, భూసార పరీక్ష కార్డులు అందాయో లేదో సేకరిస్తారు. 

పంట రకం.. దిగుబడి కూడా.. 
సాగయ్యే పంటలు.. వాటిల్లో ఏ రకం, ఏ సర్వే నంబర్‌తో ఎంత విస్తీర్ణంతో సాగు చేస్తున్నారో ప్రత్యేక టేబుల్‌లో నమోదు చేస్తారు. ఎంత దిగుబడి వస్తుందో కూడా తెలుసుకుంటారు. ఇలా ఖరీఫ్, రబీలకు వేర్వేరుగా వివరాలు నమోదు చేస్తారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మనీటి సేద్యం ఎంతమేరకు అందుబాటులో ఉందనే వివరాలను సేకరించనుంది. పంట రుణాలు కూడా ఎంత మొత్తంలో తీసుకున్నారు.. ఎంత విస్తీర్ణంలో పంటకు బీమా చేయించారనే సమగ్ర వివరాలు నమో దు చేయనున్నారు. పండించిన పంటలో మార్కెట్‌లో ఎంత విక్రయించారనే వివరాలు కూడా ఉంటా యి. అధిక ఉత్పత్తి ఉన్న పంటలకు ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపన ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులను స్వయం సహాయక బృందాల ద్వారా ప్రోత్సహించటానికి ఈ ప్రణాళిక రూపొందిస్తున్నారు. 

వచ్చే ప్రయోజనం?
రాష్ట్రంలో రైతులు సంప్రదాయ పంటలనే సాగు చేస్తున్నారు. లాభ నష్టాలను లెక్క చేయకుండా జీవనం కోసం పంటలు పండిస్తున్నారు. దీనివల్ల అనేకసార్లు రైతులు నష్టాల పాలవుతున్నారు. పంటలు సరిగా పండకపోవడం, పండినా మద్దతు ధర రాకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. శాస్త్రీయ అంచనా లేకుండా ఎవరికి వారు ఇలా పంటలు సాగు చేస్తుండటంతో రైతుల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ఈ దుస్థితిని మార్చాలని సీఎం కేసీఆర్‌ ఏడాది కిందటే పంట కాలనీలు అంశం తెరపైకి తెచ్చారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండుతాయో శాస్త్రీయ పద్ధతిలో గుర్తించి, ఆ మేరకు పంట కాలనీలు ఏర్పాటు చేస్తారు.  

ఉదాహరణకు..
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మిరప పంట అధికంగా సాగవుతుందనుకుందాం. ఆ ప్రాంతాన్ని మిర్చి పంట కాలనీగా ప్రకటిస్తారు. ఆ మేరకు రైతులకు అవసరమైన సాంకేతిక సాయం అందజేస్తారు. నాణ్యమైన విత్తనాలను అందిస్తారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేలా అవగాహన కల్పిస్తారు. మార్కెట్‌లో దానికి సరైన ధర అందించేలా ప్రభుత్వమే పూనుకుంటుంది. మిర్చితో కారం పొడి తయారు చేయించేలా ప్రత్యేకంగా ఆహారశుద్ధి పరిశ్రమ నెలకొల్పుతారు. నిజామాబాద్‌ జిల్లాలో పసుపు పండే ప్రాంతాన్ని కూడా ఓ పంట కాలనీగా గుర్తిస్తారు. రాష్ట్రానికి అవసరమైన కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు 60 శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయని మార్కెటింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

కూరగాయలు పండించే ప్రాంతాల రైతులకు అవసరమైన సాయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూరగాయలు పండించే ప్రాంతాలను కూడా పంట కాలనీలుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో ఏ పంటలకు కొరత ఉందో గుర్తించి ఆ మేరకు కొత్త పంటలను ప్రోత్సహిస్తారు. పంట కాలనీల ప్రధాన ఉద్దేశం స్వయం సమృద్ధి. కాబట్టి రాష్ట్రంలో ప్రజలు ఏ ఆహారాలను ఏ మోతాదులో వినియోగిస్తున్నారన్న దానిపై గతేడాది జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమగ్ర సర్వే నిర్వహించింది. ఆ నివేదికను సీఎంకు అందజేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement