
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద ఐదో రోజు సోమవారం రూ.1,047.41 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 4,89,189 మంది రైతుల ఖాతాల్లోకి ఈ రైతుబంధు నిధులు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు 57,60,280 మంది రైతులకు రూ.5,294.09 కోట్లు పంపిణీ చేశామని వెల్లడించారు.
20–30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా ఒకప్పుడు తెలంగాణలో కంట్రోల్ బియ్యం కోసం ఎదురుచూసిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో సాగునీటి వసతి కల్పన, వ్యవసాయ అనుకూల పథకాలు, విధానాలతో వ్యవసాయ రంగ స్వరూపం మారిందని పేర్కొన్నారు. రైతుబంధు కింద రైతులకు రూ.50 వేల కోట్లు అందజేసిన పథకం ప్రపంచంలో, దేశంలో ఎక్కడాలేదని నిరంజన్‌రెడ్డి తెలిపారు.