సాక్షి, హైదరాబాద్ : రైతుబంధు పథకంలో కీలక మార్పులు జరగనున్నాయి. ఎన్ని ఎకరాలు ఉన్నా రైతుబంధు సొమ్ము అందజేయాలనే నిబంధనను మార్చాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ, పది ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని నిర్ణయించి, ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిపాదన పంపినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థికమాంద్యం నేపథ్యంలో దీన్ని వచ్చే రబీ నుంచి లేదా ఆ తర్వాత వచ్చే ఖరీఫ్ నుంచి అమలు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
‘‘నిబంధనల్లో మార్పు చేసినా ప్రతీ రైతుకు రైతుబంధు సొమ్ము అందుతుంది. అయితే పదెకరాలకు మించి భూమి ఉన్నా పదెకరాల వరకు మాత్రమే సొమ్ము ఇవ్వా లనేది ఆలోచన’’అని ఆ వర్గాలు వివ రించాయి. అయితే ముఖ్యమంత్రి దీనిపై అంతగా సుముఖంగా లేరని తెలిసింది. ఎంత భూమి ఉన్నా ఇస్తా మని రైతులకు హామీ ఇచ్చినందున, మాట తప్పకూడదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆర్థికశాఖ మాత్రం పదెకరాల సీలింగ్ అమలు చేస్తే ఏడాదికి దాదాపు రూ.2వేల కోట్ల వరకు మిగులుతాయని, తద్వారా అనేక శాఖల్లో అమలు చేస్తున్న పథకాలకు నిధులు ఖర్చు చేయడానికి వీలు పడుతుందని చెబుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ నుంచి వచ్చిన ప్రతిపాదన ప్రకారమే వ్యవసాయశాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఎకరానికి రూ.10వేలు...
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఖరీఫ్‌లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత ఖరీఫ్, రబీల్లో కలిపి ఎకరానికి రూ.8వేల చొప్పున రైతులకు అందజేసింది. 53 లక్షల మంది రైతులకు దాదాపు రూ.10వేల కోట్లు చెల్లించింది. ఈ ఏడాది నుంచి ప్రతి ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయించింది. ఆ మేరకు ఇప్పటికే ఖరీఫ్‌లో ఎకరాకు రూ.5వేల చొప్పున అందజేస్తోంది.
ఇప్పటివరకు 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,400 కోట్లు జమ చేసింది. మరో 14 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లో దాదాపు రూ.2వేల కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే, వంద ఎకరాలు ఉన్న రైతుకు కూడా రైతుబంధు ఇస్తుండటంతో గ్రామాల్లోనూ, వివిధ వర్గాల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధనిక రైతులకు ఇవ్వాల్సిన అవసరముందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుబంధుకు పదెకరాలు సీలింగ్ అమలు చేస్తే ఇలాంటి విమర్శలు వచ్చ అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ ఈ మేరకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment