సాక్షి, హైదరాబాద్: రైతుబంధు యాసంగి సీజన్ నిధులు వచ్చే నెలాఖరు వరకు రైతుల ఖాతాల్లో పడతాయని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 64.95 లక్షల మంది రైతులకు చెందిన 1.47 కోట్ల ఎకరాలకు రూ. 7,372.56 కోట్లు చెల్లించారు. ఒక్కో రైతుకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రైతుబంధు సొమ్ము అందింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 30 ఎకరాల వరకు సాగు భూములున్న రైతులకు రైతుబంధు సొమ్ము విడుదల చేశారు. ప్రస్తుత యాసంగి సీజన్‌కు మరికొందరు రైతులు కొత్తగా వచ్చే అవకాశం ఉందని, ఆ ప్రకారం రూ. 7,500 కోట్ల వరకు విడుదల చేయాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.
రైతుబంధు సొమ్ము కోసం ఎదురుచూపు...
యాసంగి సీజన్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నెల రోజులు దాటింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన సాగు పనులు జరుగుతున్నాయి. అయితే రైతులు అందుకు అవసరమైన పెట్టుబడి సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా సీజన్ ప్రారంభమైన సమయంలోనే రైతుబంధు నిధులు అందజేయాలన్నది ఉద్దేశం. కానీ సకాలంలో వివరాలు పంపకపోవడం తదితర కారణాలతో రైతుబంధు సొమ్ము రైతులకు చేరడంలో ఆలస్యం అవుతుంది. దీంతో రైతులు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
వానాకాలం సీజన్‌లో వేసిన పత్తి దిగుబడి తగ్గుతుండటం, గతం కంటే ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులకు నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో యాసంగికి పెట్టుబడులు పెట్టాలంటే సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావును ‘సాక్షి’ వివరణ కోరగా గత యాసంగిలో డిసెంబర్ చివరి నాటికి రైతుబంధు నిధులు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈసారి ఎప్పుడు విడుదల చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment