ఆహారభద్రత నిధులపై చిన్నచూపు.. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి | Central Govt Neglect On NFSM Funds To Telangana | Sakshi
Sakshi News home page

ఆహారభద్రత నిధులపై చిన్నచూపు.. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి

Published Mon, Aug 1 2022 1:34 AM | Last Updated on Mon, Aug 1 2022 2:43 PM

Central Govt Neglect On NFSM Funds To Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు జాతీయ ఆహార భద్రతా మిషన్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) నిధులను కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఐదేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని వ్యవసాయ శాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పంటల ఉత్పాదకతను పెంచడం ద్వారా ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచాలన్నదే జాతీయ ఆహార భద్రతా మిషన్‌ ప్రధాన లక్ష్యం.

మెరుగైన వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. అందులో భాగంగా అధిక దిగుబడినిచ్చే రకాలు, హైబ్రిడ్‌ విత్తనాల పంపిణీ, వ్యవసాయ యంత్రాలు సమకూర్చడం ద్వారా రైతులకు ఉపయోగపడాలి. సమర్థవంతమైన పంట సంరక్షణ చర్య లు, పోషకాల నిర్వహణ, భూసారం పెంచే చర్య లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, పంటకోత అనంత రం ఉపయోగించే పరికరాలతోపాటు పంటలకు సంబంధించి రైతులకు శిక్షణ ఇవ్వాలి. ఇంతటి కీలకమైన లక్ష్యాలతో ఏర్పాటైన  మిషన్‌ను రాష్ట్రంలో అమలు చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపు, విడుదలలో కేంద్రం నిర్లక్ష్యం కనిపిస్తోందని అధికారులు అంటున్నారు.  

రాష్ట్రానికి అన్యాయం.. 
ఆహార భద్రతా మిషన్‌ కింద కేంద్రం 60 శాతం నిధులు కేటాయిస్తే, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కలిపి పనులు చేయాల్సి ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో కేంద్రం కేటాయింపుల్లో 60 శాతం ఇవ్వడంలేదని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. 2021–22లో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 1,471 కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణకు కేంద్రం రూ.21.94 కేటాయించింది. కానీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇలా గోవా, తెలంగాణలకే నిధులు కేటాయించలేదని అంటున్నాయి. మిషన్‌ కింద గతేడాది అత్యధికంగా మధ్యప్రదేశ్‌కు రూ.282.67 కోట్లు కేటాయించిన కేంద్రం, రూ. 169.56 కోట్లు విడుదల చేసింది. రాజస్థాన్‌కు రూ.199.50 కోట్లు కేటాయించి, రూ.89.50 కోట్లు విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌కు 119.85 కోట్లు కేటాయించి, రూ. 52.73 కోట్లు విడుదల చేసింది.

తెలంగాణకు ఎందుకు నిధులు విడుదల చేయలేదని అధికారులు ప్రశ్ని స్తున్నారు.  కేంద్రవర్గాలు మాత్రం తెలంగాణ తన వాటా సొమ్ము కేటాయించడంలో అనేకసార్లు విఫ లమైందని అంటున్నాయి. 2019– 20లో 32.65 కోట్లు కేటాయిస్తే, రూ.15.05 కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యాయని, కానీ, రాష్ట్రం రూ.10.91 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెబుతున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement