National Food Security Mission
-
ఆహారభద్రత నిధులపై చిన్నచూపు.. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) నిధులను కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఐదేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని వ్యవసాయ శాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పంటల ఉత్పాదకతను పెంచడం ద్వారా ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచాలన్నదే జాతీయ ఆహార భద్రతా మిషన్ ప్రధాన లక్ష్యం. మెరుగైన వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. అందులో భాగంగా అధిక దిగుబడినిచ్చే రకాలు, హైబ్రిడ్ విత్తనాల పంపిణీ, వ్యవసాయ యంత్రాలు సమకూర్చడం ద్వారా రైతులకు ఉపయోగపడాలి. సమర్థవంతమైన పంట సంరక్షణ చర్య లు, పోషకాల నిర్వహణ, భూసారం పెంచే చర్య లు, ప్రాసెసింగ్ యూనిట్లు, పంటకోత అనంత రం ఉపయోగించే పరికరాలతోపాటు పంటలకు సంబంధించి రైతులకు శిక్షణ ఇవ్వాలి. ఇంతటి కీలకమైన లక్ష్యాలతో ఏర్పాటైన మిషన్‌ను రాష్ట్రంలో అమలు చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపు, విడుదలలో కేంద్రం నిర్లక్ష్యం కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. రాష్ట్రానికి అన్యాయం.. ఆహార భద్రతా మిషన్ కింద కేంద్రం 60 శాతం నిధులు కేటాయిస్తే, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కలిపి పనులు చేయాల్సి ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో కేంద్రం కేటాయింపుల్లో 60 శాతం ఇవ్వడంలేదని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. 2021–22లో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 1,471 కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణకు కేంద్రం రూ.21.94 కేటాయించింది. కానీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇలా గోవా, తెలంగాణలకే నిధులు కేటాయించలేదని అంటున్నాయి. మిషన్ కింద గతేడాది అత్యధికంగా మధ్యప్రదేశ్‌కు రూ.282.67 కోట్లు కేటాయించిన కేంద్రం, రూ. 169.56 కోట్లు విడుదల చేసింది. రాజస్థాన్‌కు రూ.199.50 కోట్లు కేటాయించి, రూ.89.50 కోట్లు విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌కు 119.85 కోట్లు కేటాయించి, రూ. 52.73 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు ఎందుకు నిధులు విడుదల చేయలేదని అధికారులు ప్రశ్ని స్తున్నారు. కేంద్రవర్గాలు మాత్రం తెలంగాణ తన వాటా సొమ్ము కేటాయించడంలో అనేకసార్లు విఫ లమైందని అంటున్నాయి. 2019– 20లో 32.65 కోట్లు కేటాయిస్తే, రూ.15.05 కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యాయని, కానీ, రాష్ట్రం రూ.10.91 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెబుతున్నాయి. -
Andhra Pradesh: ఆర్బీకేలు గొప్ప ప్రయోగం... దేశం మొత్తం మీవైపు చూస్తోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) ద్వారా అమలవుతున్న వివిధ పథకాల అమలుతీరును పరిశీలించేందుకు మిషన్ దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధి డాక్టర్ కె. పొన్నుస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రెండ్రోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించింది. ఎన్ఎఫ్ఎస్ఎం కింద 100% సబ్సిడీపై పంపిణీ చేసిన కంది, మినుము, పెసర, నూనె గింజల మినీ కిట్ల ద్వారా సాగవుతున్న పంట క్షేత్రాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ఇక్కడ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రశంసలు కురిపించింది. చదవండి: ‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట పంట ప్రదర్శన క్షేత్రాల పరిశీలన.. గుంటూరు జిల్లా విట్టంరాజుపల్లి, బ్రాహ్మణపల్లి, ములకనూరులలో కంది క్లస్టర్ ప్రదర్శన క్షేత్రాలను, వెంగళాయపాలెంలో హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టంలో క్లస్టర్ డెమోతో పాటు ఎల్లమంద గ్రామంలోని పొలంబడి క్షేత్రాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం.. కృష్ణాజిల్లా చంద్రగూడెంలో పత్తి, కోడూరులో కంది ప్రదర్శన క్షేత్రాలతోపాటు తుమ్మలపల్లిలో వరి పొలంబడి క్షేత్రాన్ని సందర్శించారు. అంతర పంటల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఆరా తీయగా, ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు వివరించారు. క్షేత్రాల వద్ద రిజిస్టర్ల నిర్వహణ, బోర్డుల ఏర్పాటును పరిశీలించి సిబ్బందిని అభినందించారు. ఆర్బీకే, అగ్రిల్యాబ్స్ సందర్శన గుంటూరు జిల్లా నూజెండ్ల రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే), కృష్ణాజిల్లా ఎ.కొండూరు అగ్రి ల్యాబ్‌లను కూడా బృందం సభ్యులు సందర్శించి వీటి ద్వారా రైతులకందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకే ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను పంపిణీ చేస్తున్నామని సిబ్బంది చెప్పగా.. నిజంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. బుక్ చేసిన 24 గంటల్లోనే అందిస్తున్నారని రైతులు బదులిచ్చారు. కియోస్క్‌లను రైతులు ఎలా వినియోగించుకుంటున్నారో ఆరా తీశారు. వ్యవసాయ, అనుబంధ శాఖల సేవలు, పంటల వారీగా లైబ్రరీలో ఉంచిన పుస్తకాలు, వీడియోలను పరిశీలించి చాలా బాగున్నాయని కితాబిచ్చారు. ఎ.కొండూరు అగ్రిల్యాబ్‌తో పాటు ల్యాబ్‌లోని అత్యాధునిక టెస్టింగ్ పరికరాలను చూసి ఆశ్చర్యపోయారు. చదవండి: రికార్డు సంఖ్యలో ప్రయాణం.. 640 మంది కాదు..823 మంది! త్వరలో కేంద్రానికి నివేదిస్తాం ‘ఇలాంటి అత్యాధునిక ల్యాబ్‌లను దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నాం. ముందుగా నాణ్యత పరీక్షించి సర్టిఫై చేసిన తర్వాత పంపిణీ చేయడంవల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది’.. అని పొన్నుస్వామి అన్నారు. ఆర్బీకేలు, అగ్రిల్యాబ్స్ దేశానికే రోల్ మోడల్‌గా ఉన్నాయన్నారు. ఈ వివ్లవాత్మక మార్పులతో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్న విశ్వాసం తమకుందన్నారు. ఇక్కడ అమలుచేస్తున్న కొన్ని కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలుచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ మేరకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. బృందం వెంట వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు ఎన్‌సి బాలునాయక్.. కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశం మొత్తం మీవైపు చూస్తోంది ► ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక అగ్రిల్యాబ్స్ (33) తమిళనాడులోనే ఉన్నాయనుకునే వాణ్ణి. కానీ, మీ రాష్ట్రంలో ఏకంగా 160 ల్యాబ్స్‌ను తక్కువ సమయంలో ఎంతో నాణ్యతతో ఏర్పాటుచేశారంటే నమ్మలేకపోతున్నా. చాలా బాగున్నాయి. సాగు ఉత్పాదకాలను నేరుగా రైతులకందించాలన్న ఆలోచనతో తీసుకొచ్చిన రైతుభరోసా కేంద్రాలు నిజంగా గొప్ప ప్రయోగం. గ్రామస్థాయిలో రైతులకు ఇంతలా సేవలందిస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని కచ్చితంగా చెప్పగలను. ఈ విషయంలో దేశం మొత్తం మీవైపు చూస్తోంది. ఇక్కడి యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. – డాక్టర్ కె. పొన్నుస్వామి, కేంద్ర ప్రభుత్వ నూనెగింజల అభివృద్ధి సంస్థ జేడీ, జాతీయ ఆహార భద్రతా మిషన్ దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధి -
అధిక దిగుబడికి చేయూత
సాక్షి, అమరావతి: జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద రాష్ట్రంలోని వెనుకబడిన, దిగుబడి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న క్లస్టర్ గ్రూపు రైతులకు ఉత్పాదకాలు కొనుగోలు చేసుకునేందుకు వ్యవసాయ శాఖ ఆర్థిక సాయం అందజేస్తోంది. క్లస్టర్ డెమోస్ పేరిట రాష్ట్ర వ్యవసాయ శాఖ సుమారు 20 వేల ఎకరాల్లో అధికోత్పత్తి సాగు పద్ధతులను రైతులకు నేర్పుతోంది. ఈ కృషిలో తాము సైతం అంటూ కొన్ని పెద్ద పురుగు మందుల, సూక్ష్మ పోషకాల తయారీ సంస్థలు, మొక్కల సంరక్షణ సంస్థలు ముందుకు వచ్చాయి. ఏమిటీ క్లస్టర్ సాగు? రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దిగుబడి తక్కువగా వస్తోంది. దీన్ని పెంచడానికి జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద ‘క్లస్టర్ డెమోస్’ అనే పథకాన్ని ప్రారంభించారు. 50 ఎకరాలను ఒక్కో క్లస్టర్‌గా ఏర్పాటు చేసి మొత్తం 20వేల ఎకరాల్లో ఐదారు రకాల పంటల్ని అధికోత్పత్తి వచ్చేలా రైతులతో సాగు చేయిస్తున్నారు. ఇందుకు కోసం రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఎరువులు, మేలైన విత్తనాలు, సూక్ష్మ పోషకాలతో పాటు రాయితీపై చిన్న యంత్రాలనూ సరఫరా చేస్తున్నారు. క్లస్టర్ల సేవలో ఎంఎన్‌సీలు.. అధికోత్పత్తికి పాటుపడుతున్న రైతులకు తమ వంతు సాయం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు కొన్ని బహుళ జాతి కంపెనీ(ఎంఎన్సీ)లు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థలు తయారు చేసే పురుగు మందులు, సూక్ష్మపోషకాలు వంటి వాటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించాయి. ముందుకు వచ్చిన సంస్థల్లో బేయర్ క్రాప్ సైన్స్, వెల్‌ఆగ్రో, మహాధన్, సల్ఫర్ మిల్స్, ఇండోఫిల్ ఇండస్ట్రీస్, స్వాల్ కార్పొరేషన్, కోరమాండల్ ఇంటర్నేషనల్, సుదర్శన్ ఫార్మ్ కెమికల్స్, ఇన్సెక్టిసైడ్ ఇండియా, నిచినో ఇండియా, యూపీఎల్ లిమిటెడ్, క్రిస్టల్ కార్పొరేషన్ ప్రొటెక్షన్, పారిజాత ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, మార్గో బయో కంట్రోల్స్, సుమిత్రో కెమికల్స్, కోర్టెవా అగ్రీ సైన్స్ తదితరాలు ఉన్నాయి. ప్రభుత్వ సాయానికి ఎంఎన్సీల తోడ్పాటు హెక్టార్‌కు రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు.. ఈ తరహా రైతులందర్నీ ఒక గ్రూపుగా తయారు చేసి ప్రభుత్వం సాయం అందిస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్కో ఎంఎన్సీ ఒక్కో ప్రాంతంలో సాగు చేసే పంటలకు అవి తయారు చేసే మందుల్ని రైతులకు ఉచితంగా అందజేసేందుకు ముందుకువచ్చాయి. – హెచ్.అరుణ్‌కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ -
సబ్సిడీ పెంపుపై కేంద్రానికి నివేదిస్తా
♦ జాతీయ ఆహారభద్రత మిషన్ కన్సల్టెంట్ డాక్టర్ ఉపకార్ సదన్ ♦ అల్లీపూర్లో పప్పుదినుసుల పంటల పరిశీలన ధారూరు: జాతీయ ఆహారభద్రత మి షన్, పప్పు దినుసుల పథకం కింద కేంద్రం రైతులకు అందిస్తున్న 50 శాతం సబ్సిడీని 90 శాతానికి పెంచాలన్న తెలంగాణలోని రైతాంగం సూచనను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానని జాతీయ ఆహారభద్రత మిషన్ కన్సల్టెంట్ డాక్టర్ ఉపకార్ సదన్ అన్నారు. గురువారం ఆయన ధారూరు మండలంలోని అల్లిపూర్ గ్రామంలో సాగుచేసిన కంది, మొక్కజొన్న అంతర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కేంద్రం రైతులకు అం దిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రా మంలో ఎంతమంది రైతులు, ఎన్ని ఎకరాల్లో పప్పుదినుసులు సాగుచేస్తున్నారని ఆయన ప్రశ్నించా రు. 50 మంది రైతులు 200 ఎకరాల్లో సాగుచేస్తున్నారని రాష్ట్ర కన్సల్టెంట్ ఫయూ మ్ తెలిపారు. తాము ముందుగా భూసార పరీక్షలు చే యించి వచ్చిన రిపోర్టు ప్రకారం సాగు చేస్తామని, ట్రైకోడటెర్మాతో విత్తనశుద్ధి చేసి విత్తనాలు వేస్తామని రైతులు చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్కతల గోపాల్ మాట్లాడుతూ రైతులకు స్ప్రింక్లర్లు, పైపులను సబ్సిడీపై అందించాలని కోరారు. కందిలో ఏ రకం విత్తనాలను వాడుతున్నారని, దిగుబడిలో ఏమైనా వ్యత్యాసం ఉందా అని ఉపకార్ సదన్ రైతులను అడిగారు. ఆశా రకం విత్తనాలతో దిగుబడి అధికంగా వస్తుందని రైతులు చెప్పారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న పథకం ఇంకా కొనసాగిం చాలా వద్దా అని ఆయన రైతులను ప్రశ్నించగా మూడు సంవత్సరాల నుంచి కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పప్పు దినులసు పండిస్తున్నామని, అలాగే ఈ పథకాన్ని కొనసాగించాలని వారు సూచించారు. భూముల్లో ఎక్కువగా జింక్ లోపం ఉందని రైతులు ఆయన దృష్టికి తేగా జింక్‌ను బాగా వాడాలని, ఒకసారి వేస్తే 3 సంవత్సరాల వరకు పని చేస్తుందని చెప్పారు. ఉపకార్ సదన్ వెంట రాష్ట్ర కన్సల్టెంట్ ఫయూమ్, జిల్లా ఏడీఏ వీరప్ప, వికారాబాద్ ఏడీఏ దివ్యజ్యోతి, ఏఓ ఝాన్సీలక్ష్మి, ఏఈఓ సంజూరాథోడ్,రైతులు పాల్గొన్నారు. -
వ్యవసాయ అధికారులపై వేటు
♦ రూ. 3.13 కోట్ల అవినీతి.. మెదక్ జేడీఏ సహా ఏడుగురి సస్పెన్షన్ ♦ ఖమ్మం జిల్లాలోనూ రూ. 1.60 కోట్లు పక్కదారి సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో అవినీతి ఆరోపణలకు సంబంధించి మెదక్ జిల్లాకు చెందిన ఏడుగురు అధికారులు, ఉద్యోగులపై వేటు పడింది. ఆ జిల్లా వ్యవసాయ శాఖకు చెందిన రూ. 3.13 కోట్ల నిధులు స్వాహా చేసిన ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించింది. మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు(జేడీఏ), డిప్యూటీ డెరైక్టర్ బి.హుక్యా, అసిస్టెంట్ డెరైక్టర్ కె.పద్మ, వ్యవసాయాధికారి జి.రమేశ్, సూపరింటెండెంట్లు బి.శ్రీనివాస్, కె.కృష్ణారావు, ఆర్‌కేవీవైలో వ్యవసాయ యంత్రాల సెక్షన్‌కు చెందిన సీనియర్ అసిస్టెంట్ శ్యాంసుందర్, జాతీయ ఆహార భద్రత మిషన్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎం.రామును సస్పెండ్ చేస్తూ రాష్ర్ట వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన వీరంతా ప్రభుత్వ అనుమతి లేకుండా మెదక్ జిల్లా కేంద్రం విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. వ్యవసాయ శాఖలో పర్యవేక్షణ లేకపోవడం వల్లే అవినీతి అక్రమాలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, మెదక్ జిల్లాలో అక్రమాల వ్యవహారం బయటపడడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి బుధవారం (27వ తేదీన) జిల్లా వ్యవసాయశాఖ సహాయ సంచాలకులతో సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాల్లో కొనసాగుతున్న పథకాలు, విడుదలైన నిధులు, ఖర్చు అయిన నిధులు, వాటికి సంబంధించిన ఆడిట్ నివేదికలన్నింటినీ తమ వెంట తీసుకురావాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలోనూ.. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ కింద 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం విడుదల చేసిన నిధులు గోల్మాల్ అయ్యాయని తేలింది. ఆ ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నార్మల్ స్టేట్ ప్లాన్(ఎన్ఎస్పీ) కింద రూ.4.79 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం(ఆర్కేవీవై) కింద రూ.2.82 కోట్లు, జాతీయ ఆహార భద్రతా పథకం(ఎన్ఎస్ఎఫ్ఎం) కింద రూ.11.71 కోట్లు మంజూరు చేశాయి. ఈ నిధులను యంత్ర పరికరాలను అందించే కంపెనీల పేరిట చెక్కులను అందించాలి. కానీ అందుకు భిన్నంగా మొత్తం నిధుల్లో దాదాపు రూ.కోటి సెల్ఫ్ చెక్కుల రూపంలో విడుదల చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ నిధులు కంపెనీలకు చేరాయా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో రూ.60 లక్షల మేరకు లెక్కలు సక్రమంగా లేనట్లు సమాచారం. -
రాష్ట్రంలో ఆహార భద్రతపై కేంద్రం దృష్టి
ఈ ఏడాదికి రూ. 89.42 కోట్లు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల్లో ఉత్పత్తి, ఉత్పాదకత పెంచే లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ ఆహార భద్రత మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ ఏడాదికి గాను రూ. 89.42 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద రాష్ట్రం కూడా తన వాటా నిధులను సమకూరుస్తుంది. కేంద్ర నిధుల్లో వరి ఉత్పత్తి కోసం రూ. 34.04 కోట్లు, పప్పుధాన్యాల సాగుకు రూ. 46.45 కోట్లు కేటాయించారు. వరి ఉత్పత్తి కోసం హెక్టారుకు రూ. 7,500 కేటాయిస్తారు. అలాగే భూసారాన్ని కాపాడటం, రైతుల వ్యక్తిగత ఆదాయాన్ని వృద్ధి చేయడం వంటి లక్ష్యాలను కూడా నిర్దేశించారు. అందుకోసం రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రణాళికను తయారుచేసింది. సాగునీటి వనరులు ఉండి ఉత్పాదకత తక్కువ ఉన్న ప్రాంతాలను, అలాగే వర్షాభావ ప్రాంతాలను కూడా గుర్తించాలని నిర్ణయించారు. ఉత్పాదకతను పెంచేందుకు క్లస్టర్లను ఏర్పాటు చేసి మిషన్ కార్యక్రమాలను చేపడతారు. అలాగే ఈ మిషన్ కింద వ్యవసాయ యంత్రాలను ఉపయోగించడం, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను రైతులకు వివరిస్తారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎప్పటికప్పుడు అవసరమైన మేరకు నిధులను అందజేస్తారు. మిషన్‌లో భాగంగా రైతులకు 2,199 పంపుసెట్లను ప్రోత్సాహకంగా అందజేస్తారు. వాటి కోసం రూ. 2.19 కోట్లు కేటాయించారు. అలాగే పచ్చిరొట్ట విత్తనాలను కూడా రైతులకు అందజేస్తారు. మారుమూల ప్రాంతాల్లోని రైతులకు దీనిపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల ద్వారా చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. -
జీవ ఎరువులకు కేంద్రం సబ్సిడీ ఎంత?
* లోక్‌సభలో వైఎస్సార్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రత మిషన్ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ -ఎన్ఎఫ్ఎస్ఎం) కింద జీవ రసాయన ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలో పెరుగుదల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏయే రాష్ట్రానికి ఎంత ఇస్తున్నారు, వాణిజ్య పంటలపై సబ్సిడీ పెంపు ప్రతిపాదనలు తెలియజేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి సంబంధిత మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఎన్ఎఫ్ఎస్ఎం కింద సబ్సిడీని రూ.100 నుంచి రూ.300కి పెంచినట్టు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రాల వారీగా 2014-15 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రూ.46 లక్షల 95 వేలు, తెలంగాణకు రూ. 11 లక్షల 20 వేలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వాణిజ్య పంటలకు సబ్సిడీ పెంపు ప్రతిపాదనలేవీ లేవన్నారు. జంతు సంక్షేమశాలల (యానిమల్ హాస్టల్ స్కీం)పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..అలాంటి ప్రతిపాదనలేవీ లేవని, గుజరాత్లో అమల్లో ఉన్న ఈ పథకాన్ని పరిశీలించి, అభిప్రాయ సేకరణ కోసం నివేదికలను రాష్ట్రాలకు పంపినట్టు తెలిపారు. -
విత్తన గండం
ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ తరుముకొస్తున్నా రైతులు ఇప్పటివరకు విత్తన సేకరణ చేయలేదు. ఇందుకు వ్యవసాయ శాఖపై రైతులకున్న నమ్మకమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. జిల్లాలో 2008లో జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) సబ్సిడీపై విత్తనాల పంపిణీ ప్రారంభించింది. కిలోకు రూ.5 వంతున సబ్సిడీతో వ్యవసాయ శాఖ మండల కార్యాలయాల్లో రైతులకు పంపిణీ చేసేవారు. ఇందుకు అవసరమయ్యే విత్తనాలు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) సరఫరా చేసేది. దీనివల్ల సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. సాగుకు అవసరమయ్యే విత్తనాలు నిల్వచేయడం ఆచరణలో వీరికి సాధ్యంకాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి హెచ్చరికలూ లేకుండానే ఎన్ఎఫ్ఎస్ఎం నుంచి జిల్లాను తొలగించారు. దీంతో విత్తనాల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాణ్యత ప్రశ్నార్థకమే... వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలు రకాల పరీక్షలు జరిగిన అనంతరమే విత్తనాల విక్రయాలు జరిగేవి. దీనివల్ల మొలక శాతం, దిగుబడులలో రైతులకు పూర్తి న్యాయం జరిగేది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే వి కావు. ఇకముందు అలాంటి అవకాశం లేనందున కేవలం ప్రైవేటు డీలర్లు, వ్యాపారుల పైనే ఆధారపడి విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాల్లో నాణ్యత ఏమేరకు ఉండేదీ రైతులకు తెలిసే అవకాశం లేదు. డిమాండ్‌ను బట్టి విత్తన ధరలు రోజురోజుకూ పెంచేసే ప్రమాదముంది. ఇలా అనేక విధాలుగా రైతులు మోసపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఆదర్శ రైతులు పేర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యమే... రైతులకు పూర్తి స్థాయిలో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయడం ప్రభుత్వానికి అసాధ్యం. ఇందుకు ప్రత్యామ్నాయంగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని ఏర్పాటు చేసింది. ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతులతో విత్తనోత్పత్తి చేయించాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులపై ఉంది. ఇందుకుగాను నాణ్యమైన విత్తనాలు ఇవ్వడంతో పాటు తరచూ శిక్షణ తరగతులు నిర్వహించాలి. విత్తన సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి శిక్షణలో రైతులకు తెలపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దీనికోసం అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. అయినప్పటికీ గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని మొక్కుబడిగా అమలు చేస్తున్నారు. దీనివల్ల రైతుల్లో అవగాహన కొరవడి సొంతంగా విత్తన సేకరణ చేయలే కపోతున్నారు. మరో వారంలో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తొలకరి ప్రారంభమైన వెంటనే రైతులు సార్వా నారుమళ్లు పోయాల్సి ఉంది. ఇందుకవసరమయ్యే విత్తన గండాలను ఏవిధంగా అధిగమిస్తారనేది వేచి చూడాల్సిందే.