♦ రూ. 3.13 కోట్ల అవినీతి.. మెదక్ జేడీఏ సహా ఏడుగురి సస్పెన్షన్
♦ ఖమ్మం జిల్లాలోనూ రూ. 1.60 కోట్లు పక్కదారి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో అవినీతి ఆరోపణలకు సంబంధించి మెదక్ జిల్లాకు చెందిన ఏడుగురు అధికారులు, ఉద్యోగులపై వేటు పడింది. ఆ జిల్లా వ్యవసాయ శాఖకు చెందిన రూ. 3.13 కోట్ల నిధులు స్వాహా చేసిన ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించింది. మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు(జేడీఏ), డిప్యూటీ డెరైక్టర్ బి.హుక్యా, అసిస్టెంట్ డెరైక్టర్ కె.పద్మ, వ్యవసాయాధికారి జి.రమేశ్, సూపరింటెండెంట్లు బి.శ్రీనివాస్, కె.కృష్ణారావు, ఆర్కేవీవైలో వ్యవసాయ యంత్రాల సెక్షన్‌కు చెందిన సీనియర్ అసిస్టెంట్ శ్యాంసుందర్, జాతీయ ఆహార భద్రత మిషన్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎం.రామును సస్పెండ్ చేస్తూ రాష్ర్ట వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సస్పెండైన వీరంతా ప్రభుత్వ అనుమతి లేకుండా మెదక్ జిల్లా కేంద్రం విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. వ్యవసాయ శాఖలో పర్యవేక్షణ లేకపోవడం వల్లే అవినీతి అక్రమాలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, మెదక్ జిల్లాలో అక్రమాల వ్యవహారం బయటపడడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి బుధవారం (27వ తేదీన) జిల్లా వ్యవసాయశాఖ సహాయ సంచాలకులతో సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాల్లో కొనసాగుతున్న పథకాలు, విడుదలైన నిధులు, ఖర్చు అయిన నిధులు, వాటికి సంబంధించిన ఆడిట్ నివేదికలన్నింటినీ తమ వెంట తీసుకురావాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలోనూ..
ఖమ్మం జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ కింద 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం విడుదల చేసిన నిధులు గోల్‌మాల్ అయ్యాయని తేలింది. ఆ ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నార్మల్ స్టేట్ ప్లాన్(ఎన్‌ఎస్‌పీ) కింద రూ.4.79 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం(ఆర్‌కేవీవై) కింద రూ.2.82 కోట్లు, జాతీయ ఆహార భద్రతా పథకం(ఎన్‌ఎస్‌ఎఫ్‌ఎం) కింద రూ.11.71 కోట్లు మంజూరు చేశాయి. ఈ నిధులను యంత్ర పరికరాలను అందించే కంపెనీల పేరిట చెక్కులను అందించాలి. కానీ అందుకు భిన్నంగా మొత్తం నిధుల్లో దాదాపు రూ.కోటి సెల్ఫ్ చెక్కుల రూపంలో విడుదల చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ నిధులు కంపెనీలకు చేరాయా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో రూ.60 లక్షల మేరకు లెక్కలు సక్రమంగా లేనట్లు సమాచారం.
వ్యవసాయ అధికారులపై వేటు
Published Tue, Jan 26 2016 12:53 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement