విత్తన గండం
ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ తరుముకొస్తున్నా రైతులు ఇప్పటివరకు విత్తన సేకరణ చేయలేదు. ఇందుకు వ్యవసాయ శాఖపై రైతులకున్న నమ్మకమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. జిల్లాలో 2008లో జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) సబ్సిడీపై విత్తనాల పంపిణీ ప్రారంభించింది. కిలోకు రూ.5 వంతున సబ్సిడీతో వ్యవసాయ శాఖ మండల కార్యాలయాల్లో రైతులకు పంపిణీ చేసేవారు.
ఇందుకు అవసరమయ్యే విత్తనాలు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) సరఫరా చేసేది. దీనివల్ల సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. సాగుకు అవసరమయ్యే విత్తనాలు నిల్వచేయడం ఆచరణలో వీరికి సాధ్యంకాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి హెచ్చరికలూ లేకుండానే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం నుంచి జిల్లాను తొలగించారు. దీంతో విత్తనాల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నాణ్యత ప్రశ్నార్థకమే...
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలు రకాల పరీక్షలు జరిగిన అనంతరమే విత్తనాల విక్రయాలు జరిగేవి. దీనివల్ల మొలక శాతం, దిగుబడులలో రైతులకు పూర్తి న్యాయం జరిగేది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే వి కావు. ఇకముందు అలాంటి అవకాశం లేనందున కేవలం ప్రైవేటు డీలర్లు, వ్యాపారుల పైనే ఆధారపడి విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాల్లో నాణ్యత ఏమేరకు ఉండేదీ రైతులకు తెలిసే అవకాశం లేదు. డిమాండ్‌ను బట్టి విత్తన ధరలు రోజురోజుకూ పెంచేసే ప్రమాదముంది. ఇలా అనేక విధాలుగా రైతులు మోసపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఆదర్శ రైతులు పేర్కొంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే...
రైతులకు పూర్తి స్థాయిలో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయడం ప్రభుత్వానికి అసాధ్యం. ఇందుకు ప్రత్యామ్నాయంగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని ఏర్పాటు చేసింది. ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతులతో విత్తనోత్పత్తి చేయించాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులపై ఉంది. ఇందుకుగాను నాణ్యమైన విత్తనాలు ఇవ్వడంతో పాటు తరచూ శిక్షణ తరగతులు నిర్వహించాలి. విత్తన సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి శిక్షణలో రైతులకు తెలపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దీనికోసం అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తోంది.
అయినప్పటికీ గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని మొక్కుబడిగా అమలు చేస్తున్నారు. దీనివల్ల రైతుల్లో అవగాహన కొరవడి సొంతంగా విత్తన సేకరణ చేయలే కపోతున్నారు. మరో వారంలో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తొలకరి ప్రారంభమైన వెంటనే రైతులు సార్వా నారుమళ్లు పోయాల్సి ఉంది. ఇందుకవసరమయ్యే విత్తన గండాలను ఏవిధంగా అధిగమిస్తారనేది వేచి చూడాల్సిందే.