- విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ఏర్పాట్లు
- యూరియాపై అప్రమత్తత
- ఇప్పటికే 30 వేల మెట్రిక్ టన్నుల నిల్వ
- ఆశావహ దృక్పథంతో రైతుల ముందడుగు
ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ ప్రణాళిక తయారీకి కసరత్తు చేస్తోంది. రెండుమూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తకుండా చూడాలని ప్రయత్నిస్తోంది.. ప్రతిఏటా తలెత్తే ‘యూరియా’ కొరత ఈసారి రాకుండా చూసేందుకు అధికారులు అప్రమత్తమవుతున్నారు. మరోవైపు రైతన్నలు దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు.. ఈసారైనా పరిస్థితి తమకు అనుకూలిస్తుందనే ఆశతో ముందుకు సాగుతున్నారు..
గజ్వేల్: జిల్లాలో ఈసారి సుమారుగా 5.50లక్షల హెక్టార్లకు పైగా వివిధ రకాల పంటలు సాగులోకి రానున్నాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. ఇందులో ప్రధానంగా పత్తి 1.30లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 1.10లక్షల హెక్టార్లు, వరి మరో లక్ష హెక్టార్లు సాగులోకి రావోచ్చని భావి స్తున్నది. మిగతా విస్తీర్ణంలో ఇతర పంటలు సాగవ్వనున్నట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గాల వారీగా విత్తనాలు, ఎరువుల అవసరంపై ఇక్కడి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేసే పనిలో నిమగ్నమయ్యారు.
పంటల సాగు అంచనా ఆధారంగా విత్తనాల రిక్వైర్‌మెంట్‌ను అందజేస్తున్నారు. జిల్లాలో ఆయా నియోజకవర్గాలకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్ కలుపుకొని మొత్తం సుమారుగా 3లక్షలకుపైగా మెట్రిక్ టన్నుల వరకు స్టాకు అవసరమని భావిస్తున్నారు. సీజన్ ముగిసేసరికి 1.20లక్షల యూరియా అవసరముండగా ఇప్పటికే జిల్లాలో 30వేల మెట్రిక్ టన్నుల స్టాకు ఉంచినట్లు వ్యవసాయశాఖ చెబుతోంది. జీలుగ, జనుము మొత్తం 40వేల మెట్రిక్ టన్నుల స్టాకు కావాలని సర్కార్‌ను కోరితే ఇప్పటికే 27వేల మెట్రిక్ టన్నులు కేటాయించారని అధికారులు చెబుతున్నారు.
ఆశావహ దృక్పథంతో..
వరుస కష్టనష్టాలతో సతమతమవుతున్న రైతులు ఈసారైనా పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందనే భావనతో ముందుకు సాగుతున్నారు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా రైతులు పంట నష్టానికి గురై పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయారు. కాలం కలిసొస్తే ఈసారి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకొని కష్టాల నుంచి గట్టెక్కాలని చూస్తున్నారు. ప్రస్తుతం రైతులంతా దుక్కులను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు.
విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తకుండా చూస్తాం..
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి అందజేసే పనిలో ఉన్నాం. అవసరం మేరకు స్టాకు వస్తుంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. - హుక్యానాయక్, జేడీ, వ్యవసాయశాఖ
26జీజేడబ్ల్యూ05: ప్రజ్ఞాపూర్‌లో ఖరీఫ్ కోసం దుక్కిని సిద్ధం చేసిన దృశ్యం
26జీజేడబ్ల్యూ05ఎ: జేడీఏ హుక్యానాయక్
ఖరీఫ్‌కు కసరత్తు!
Published Tue, Apr 28 2015 1:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement