గుంటూరు జిల్లా నూజెండ్ల రైతు భరోసా కేంద్రంలో కియోస్క్ పనితీరును పరిశీలిస్తున్న జాతీయ ఆహార భద్రతా మిషన్ బృందం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) ద్వారా అమలవుతున్న వివిధ పథకాల అమలుతీరును పరిశీలించేందుకు మిషన్ దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధి డాక్టర్ కె. పొన్నుస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రెండ్రోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించింది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం కింద 100% సబ్సిడీపై పంపిణీ చేసిన కంది, మినుము, పెసర, నూనె గింజల మినీ కిట్‌ల ద్వారా సాగవుతున్న పంట క్షేత్రాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ఇక్కడ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రశంసలు కురిపించింది. చదవండి: ‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట
పంట ప్రదర్శన క్షేత్రాల పరిశీలన..
గుంటూరు జిల్లా విట్టంరాజుపల్లి, బ్రాహ్మణపల్లి, ములకనూరులలో కంది క్లస్టర్ ప్రదర్శన క్షేత్రాలను, వెంగళాయపాలెంలో హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టంలో క్లస్టర్ డెమోతో పాటు ఎల్లమంద గ్రామంలోని పొలంబడి క్షేత్రాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం.. కృష్ణాజిల్లా చంద్రగూడెంలో పత్తి, కోడూరులో కంది ప్రదర్శన క్షేత్రాలతోపాటు తుమ్మలపల్లిలో వరి పొలంబడి క్షేత్రాన్ని సందర్శించారు. అంతర పంటల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఆరా తీయగా, ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు వివరించారు. క్షేత్రాల వద్ద రిజిస్టర్ల నిర్వహణ, బోర్డుల ఏర్పాటును పరిశీలించి సిబ్బందిని అభినందించారు.
ఆర్బీకే, అగ్రిల్యాబ్స్ సందర్శన
గుంటూరు జిల్లా నూజెండ్ల రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే), కృష్ణాజిల్లా ఎ.కొండూరు అగ్రి ల్యాబ్‌లను కూడా బృందం సభ్యులు సందర్శించి వీటి ద్వారా రైతులకందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకే ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను పంపిణీ చేస్తున్నామని సిబ్బంది చెప్పగా.. నిజంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. బుక్ చేసిన 24 గంటల్లోనే అందిస్తున్నారని రైతులు బదులిచ్చారు. కియోస్క్‌లను రైతులు ఎలా వినియోగించుకుంటున్నారో ఆరా తీశారు. వ్యవసాయ, అనుబంధ శాఖల సేవలు, పంటల వారీగా లైబ్రరీలో ఉంచిన పుస్తకాలు, వీడియోలను పరిశీలించి చాలా బాగున్నాయని కితాబిచ్చారు. ఎ.కొండూరు అగ్రిల్యాబ్‌తో పాటు ల్యాబ్‌లోని అత్యాధునిక టెస్టింగ్ పరికరాలను చూసి ఆశ్చర్యపోయారు. చదవండి: రికార్డు సంఖ్యలో ప్రయాణం.. 640 మంది కాదు..823 మంది!
త్వరలో కేంద్రానికి నివేదిస్తాం
‘ఇలాంటి అత్యాధునిక ల్యాబ్‌లను దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నాం. ముందుగా నాణ్యత పరీక్షించి సర్టిఫై చేసిన తర్వాత పంపిణీ చేయడంవల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది’.. అని పొన్నుస్వామి అన్నారు. ఆర్బీకేలు, అగ్రిల్యాబ్స్ దేశానికే రోల్ మోడల్‌గా ఉన్నాయన్నారు. ఈ వివ్లవాత్మక మార్పులతో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్న విశ్వాసం తమకుందన్నారు. ఇక్కడ అమలుచేస్తున్న కొన్ని కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలుచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ మేరకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. బృందం వెంట వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు ఎన్‌సి బాలునాయక్.. కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దేశం మొత్తం మీవైపు చూస్తోంది
► ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక అగ్రిల్యాబ్స్ (33) తమిళనాడులోనే ఉన్నాయనుకునే వాణ్ణి. కానీ, మీ రాష్ట్రంలో ఏకంగా 160 ల్యాబ్స్‌ను తక్కువ సమయంలో ఎంతో నాణ్యతతో ఏర్పాటుచేశారంటే నమ్మలేకపోతున్నా. చాలా బాగున్నాయి. సాగు ఉత్పాదకాలను నేరుగా రైతులకందించాలన్న ఆలోచనతో తీసుకొచ్చిన రైతుభరోసా కేంద్రాలు నిజంగా గొప్ప ప్రయోగం. గ్రామస్థాయిలో రైతులకు ఇంతలా సేవలందిస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని కచ్చితంగా చెప్పగలను. ఈ విషయంలో దేశం మొత్తం మీవైపు చూస్తోంది. ఇక్కడి యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు.
– డాక్టర్ కె. పొన్నుస్వామి, కేంద్ర ప్రభుత్వ నూనెగింజల అభివృద్ధి సంస్థ జేడీ, జాతీయ ఆహార భద్రతా మిషన్ దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment