
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 300కుపైగా వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) పోస్టులు రానున్నాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రం సాగుభూమి పెరగడం, ఏఈవో క్లస్టర్ల పరిమాణం పెరగడంతో వాటిని హేతుబద్ధీకరించాలని.. అవసరమైన చోట కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త క్లస్టర్ల అవసరం, వాటికి ఏఈవోల నియామకంపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. క్లస్టర్ల ఏర్పాటు అమల్లోకి రాగానే, కొత్త ఏఈవో పోస్టులు కూడా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ద్వారా వాటిని భర్తీ చేస్తారు.
సాగుభూమి పెరగడంతో..
రాష్ట్ర ప్రభుత్వం 2018లో వ్యవసాయ భూములను క్లస్టర్ల వారీగా విభజించి వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. దాదాపు 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. అప్పుడు వానాకాలం సీజన్‌లో దాదాపు కోటి ఎకరాల వరకు సాగయ్యేది. కాస్త చిన్న, పెద్ద కలిపి 2,601 క్లస్టర్లు ఏర్పాట య్యాయి. ప్రతీ క్లస్టర్‌కు ఒక ఏఈవో ఉంటారు. ఆ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ భూమిని పర్యవేక్షించడం, రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడం, రైతు వేదికల నిర్వహణ, రైతుబంధు, రైతుబీమా లబ్ధిదారుల గుర్తింపు, వారికి అవసర మైన సహాయ సహకారాలు అందించడం వంటి బాధ్యతలను ఏఈవోలు నిర్వర్తిస్తారు.
క్లస్టర్ పరిదిలో ఏయే పంటలు సాగు చేస్తున్నారనే సమగ్ర సమాచారాన్ని ట్యాబ్‌ల ద్వారా అప్‌లోడ్ చేస్తారు. అయితే కాళేశ్వరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం, రైతుబంధు వంటి కారణా లతో రాష్ట్రంలో సాగయ్యే భూమి విస్తీర్ణం 1.46 కోట్ల ఎకరాలకు చేరిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. దీనితో చాలా క్లస్టర్ల పరిధిలో సాగు భూమి ఐదు వేల ఎకరాలకు మించి పెరిగింది.
300కుపైగా క్లస్టర్లలో 6 వేల నుంచి 12 వేల ఎకరాల వరకు సాగుభూమి ఉన్నట్టు గుర్తించారు. ఈ కస్ట ర్లకు సంబంధించిన ఏఈవోలపై పనిభారం పెరిగింది. పర్యవేక్షణ ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సాగుభూమి పెరిగిన, తక్కువగా ఉన్న క్లస్టర్లను హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు.
ఏఈవో క్లస్టర్లలో.. పంటల వారీగా క్లస్టర్లు
రాష్ట్రంలో పంటల వారీగా క్లస్టర్లను కూడా ప్రభు త్వం గతేడాది గుర్తించింది. ఏ పంట ఏ క్లస్టర్లలో అధికంగా సాగవుతుందో నిర్ధారించింది. ఆ ప్రకా రం రానున్న సీజన్‌లో గుర్తించిన క్లస్టర్లలో పంటలను ప్రత్యేకంగా ప్రోత్సహించనున్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. పంట కోత అనంతరం క్లస్టర్లను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. దీనివల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందనేది సర్కారు ఉద్దేశం. రాష్ట్రంలో ప్రధాన పంటలకు సంబంధించి 2,613 క్లస్టర్లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అత్యధికంగా పత్తి పంటకు 1,081 క్లస్టర్లు, వరికి 1,064 పంట క్లస్టర్లు, కందులకు 71 క్లస్టర్లు, సోయాబీన్‌కు 21 క్లస్టర్లు, మొక్కజొన్నలకు తొమ్మిది క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment