సాక్షి, హైదరాబాద్: చైనా, అమెరికా దేశాల ఉత్పాదకతలను మనం అధిగమించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మన దగ్గర మానవ వన రులు, సాగుభూమి పుష్కలంగా ఉన్నా వారిని అందుకోలే కపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, జిల్లా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ ఉన్నతాధికారులు, శాస్త్రవేతలతో జరిగిన సమావేశంలోనూ, ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలోనూ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. అమెరికాలో వ్యవసాయం చేసేవారు 30 శాతం నుండి 3 శాతానికి పడిపోయినా వారు అగ్రస్థానంలోనే ఉన్నారన్నారు. మన దేశంలో 60 శాతం జనాభా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీదే ఆధారపడిందన్నారు.
ఈ నేపథ్యంలోనే చారిత్రక మార్పునకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. మన ఆహార అవసరాలకు సరిపడిన పంటలు పండిస్తున్నామని, కానీ ప్రపంచానికి అవసరమైన, ఆదాయాన్నిచ్చే పంటలను పండించాల్సి ఉందన్నారు. అంబలి కేంద్రాలతో ఆకలి తీర్చుకున్న తెలంగాణ ఆరేళ్లలో అన్నపూర్ణగా మారిందన్నారు. 42 శాతం జీడీపీ వ్యవసాయరంగం నుండే వస్తోందన్నారు. అర్థికవేత్తలు 14.5 శాతం అంటారు కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు కలిపితే 42 శాతమన్నారు. వ్యవసాయరంగంపై పెట్టే పెట్టుబడులను ఆర్థిక నిపుణులు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో అర్థంకావడం లేదన్నారు.
52 శాతం రైతులు అప్పుల్లో ఉంటారన్నది నిపుణుల నివేదిక సారాంశమని, వారిని ఆ అప్పుల ఊబి నుండి బయటపడెయ్యాలనే వ్యవసాయరంగంలో విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రైతులు మార్చి చివరి నాటికి యాసంగి వరి కోతలు పూర్తయ్యేలా సాగు చేస్తే అకాల వర్షాల మూలంగా నష్టపోయే పరిస్థితి తప్పుతుందన్నారు. తెలంగాణ ఆహార సెజ్‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు భారీ ఎత్తున వస్తాయన్నారు. దీనికి సంబంధించిన విధాన నిర్ణయం ముఖ్యమంత్రి త్వరలో ప్రకటిస్తారని తెలిపారు.
మరో విప్లవం దిశగా ముందుకు వెళ్లాలి...
ఈ దేశం ఏర్పడినప్పటి నుండి వ్యవసాయ రంగంలో హరిత, శ్వేత, నీలి, పసుపు తదితర రకాల విప్లవాలు వచ్చాయని నిరంజన్‌రెడ్డి అన్నారు. మనం మరో వి ప్లవం దిశగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిం దన్నారు. అదే నియంత్రిత సమగ్ర వ్యవసాయం అని అన్నారు. 40 రోజులుగా అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో సుదీర్ఘ చర్చలు జరిపామన్నారు. ప్రపం చవ్యాప్తంగా మొక్కజొన్న అధిక ఉత్పత్తితో నిల్వలు పేరుకు పోయాయని అన్నారు. అందుకే ఈసారి ప్రత్యామ్నాయంగా కంది వేయాలని చెబుతున్నామన్నారు. వ్యవసాయ సంస్కరణలను రైతులు ఆహ్వానిస్తున్నారన్నారు.
నిర్మాణాత్మకమైన సూచనలను విపక్షాలు ఎప్పుడైనా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చాయా అని మంత్రి ప్రశ్నించారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ప్రాజెక్టులు ఇవన్నీ వారిని సంప్రదించే చేశామా అని ప్రశ్నించారు. ఆహార భద్రతతో పాటు పోషక భద్రత కల్పించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆత్మహత్యలను రాజకీయంగా వాడుకోవడం తప్పితే రైతాంగంలో ఆత్మస్థైర్యం నింపే కార్యాచరణ కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదన్నారు. వ్యవసాయంలో కూలీల కొరత తీర్చడానికే తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీని అనుసంధానం చేయాలని కోరు తున్నదన్నారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వీసీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment