సాక్షి, హైదరాబాద్: గతేడాది వానకాలం సాగు కంటే ఈసారి పత్తిని 10.30 లక్షల ఎకరాల్లో రైతులతో అధికంగా సాగు చేయించాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా పంటల మ్యాపింగ్ పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ఆ తర్వాత జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. మరోసారి చర్చించి దీనికి తుదిరూపు ఇస్తారు. గతేడాది 54.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈసారి ఆ మొత్తం విస్తీర్ణాన్ని 64.75 లక్షల ఎకరాలకు పెంచుతూ జిల్లాల వారీగా మ్యాపింగ్ తయారుచేశారు. మెదక్, నారాయణ్‌పేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పత్తి సాగు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నల్లగొండ జిల్లాలో 7.25 లక్షల ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 4.50 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్‌లో 4.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అధికంగా ఉంటుందని మ్యాపింగ్ చేశారు.
వరి సాగు తగ్గించేలా ప్రణాళిక
మ్యాపింగ్ ప్రకారం రాష్ట్రంలో ప్రధానంగా పత్తి, కంది సాగును ప్రోత్సహిస్తారు. ఈ వానాకాలం సీజన్‌లోనే ఏ జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలనే దానిపై లెక్కలు కూడా తీశారు. వీటిని త్వరలోనే జిల్లా కలెక్టర్లకు పంపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం 40.24 లక్షల ఎకరాల్లో, పత్తి 64.75 లక్షల ఎకరాల్లో, కందులు 14.09 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గత వానాకాలం సీజన్‌లో సాగైన వరి విస్తీర్ణం 41.19 లక్షల ఎకరాలుండగా, దాన్ని 40.24 లక్షల ఎకరాలకు పరిమితం చేస్తారు. అంటే 95 వేల ఎకరాలు తగ్గిస్తారు. ఇందులో అత్యధికంగా 3 జిల్లాల్లో సాగు 3 లక్షల ఎకరాల చొప్పున ఉంది. నల్లగొండలో 3.30 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 3.20 లక్షల ఎకరాలు, నిజామాబాద్‌లో 3 లక్షల ఎకరాల్లో వేశారు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వరి సాగును తగ్గించాలని నిర్ణయించారు.
కంది పంటకు ప్రోత్సాహం
ఈసారి కంది సాగును విపరీతంగా ప్రోత్సహించాలని పంటల మ్యాపింగ్‌లో నిర్ణయిం చారు. ఎంత కంది వస్తే అంత మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కూడా సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని జిల్లాల్లో కంది పంట సాగును పెంచనున్నారు. గత వానాకాలంలో 7.38 లక్షల ఎకరాల్లో కంది సాగు కాగా, ఈసారి అదనంగా 6.70 లక్షల ఎకరాలతో 14.08 లక్షల ఎకరాల్లో మ్యాపింగ్‌ను సిద్ధం చేశారు. ఇందులో అత్యధికంగా వికారాబాద్‌లో 1.73 లక్షల ఎకరాలు, నారాయణ్‌పేట్‌లో 1.70 లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో లక్ష ఎకరాల్లో సాగుకు ప్రతిపాదించారు.
సోయాబీన్ తగ్గింపు..
సోయాబీన్ సాగును ఈ వానాకాలంలో తగ్గించాలని పంటల మ్యాపింగ్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం గతేడాది 4.26 లక్షల ఎకరాల్లో సాగు నమోదు కాగా, ఈసారి 2.46 లక్షల ఎకరాల్లో వేసేలా ప్రణాళిక తయారు చేశారు. 1.80 లక్షల ఎకరాలు తగ్గించాలని ప్రతిపాదించారు. ఇక జొన్నలు, మినుములు, ఆముదం సాగు పెంపును మ్యాపింగ్‌లో ప్రస్తావించారు. ఈ వానాకాలంలో జొన్నలు 1.42 లక్షల ఎకరాలు, మినుములు 65,980 ఎకరాలు, ఆముదం 1.39 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా ప్రతిపాదించారు. ఇక చెరకు సాగును కూడా పెంచాలని ప్రణాళికలో పేర్కొన్నారు. ఈసారి 69,855 ఎకరాల్లో వేసేలా ప్లాన్ చేశారు. వేరుశనగ 49,960 ఎకరాల్లో సాగు మ్యాపింగ్ చేశారు. సర్కారు చెప్పినట్లుగానే పంటలు వేయాలన్న నిర్ణయంపై రైతులను ఎలా ఒప్పించాలన్న దానిపై వ్యవసాయశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. తక్కువ కాలంలో రైతులను ఒప్పించగలమా అన్న సంశయం కూడా కొందరు అధికారుల్లో వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment