రోడ్డు పక్కన విక్రయించే చిరుతిళ్లు, ఆహార పదార్థాలను సాధారణంగా పాత న్యూస్ పేపర్లలో పొట్లం కట్టి ఇస్తుంటారు. ఇలా న్యూస్ పేపర్లలో ఆహారం తింటే తీవ్రవైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్, సర్వింగ్ కోసం న్యూస్ పేపర్లను ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని వ్యాపారులను, వినియోగదారులను కోరింది.
ఈ విషయంలో నిబంధనలను పర్యవేక్షించడానికి, అమలు చేయడానికి రాష్ట్ర ఆహార అధికారులతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కలిసి పని చేస్తోంది. ఆహార పదార్థాలను ప్యాకింగ్, సర్వింగ్ చేయడానికి న్యూస్ పేపర్లను ఉపయోగించడం తక్షణమే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు, ఆహార విక్రేతలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో కమల వర్ధనరావు గట్టిగా కోరారు.
తీవ్ర ఆరోగ్య సమస్యలు
ఆహార పదార్థాల ర్యాపింగ్, ప్యాకేజింగ్ చేయడానికి న్యూస్ పేపర్లు ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన దీనివల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను తెలియజేశారు. న్యూస్ పేపర్లలో ఉపయోగించే ఇంక్ ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగించే బయోయాక్టివ్ పదార్థాలను కలిగి ఉంటుందని, ఇది ఆహారాన్ని కలుషితం చేసి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరించింది.
ప్రింటింగ్ ఇంక్‌లలో సీసం, ఇతర భారీ లోహాలతో సహా రసాయనాలు ఉండవచ్చని, ఇవి ఆహారంలో కలసి దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని వివరించింది. అంతేకాకుండా బ్యాక్టీరియా, వైరస్ వంటి వ్యాధికారక క్రిములు న్యూస్ పేపర్ల ద్వారా ఆహారంలోకి ప్రవేశించి అనారోగ్యాలకు కారణమవుతాయని తెలిపింది.
కఠిన నిబంధనలు
ఆహార పదార్థాల ప్యాకింగ్‌కి న్యూస్ పేపర్ల వాడకాన్ని నిషేధించే ఆహార భద్రత, ప్రమాణాల (ప్యాకేజింగ్) నిబంధనలు-2018ని నోటిఫై చేస్తూ న్యూస్ పేపర్లను ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌గా ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా వినియోగదారులు, ఆహార విక్రేతలు, వాటాదారులను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కోరింది. సురక్షితమైన, ఆమోదించిన ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లతో పాటు ఫుడ్-గ్రేడ్ కంటైనర్‌లను మాత్రమే ఉపయోగించాలని సిఫార్సు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment