కెరీర్‌ ప్యాక్‌ చేద్దాం! | Packaging Engineering Degree and Training Program Information | Sakshi
Sakshi News home page

కెరీర్‌ ప్యాక్‌ చేద్దాం!

Published Fri, Jun 16 2017 11:01 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

కెరీర్‌ ప్యాక్‌ చేద్దాం! - Sakshi

కెరీర్‌ ప్యాక్‌ చేద్దాం!

చర్మ సంరక్షణకు ఉపయోగపడే సబ్బు నుంచి, ఆరోగ్యాన్ని అందించే మందు బిళ్లల వరకు. మంచి నూనె నుంచి మిర్చిపౌడర్‌ వరకు... దేనికైనా పదిలమైన, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌ అవసరం. ప్రస్తుత సూపర్‌ మార్కెట్‌ సంస్కృతిలో స్వీయ సేవ (సెల్ఫ్‌ సర్వీసింగ్‌) ఎవరికి కావల్సిన వస్తువులను వారే తీసుకునే పద్ధతి వచ్చింది. ఓ పెద్ద సూపర్‌ మార్కెట్లో షాపింగ్‌ చేస్తున్న వ్యక్తికి ఒకే వస్తువుకు సంబంధించి పలు బ్రాండ్లు కనిపిస్తుంటాయి. అలాంటపుడు కొనుగోలుదారుల్ని ఓ వస్తువు ఆకర్షించాలంటే అందమైన ప్యాకేజింగ్‌ అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమల నుంచి బయటకొచ్చిన ఏ ఉత్పత్తి అయినా విజయవంతం కావడంలో ప్యాకేజింగ్‌ కీలకం. అందుకే ప్రస్తుతం ప్యాకేజింగ్‌ రంగ నిపుణులకు జాబ్‌ మార్కెట్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ‘ప్యాకేజింగ్‌’ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు ‘విద్య – ఉద్యోగం’లో మీకోసం...    – సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

కంపెనీ తయారు చేసిన వస్తువు అమ్మకాల్లో ప్యాకేజింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. వస్తువు చెడిపోకుండా ఉంచడంలో, కొనుగోలుదారుడిని ఇట్టే ఆకర్షించడంలోనూ ప్యాకేజింగ్‌దే ప్రముఖ పాత్ర. మొత్తంమీద ఓ వస్తువు మార్కెటింగ్‌లో ప్యాకేజింగ్‌ పాత్ర కీలకమని చెప్పొచ్చు. అందుకే ప్యాకేజింగ్‌ సాదాసీదా వ్యవహారంలా కాకుండా, సరికొత్త వృత్తిగా మారిపోయింది. యువతకు ఓ ప్రత్యామ్నాయ కెరీర్‌ చాయిస్‌గా నిలుస్తోంది.

కావాల్సిన నైపుణ్యాలు...
ఇతర కోర్సులతో పోలిస్తే ఇది భిన్నమైన రంగం. ఇందులో రాణించాలంటే.. సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడం, ప్రస్తుత మార్కెటింగ్‌ ట్రెండ్స్‌పై అవగాహన, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి.

కోర్సులో ఉండే అంశాలు...
పరిశ్రమ, మార్కెటింగ్‌ అవసరాలకు అనుగుణంగా ప్రవేశ పెట్టిన కోర్సుల్లో ప్యాకేజింగ్‌ కోర్సులు ఒకటి... ఇందులో ఇంజనీరింగ్, ప్రింటింగ్, మార్కెటింగ్, కవర్‌ డిజైన్, మాన్యుఫాక్చరింగ్, గ్రాఫిక్‌ డిజైన్‌ సంబంధిత అంశాలుంటాయి. ఈ క్రమంలో ప్యాకేజింగ్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్, లాజిస్టిక్స్‌ అండ్‌ ఫిజి కల్‌ డిస్ట్రిబ్యూషన్, ప్యాకేజింగ్‌ ప్రాసెస్, క్వాలిటీ కంట్రోల్, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్‌ మెకానిక్స్, ప్రింటింగ్‌ టెక్నాలజీ, మెషిన్‌ డ్రాయింగ్, ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, ప్యాకేజింగ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.

అవకాశాలు...
పారిశ్రామిక రంగం నుంచి బయటకు వచ్చిన, వస్తున్న ఏ ఉత్పత్తినైనా ఆకర్షణీయంగా మార్చేది వాటి ప్యాకింగ్‌. కాబట్టి ప్యాకేజింగ్‌ నిపుణులకు అవకాశాలు ఎక్కువని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పరిశ్రమలు మనుగడ సాగించినంత కాలం... ప్యాకేజింగ్‌ పరిశ్రమకు ఢోకా ఉండదు.

వేతనాలు...
అవకాశాలకనుగుణంగానే ఆకర్షణీయ వేతనాలు వీరికి లభిస్తున్నాయి. కెరీన్‌ ప్రారంభంలో సంవత్సరానికి రూ. 3
లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు. ఆ తర్వాత పనితీరు ఆధారంగా భారీ వేతనాలు సంపాదించే అవకాశం ఉంది.

విధులు...
ఒక ఉత్పత్తిని అందంగా ఆకట్టుకునేలా మన్నికైన∙ప్యాకింగ్‌ చేయడం ప్యాకేజింగ్‌ నిపుణుల విధి. ఆయా పరిశ్రమలు వాటి ఉత్పత్తులు, కాలపరిమితి ఆధారంగా సాంకేతికంగా ఎటువంటి ప్యాకింగ్‌ అవసరమో (ఉదాహరణకు ఫార్మా కంపెనీల ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ అవసరం, కెమికల్‌ ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ చేయాలి) నిర్ధారించడం, అందుకోసం అవసరమైన రసాయనాలను సూచించడం, వాటిని ఎంత మోతాదులో వినియోగించాలో సలహాలివ్వడం, పర్యావరణ పరంగా అవసరమైన జాగ్రత్తలను సూచించడం వంటి విధులను వీరు నిర్వర్తిస్తుంటారు.  ప్యాకేజింగ్‌ టెక్నాలజీలో శిక్షణ పొందుతున్న వారిని ‘ప్యాకేజింగ్‌ టెక్నాలజిస్టులు’ అంటారు. ప్యాకేజింగ్‌ టెక్నాలజిస్టులు క్యాలిటీ ఇంజినీర్, పర్చేజింగ్, మెటీరియల్‌ విభాగాలలో తమ కెరీర్‌ను ప్రారంభించవచ్చు.

పరిశ్రమ పనితీరు...
ప్రస్తుతం శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగాల్లో ప్యాకేజింగ్‌ పరిశ్రమ ఒకటి. ఏటా భారత ప్యాకేజింగ్‌ పరిశ్రమ 13 నుంచి 15 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుంది. ప్రస్తుతం దేశ ప్యాకేజింగ్‌ పరిశ్రమ విలువ దాదాపు రూ.లక్ష కోట్లు. దేశంలో మొత్తం పేపర్‌ ఉత్పత్తిలో అధిక శాతం పేపర్‌ను ప్యాకింగ్‌ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఇందుకోసం 7.6 మిలియన్‌ టన్నుల పేపర్‌ను వాడుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ ఉంది. ఈ రంగంలో ప్రతి ఏటా 20 నుంచి 25 శాతం వృద్ధి నమోదవుతుంది. ప్యాకేజింగ్‌ రంగంలో గ్లాస్‌ ప్యాకింగ్‌ వాటా 4 నుంచి 5 శాతం, మెటల్‌ ప్యాకింగ్‌ వాటా 8 శాతం వరకు ఉంటుంది.

కొన్ని ప్రముఖ కంపెనీలు...
హెచ్‌సీఎల్, హిందుస్థాన్‌ యూనీలీవర్‌ లిమిటెడ్, డాబర్‌ ఇండియా లిమిటెడ్, క్యాడ్‌బరీ ఇండియా లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ లిమిటెడ్, క్యాస్ట్రాల్‌ ఇండియా లిమిటెడ్, కోకా–కోలా ఇండియా, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబిల్‌ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

కోర్సులు...
దేశంలో ప్యాకేజింగ్‌ రంగానికి సంబంధించిన కోర్సులను ఆఫర్‌ చేస్తున్న ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌... ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ (ఐఐపీ). కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఐఐపీకి ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, హైదారాబాద్‌లలో క్యాంపస్‌లున్నాయి. వీటి ద్వారా అందిస్తోన్న కోర్సులు వివరాలు...

పీజీ డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌...
అర్హత: కనీసం ద్వితీయ శ్రేణి మార్కులతో గ్రాడ్యుయేషన్‌ (12+3 విధానంలో మ్యాథమెటిక్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మైక్రోబయాలజీలలో ఒకటి మెయిన్‌ లేదా సెకండ్‌ సబ్జెక్ట్‌గా) లేదా అగ్రికల్చర్‌/ఫుడ్‌ సైన్స్‌/పాలిమర్‌ సైన్స్‌ లేదా ఇంజనీరింగ్‌/టెక్నాలజీ. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. రాత పరీక్ష , ఇంటర్వూ ద్వారా ఎన్నుకుంటారు. అభ్యర్థులు ఇంటర్వూ సమయానికి సంబంధిత డిగ్రీ సర్టిఫికెటన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

సీట్ల వివరాలు...
ముంబై–80, ఢిల్లీ–80, కోల్‌కతా–60, హైదరాబాద్‌–60. ఓబీసీ విద్యార్థులకు 27శాతం, ఎస్సీ విద్యార్థులకు 15శాతం, ఎస్టీ విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది.

డిప్లమా ఇన్‌ ప్యాకేజింగ్‌..
ప్యాకేజింగ్‌ డిప్లమా కోర్సు మూడేళ్లు ఉంటుంది. ఈ కోర్సులో  పదోతరగతి ఉత్తీర్ణులై, పాలిటెక్నిక్‌ ప్రవేశపరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంచుకుంటారు. ఎంపికైన వారికి హాస్టల్‌ వసతి ఉంటుంది. తెలుగు రాష్ట్రల్లో ఈ కోర్సును అందిస్తోన్న ఏకైక కళాశాల హైదారాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement