grocery shops
-
నిత్యావసరాలు కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
కిరాణాలు, సూపర్ మార్కెట్లలో వివిధ వస్తువులను ప్యాకెట్లరూపంలో విక్రయిస్తున్నారు. వీటిపై తయారీ, గడువు తేదీ, బరువు, ధర స్టిక్కర్లు వేయకుండానే విక్రయిస్తున్నారు. ప్రజలు వివిధ పనులతో బిజీగా ఉండటంతో వ్యాపారులు దానిని అవకాశంగా మార్చుకుని ప్యాకెట్ల రూపంలో వస్తువులు అంటగడుతున్నారు. సూపర్ మార్కెట్ల నుంచి చిన్న కిరాణాల్లోనూ ప్యాకింగ్‌పై అన్ని వివరాలు ఉండాలి. వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పావుకిలో, అర్ధకిలో, కిలో రూపంలో ప్యాకెట్లు నింపుతూ వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో తూకంలో తేడాలు వస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారే తప్ప.. తదుపరి చర్యలపై పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అనుమతి లేకుండానే.. ● నిబంధనల ప్రకారం నిత్యావసరాలను ప్యాక్ చేయాలంటే తూనికలు, కొలతల శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. ● ప్యాకెట్‌పై ఎమ్మార్పీ, మ్యానుప్యాక్చరింగ్ డేట్, కమొడిటీ, టోల్‌ఫ్రీ నంబరు ఉండాలి. ● కానీ, అనుమతి లేకుండానే కిరాణాల్లో కందిపప్పు, పెసరపప్పు, చక్కెర, గోధుమపిండి, మైదాపిండి ప్యాక్ చేస్తూ విక్రయిస్తున్నారు. ● చిప్స్, మురుకులు, ఖార, బొందీ తదితర తినుబండారాలనూ ప్యాకెట్లలోనే విక్రయిస్తున్నారు. ● హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్దపెద్ద బస్తాల్లో సరుకులను తీసుకొచ్చి ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. ● మరోవైపు.. పన్నులు తప్పించుకోవడానికి వ్యాపారులు జీరో దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ● తద్వారా ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. జాడలేని అధికారులు.. జిల్లాలో 20 మండలాలతో ఉండగా, ప్రస్తుతం జిల్లా ఇన్స్పెక్టర్తోపాటు, సిబ్బంది ఉన్నారు. జిల్లా పెద్దగా ఉండటం, అధికారులు తక్కువగా ఉండటంతో తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారింది. షాపుల్లో తరాజు, బాట్లు వ్యత్యాసం రాకుండా నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు.. అలాంటివేమీ చేయడం లేదు. ఏటా కిరాణం వారు తరాజులు, బాట్లకు స్టాంపు వేయించుకోవాలి. ఎలక్ట్రానిక్ కాంటాల వారు సంవత్సరానికోసారి రెన్యూవల్ చేయించుకోవాలి. గ్రామాల్లో అమ్మకాలు.. ● గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మసాలా పొడులు, ఖారాప్యాకెట్లు, వివిధ వస్తువులు, ఉల్లిగడ్డలు ట్రాలీల్లో తీసుకెళ్లి అమ్ముతుంటారు. ● వీటిని చిన్నచిన్న కవర్లలో పోసుకుంటూ విక్రయిస్తుంటారు. ● వీటిపై ఎలాంటి ముద్రణ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండడంలేదు. ● ఇటీవల అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ధరల్లో తేడాలు.. కొన్ని షాపుల్లో ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్లకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా థియేటర్లలో, బేకరీల్లో ఇస్టారాజ్యంగా రేట్లకు విక్రయిస్తున్నారు. కొత్త సినిమా రోజు సినిమా థియేటర్లలో ఒక కూల్‌డ్రింక్ రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ఒక పాప్‌కార్న్ రూ.20కి అమ్ముతున్నారు. వాటర్‌బాటిల్ రూ.40, చిప్స్ రూ.20కి విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సినిమాకు వెళ్లాడు. పాప్‌కార్న్ కొనుగోలు చేశాడు. దానికి ఎలాంటి స్టిక్కర్లేదు. ప్యాకెట్ రూ.40కిపైగా ధరకు అమ్మాడు. దీంతో అతడు లీగల్ మెట్రోలజీ వెబ్సైట్లో ఫిర్యాదు చేశాడు. అధికారులువెంటనే థియేటర్‌కు వెళ్లి కేసు నమోదు చేశారు. జగిత్యాల అశోక్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. కూరగాయలు కొనుగోలు చేశాడు. కిలోకు పావుకిలో వరకు తక్కువగా రావడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ముద్రణ ఉండాలి ప్రతీ ప్యాకెట్‌పై వస్తువుపై సంబంధిత కంపెనీ ముద్రణ, కన్జ్యూమర్ నంబరు, ఎమ్మార్పీ ఉండాలి. లేకుంటే చర్యలు తీసుకోవాలి, ప్రతీరోజు తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మిషన్ వారు సంవత్సరానికోసారి, తరాజుబాట్ల వారు రెండు సంవత్సరాలకోసారి ముద్ర వేయించుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. – అజీజ్‌పాషా, తూనికలు, కొలతల ఇన్స్పెక్టర్ -
మీషో.. ‘సూపర్’ షో, ఇక కిరాణా సామాగ్రి కూడా కొనొచ్చు!
న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులున్న మీషో ఆన్లైన్ గ్రోసరీ విభాగంలో భారీగా విస్తరించేందుకు సిద్ధపడుతోంది. ఒకే చోట అన్నీ లభించేలా వేసుకున్న ప్రణాళికల్లో భాగంగా కీలక యాప్ ద్వారా గ్రోసరీ విభాగాన్ని సమీకృతం చేయనున్నట్లు మీషో పేర్కొంది. దేశీయంగా తదుపరి 100 కోట్ల(బిలియన్) యూజర్లకు సింగిల్ షాపింగ్ కేంద్రంగా నిలవాలని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. మే నెల తొలి వారానికల్లా గ్రోసరీ బిజినెస్ ఇంటిగ్రేషన్‌ను పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో ఫార్మిసోను మీషో సూపర్‌స్టోర్‌గా రీబ్రాండ్ చేయనున్నట్లు పేర్కొంది. కర్ణాటకలో షురూ: తొలుత కర్ణాటకలో పరిశీలనాత్మకంగా కీలక యాప్‌తో మీషో సూపర్‌స్టోర్‌ను జత చేసినట్లు మీషో వ్యవస్థాపక సీఈవో విదిత్ ఆట్రే తెలియజేశారు. తాజా పండ్లు, కూరగాయలు, హోమ్ కేర్, ప్యాకేజ్డ్ ఫుడ్, గ్రోసరీ సంబంధిత 500 ప్రొడక్టులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 9 నెలల్లోపే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోనూ యూజర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. 2022 చివరికల్లా 12 రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు మీషో తెలియజేసింది. ప్రస్తుత ఇంటిగ్రేషన్‌తో 10 కోట్లకుపైగా యూజర్లు 8.7 కోట్ల ప్రొడక్ట్ లిస్టింగ్స్‌ను ఒకే ప్లాట్‌ఫామ్‌పై పొందవచ్చని వివరించింది. -
పెద్ద షాపులను దోచేసి.. చిన్న షాపుల్లో అమ్మేస్తున్నారు!
ముంబై: మహారాష్ట్రలోని వీరార్‌లో కిరాణ దుకాణాల నుంచి సరుకులను దొంగిలించి చిన్న దుకాణాలకు విక్రయిస్తోన్న ఓ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులను రాకేశ్ యాదవ్ (37), రాకేశ్ కదమ్ (23), వికాస్కుమార్ దుబే (36) గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గురూ ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్, ధాన్యాలను పెద్ద కిరాణ షాపుల నుంచి దొంగిలించి తక్కువ ధరలకు పాల్ఘర్, ముంబై మురికివాడల్లోని చిన్న దుకాణాలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెలలో వీరార్‌లోని ఓ దుకాణం నుంచి 60 బస్తాల వెల్లుల్లిని దొంగిలించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని పరిశీలించినప్పుడు, టెంపో నంబర్ ప్లేట్ కనిపించింది. దీంతో స్థానిక ఇన్ఫార్మర్ సహాయంతో నిందితుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ముగ్గురిని నలసోపర, వీరార్‌లోని మూడు వేర్వేరు ప్రదేశాలలో సోమవారం అరెస్టు చేశారు. విచారణలో వీరార్‌లో ఇటీవల కాలంలో జరిగిన ఎనిమిది దొంగతనాలను తామే చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా నలసోపారా, థానే, ముంబైలలో 40 కి పైగా దొంగతనాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
మన ఇంటి పక్కన కిరాణా దుకాణాదారుడే కింగ్
కొనుగోలుదారులకు మరింతగా చేరువయ్యే ప్రయత్నాల్లో భాగంగా కిరాణా దుకాణాదారులను ఆకర్షించేందుకు ఈ–కామర్స్ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఒకదాన్ని మించిన మరో ఆఫర్‌తో ఊదరగొడుతున్నాయి. వారిని తమ డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫాంలో భాగస్వాములుగా చేసుకోవడంతో పాటు, రుణ సదుపాయం కూడా కల్పిస్తామంటున్నాయి. సాధారణంగా కిరాణా దుకాణాదారులు సుమారు అయిదు నుంచి 15 దాకా పెద్ద స్టోర్స్ లేదా హోల్సేలర్ల నుంచి కొనుగోళ్లు జరుపుతుంటారు. జియో మార్ట్, ఉడాన్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ వంటి బడా సంస్థలు ఈ సెగ్మెంట్లో వ్యాపార అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారీ మార్కెట్.. భారత్‌లో సుమారు 2.5 కోట్ల మంది చిన్న రిటైలర్లు ఉన్నారని, 90 శాతం రిటైల్ మార్కెట్లో వీరి ఆధిపత్యమే ఉంటోందని బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) సంస్థ ఉడాన్ సహ–వ్యవస్థాపకుడు సుజీత్ కుమార్ తెలిపారు. సుమారు 780 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే బీ2బీ మార్కెట్లో.. ఈ-కామర్స్ విస్తృతి కనీసం ఒక్క శాతం కూడా లేదని వివరించారు. ఈ నేపథ్యంలో చిన్న రిటైలర్ల మార్కెట్‌కు సంబంధించి భారీ స్థాయిలోనే అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వినూత్న వ్యూహాలు .. రిటైలర్ను ఆకర్షించేందుకు హోల్‌సేల్ సంస్థలు వివిధ రకాల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కిరాణా దుకాణాదారులు మరింత ఆదాయం పొందేలా తమ స్టోర్స్‌ను ఆధునీకరించుకునేందుకు, డిజిటల్ బాట పట్టేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తోంది మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థ. దుకాణాదారులు కొనుగోళ్ల కోసం ప్రత్యేకంగా మెట్రో స్టోర్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ-బుకింగ్ ద్వారా నేరుగా వారి దుకాణాలకే ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. ఇక, పైన్ ల్యాబ్స్ వంటి స్టార్టప్ సంస్థలు పాయింట్ ఆఫ్ సేల్స్ సొల్యూషన్స్ అందిస్తుండగా.. ఖాతాబుక్ లాంటివి స్వల్పకాలిక రుణ సదుపాయాలను కల్పిస్తున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తయారీసంస్థల నుంచి ఆహార, ఆహారేతర ఉత్పత్తులను ఆకర్షణీయ రేట్లకు షాపు వద్దకే అందిస్తామని ఉడాన్ వంటి సంస్థలు చెబుతున్నాయి. ఉభయతారకం.. సాధారణంగా పంపిణీ వ్యవస్థలో ఆఖరున ఉండే కొనుగోలుదారుకు ఉత్పత్తి చేరవేయాలంటే అయ్యే వ్యయాలు.. మొత్తం డెలివరీ ఖర్చుల్లో దాదాపు 16 శాతం దాకా ఉంటాయి. అదే కిరాణా దుకాణాదారు నుంచి గానీ అందించగలిగితే ఇది మూడో వంతుకి తగ్గుతుంది. అందుకే కొనుగోలుదారుల ఆర్డర్లను ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని కిరాణా స్టోర్స్‌కి గానీ అనుసంధానిస్తే.. ఒకవేళ దుకాణాదారు దగ్గరే సదరు ఉత్పత్తి ఉంటే అక్కణ్నుంచే నేరుగా డెలివరీ చేయొచ్చు. అంతేకాకుండా రిటైలరుకు కమీషను రూపంలోనూ కాస్త గిట్టుబాటు అవుతుంది. టెక్నాలజీ.. సర్వీసులు ఇటు టెక్నాలజీ అటు సేవలపరమైన ప్రయోజనాలు కల్పించడం ద్వారా కిరాణా దుకాణాదారులకు చేరువ కావాలని మెట్రో ప్రయత్నాలు చేస్తోంది. దీనితో దుకాణాదారు ఆదాయాలు, లాభాలను పెంచుకోవడంతో పాటు నిల్వ చేసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించుకోవచ్చని తద్వారా చేతిలో కొంత అధిక మొత్తం నగదు ఆడుతుందని సంస్థ వర్గాలు తెలిపాయి. మెట్రోలో సుమారు పది లక్షల పైచిలుకు కిరాణా దుకాణదారులు కొనుగోళ్లు చేస్తుంటారు. స్మార్ట్ కిరాణా ప్రోగ్రాంలో భాగంగా 2,000 రిటైలర్లతో మెట్రో జత కట్టింది. 48 గంటల వ్యవధిలో వారి స్టోర్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం, ఉత్పత్తులను ఎలా ఎక్కడ డిస్ప్లే చేయాలి వంటి అంశాల్లో టిప్స్ అందిస్తోంది. అలాగే వారు డిజిటల్ బాట పట్టేందుకు అవసరమయ్యే పీవోఎస్ మెషీన్లను కూడా స్వల్ప చార్జీలకు అందిస్తోంది. ఇలా ఆధునీకరించిన కిరాణా దుకాణాల అమ్మకాలు 30–40 శాతం పెరిగాయని మెట్రో ఎండీ అరవింద్ మేదిరాట్ట తెలిపారు. దాదాపు 1 లక్ష పైచిలుకు రిటైలర్ల స్టోర్స్‌ని మెట్రో ఉత్పత్తులను నేరుగా డెలివరీ చేస్తోంది. ఆన్లైన్లో రోజుకు నాలుగైదు సార్లయినా ఆర్డర్ చేసే వెసులుబాటు ఇస్తుండటంతో దుకాణాదారులు పెద్ద మొత్తంలో ఉత్పత్తులను ముందుగానే కొని నిల్వ చేసుకోవాల్సిన సమస్య ఉండదని సంస్థ వర్గాలు తెలిపాయి. జియో ప్రత్యేక బాట ఇప్పటికే 200 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న జియో మార్ట్ సంస్థ .. కిరాణా దుకాణాదారులను డెలివరీ వ్యవస్థ ఆఖరు దశలోనూ (లాస్ట్ మైల్ డెలివరీ - ఎల్ఎండీ) భాగస్వాములుగా చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపార విభాగాన్ని (ప్రస్తుతం కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది) ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. తద్వారా దేశీయంగా సంఘటిత రిటైల్ రంగంలో 17 శాతం వాటాను దక్కించుకుంటే .. తయారీ సంస్థలతో మరింతగా బేరమాడి ఇంకా తక్కువ రేటుకే ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చని యోచిస్తోంది. జియో మార్ట్ .. పీవోఎస్ మెషీన్లతో పాటు నిల్వలు, వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ, రుణ సదుపాయాలు మొదలైనవి కూడా కల్పిస్తోంది. వాట్సాప్‌తో జట్టు కట్టడంతో ఈ లావాదేవీలన్నీ మరింత సులభతరంగా నిర్వహించేందుకు వీలు పడనుంది. అటు అమెజాన్ కూడా ఈ తరహా వ్యూహాన్ని మరో రకంగా అమలు చేస్తోంది. ఎల్ఎండీ కోసం ’ఐ హ్యావ్ స్పేస్’ అనే ప్రోగ్రాం నిర్వహిస్తోంది. సుమారు 28,000 చిన్న రిటైలర్లు ఇందులో భాగంగా ఉన్నారు. తమ స్టోర్స్‌కి 2-4 కి.మీ. పరిధిలో ఉత్పత్తులను అందిస్తున్నారు. దీనితో సదరు స్టోర్స్‌కి నెలకు రూ.12,000 నుంచి రూ.15,000 దాకా అదనపు ఆదాయం కూడా లభిస్తోందని అమెజాన్ వర్గాలు తెలిపాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా... ఇక మెట్రో తరహాలోనే ఉడాన్ కూడా దాదాపు ముప్భై లక్షల మంది పైచిలుకు చిన్న రిటైలర్లకు ఉత్పత్తులు విక్రయిస్తోంది. తయారీ సంస్థల నుంచి ఉత్పత్తులను నేరుగా స్టోర్స్‌కే అందిస్తోంది. పంపిణీలో వివిధ దశలు తగ్గిపోవడం, మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువగా లేకపోవడం వల్ల మూడు నుంచి నాలుగు శాతం కమీషన్ ఆదా అవుతుందని .. దాన్ని రిటైలర్లకు బదలాయించవచ్చని ఉడాన్ వర్గాలు తెలిపాయి. అంతే గాకుండా తమ సొంత నాన్–బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీతో పాటు ఇతరత్రా ఆర్థిక సంస్థల ద్వారా దుకాణదారులకు అవసరాన్ని బట్టి రుణాలు కూడా ఇప్పిస్తోంది. ఇప్పటిదాకా సుమారు రూ.7,300 కోట్ల దాకా ఇలా స్వల్పకాలిక రుణాలిచ్చినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. సకాలంలో స్టోర్స్‌కి డెలివరీ చేసేందుకు ఉడాన్ దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి చ.అ. విస్తీర్ణంలో 200 గిడ్డంగులు ఏర్పాటు చేసుకుంది. ఈ పరిమాణాన్ని అయిదింతలు పెంచుకోవాలని భావిస్తోంది. -
నెల్లూరులో దుకాణాలపై విజిలెన్స్ దాడులు
నెల్లూరు టౌన్ : నెల్లూరు నగరంలోని పప్పుల వీధిలో ఉన్న రెండు దుకాణాలపై సోమవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. వీధిలోని శరాబ్ పెదవోగయ్య అండ్ సన్స్, హరినాయుడు కేడర్ దుకాణాలపై అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 63లక్షల 24వేలు విలువ చేసే పప్పు దాన్యాలను వారు గుర్తించారు. రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.