
ముంబై: మహారాష్ట్రలోని వీరార్‌లో కిరాణ దుకాణాల నుంచి సరుకులను దొంగిలించి చిన్న దుకాణాలకు విక్రయిస్తోన్న ఓ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులను రాకేశ్ యాదవ్ (37), రాకేశ్ కదమ్ (23), వికాస్కుమార్ దుబే (36) గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గురూ ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్, ధాన్యాలను పెద్ద కిరాణ షాపుల నుంచి దొంగిలించి తక్కువ ధరలకు పాల్ఘర్, ముంబై మురికివాడల్లోని చిన్న దుకాణాలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గత నెలలో వీరార్‌లోని ఓ దుకాణం నుంచి 60 బస్తాల వెల్లుల్లిని దొంగిలించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని పరిశీలించినప్పుడు, టెంపో నంబర్ ప్లేట్ కనిపించింది. దీంతో స్థానిక ఇన్ఫార్మర్ సహాయంతో నిందితుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ముగ్గురిని నలసోపర, వీరార్‌లోని మూడు వేర్వేరు ప్రదేశాలలో సోమవారం అరెస్టు చేశారు. విచారణలో వీరార్‌లో ఇటీవల కాలంలో జరిగిన ఎనిమిది దొంగతనాలను తామే చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా నలసోపారా, థానే, ముంబైలలో 40 కి పైగా దొంగతనాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment