కొనుగోలుదారులకు మరింతగా చేరువయ్యే ప్రయత్నాల్లో భాగంగా కిరాణా దుకాణాదారులను ఆకర్షించేందుకు ఈ–కామర్స్ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఒకదాన్ని మించిన మరో ఆఫర్‌తో ఊదరగొడుతున్నాయి. వారిని తమ డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫాంలో భాగస్వాములుగా చేసుకోవడంతో పాటు, రుణ సదుపాయం కూడా కల్పిస్తామంటున్నాయి. సాధారణంగా కిరాణా దుకాణాదారులు సుమారు అయిదు నుంచి 15 దాకా పెద్ద స్టోర్స్ లేదా హోల్‌సేలర్ల నుంచి కొనుగోళ్లు జరుపుతుంటారు. జియో మార్ట్, ఉడాన్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ వంటి బడా సంస్థలు ఈ సెగ్మెంట్‌లో వ్యాపార అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
భారీ మార్కెట్..
భారత్‌లో సుమారు 2.5 కోట్ల మంది చిన్న రిటైలర్లు ఉన్నారని, 90 శాతం రిటైల్ మార్కెట్‌లో వీరి ఆధిపత్యమే ఉంటోందని బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) సంస్థ ఉడాన్ సహ–వ్యవస్థాపకుడు సుజీత్ కుమార్ తెలిపారు. సుమారు 780 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే బీ2బీ మార్కెట్లో.. ఈ-కామర్స్ విస్తృతి కనీసం ఒక్క శాతం కూడా లేదని వివరించారు. ఈ నేపథ్యంలో చిన్న రిటైలర్ల మార్కెట్‌కు సంబంధించి భారీ స్థాయిలోనే అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
వినూత్న వ్యూహాలు ..
రిటైలర్‌ను ఆకర్షించేందుకు హోల్‌సేల్ సంస్థలు వివిధ రకాల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కిరాణా దుకాణాదారులు మరింత ఆదాయం పొందేలా తమ స్టోర్స్‌ను ఆధునీకరించుకునేందుకు, డిజిటల్ బాట పట్టేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తోంది మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థ. దుకాణాదారులు కొనుగోళ్ల కోసం ప్రత్యేకంగా మెట్రో స్టోర్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ-బుకింగ్ ద్వారా నేరుగా వారి దుకాణాలకే ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. ఇక, పైన్ ల్యాబ్స్ వంటి స్టార్టప్ సంస్థలు పాయింట్ ఆఫ్ సేల్స్ సొల్యూషన్స్ అందిస్తుండగా.. ఖాతాబుక్ లాంటివి స్వల్పకాలిక రుణ సదుపాయాలను కల్పిస్తున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తయారీసంస్థల నుంచి ఆహార, ఆహారేతర ఉత్పత్తులను ఆకర్షణీయ రేట్లకు షాపు వద్దకే అందిస్తామని ఉడాన్ వంటి సంస్థలు చెబుతున్నాయి.
ఉభయతారకం..
సాధారణంగా పంపిణీ వ్యవస్థలో ఆఖరున ఉండే కొనుగోలుదారుకు ఉత్పత్తి చేరవేయాలంటే అయ్యే వ్యయాలు.. మొత్తం డెలివరీ ఖర్చుల్లో దాదాపు 16 శాతం దాకా ఉంటాయి. అదే కిరాణా దుకాణాదారు నుంచి గానీ అందించగలిగితే ఇది మూడో వంతుకి తగ్గుతుంది. అందుకే కొనుగోలుదారుల ఆర్డర్లను ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని కిరాణా స్టోర్స్‌కి గానీ అనుసంధానిస్తే.. ఒకవేళ దుకాణాదారు దగ్గరే సదరు ఉత్పత్తి ఉంటే అక్కణ్నుంచే నేరుగా డెలివరీ చేయొచ్చు. అంతేకాకుండా రిటైలరుకు కమీషను రూపంలోనూ కాస్త గిట్టుబాటు అవుతుంది.
టెక్నాలజీ.. సర్వీసులు
ఇటు టెక్నాలజీ అటు సేవలపరమైన ప్రయోజనాలు కల్పించడం ద్వారా కిరాణా దుకాణాదారులకు చేరువ కావాలని మెట్రో ప్రయత్నాలు చేస్తోంది. దీనితో దుకాణాదారు ఆదాయాలు, లాభాలను పెంచుకోవడంతో పాటు నిల్వ చేసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించుకోవచ్చని తద్వారా చేతిలో కొంత అధిక మొత్తం నగదు ఆడుతుందని సంస్థ వర్గాలు తెలిపాయి. మెట్రోలో సుమారు పది లక్షల పైచిలుకు కిరాణా దుకాణదారులు కొనుగోళ్లు చేస్తుంటారు. స్మార్ట్ కిరాణా ప్రోగ్రాంలో భాగంగా 2,000 రిటైలర్లతో మెట్రో జత కట్టింది. 48 గంటల వ్యవధిలో వారి స్టోర్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం, ఉత్పత్తులను ఎలా ఎక్కడ డిస్‌ప్లే చేయాలి వంటి అంశాల్లో టిప్స్ అందిస్తోంది. అలాగే వారు డిజిటల్ బాట పట్టేందుకు అవసరమయ్యే పీవోఎస్ మెషీన్లను కూడా స్వల్ప చార్జీలకు అందిస్తోంది. ఇలా ఆధునీకరించిన కిరాణా దుకాణాల అమ్మకాలు 30–40 శాతం పెరిగాయని మెట్రో ఎండీ అరవింద్ మేదిరాట్ట తెలిపారు. దాదాపు 1 లక్ష పైచిలుకు రిటైలర్ల స్టోర్స్‌ని మెట్రో ఉత్పత్తులను నేరుగా డెలివరీ చేస్తోంది. ఆన్‌లైన్‌లో రోజుకు నాలుగైదు సార్లయినా ఆర్డర్ చేసే వెసులుబాటు ఇస్తుండటంతో దుకాణాదారులు పెద్ద మొత్తంలో ఉత్పత్తులను ముందుగానే కొని నిల్వ చేసుకోవాల్సిన సమస్య ఉండదని సంస్థ వర్గాలు తెలిపాయి.
జియో ప్రత్యేక బాట
ఇప్పటికే 200 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న జియో మార్ట్ సంస్థ .. కిరాణా దుకాణాదారులను డెలివరీ వ్యవస్థ ఆఖరు దశలోనూ (లాస్ట్ మైల్ డెలివరీ - ఎల్‌ఎండీ) భాగస్వాములుగా చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపార విభాగాన్ని (ప్రస్తుతం కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది) ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. తద్వారా దేశీయంగా సంఘటిత రిటైల్ రంగంలో 17 శాతం వాటాను దక్కించుకుంటే .. తయారీ సంస్థలతో మరింతగా బేరమాడి ఇంకా తక్కువ రేటుకే ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చని యోచిస్తోంది. జియో మార్ట్ .. పీవోఎస్ మెషీన్లతో పాటు నిల్వలు, వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ, రుణ సదుపాయాలు మొదలైనవి కూడా కల్పిస్తోంది. వాట్సాప్‌తో జట్టు కట్టడంతో ఈ లావాదేవీలన్నీ మరింత సులభతరంగా నిర్వహించేందుకు వీలు పడనుంది. అటు అమెజాన్ కూడా ఈ తరహా వ్యూహాన్ని మరో రకంగా అమలు చేస్తోంది. ఎల్‌ఎండీ కోసం ’ఐ హ్యావ్ స్పేస్’ అనే ప్రోగ్రాం నిర్వహిస్తోంది. సుమారు 28,000 చిన్న రిటైలర్లు ఇందులో భాగంగా ఉన్నారు. తమ స్టోర్స్‌కి 2-4 కి.మీ. పరిధిలో ఉత్పత్తులను అందిస్తున్నారు. దీనితో సదరు స్టోర్స్‌కి నెలకు రూ.12,000 నుంచి రూ.15,000 దాకా అదనపు ఆదాయం కూడా లభిస్తోందని అమెజాన్ వర్గాలు తెలిపాయి.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా...
ఇక మెట్రో తరహాలోనే ఉడాన్ కూడా దాదాపు ముప్భై లక్షల మంది పైచిలుకు చిన్న రిటైలర్లకు ఉత్పత్తులు విక్రయిస్తోంది. తయారీ సంస్థల నుంచి ఉత్పత్తులను నేరుగా స్టోర్స్‌కే అందిస్తోంది. పంపిణీలో వివిధ దశలు తగ్గిపోవడం, మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువగా లేకపోవడం వల్ల మూడు నుంచి నాలుగు శాతం కమీషన్ ఆదా అవుతుందని .. దాన్ని రిటైలర్లకు బదలాయించవచ్చని ఉడాన్ వర్గాలు తెలిపాయి. అంతే గాకుండా తమ సొంత నాన్–బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీతో పాటు ఇతరత్రా ఆర్థిక సంస్థల ద్వారా దుకాణదారులకు అవసరాన్ని బట్టి రుణాలు కూడా ఇప్పిస్తోంది. ఇప్పటిదాకా సుమారు రూ.7,300 కోట్ల దాకా ఇలా స్వల్పకాలిక రుణాలిచ్చినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. సకాలంలో స్టోర్స్‌కి డెలివరీ చేసేందుకు ఉడాన్ దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి చ.అ. విస్తీర్ణంలో 200 గిడ్డంగులు ఏర్పాటు చేసుకుంది. ఈ పరిమాణాన్ని అయిదింతలు పెంచుకోవాలని భావిస్తోంది.
మన ఇంటి పక్కన కిరాణా దుకాణాదారుడే కింగ్
Published Thu, Apr 15 2021 1:00 AM | Last Updated on Thu, Apr 15 2021 4:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment