షర్మిలా రెడ్డి నిర్వహిస్తున్న రెస్టారెంట్ ప్రాగణంలో ఫోన్‌లో మాట్లాడుతున్న గుడా సీపీవో రామ్‌కుమార్
సాక్షి,తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: తమ పాలనలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే ఊరుకునేది లేదంటూ అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపు పాలన రాజమహేంద్రవరంలో సాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య రాజధాని రాజమహేంద్రవరంలో అనధికారిక కట్టడాలు, ఆ కట్టడాల వెనుక జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతల వ్యాపారాలపై అధికారులతో దాడులు చేయిస్తూ నగరంలో మొదటిసారిగా సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఎలాంటి అనుమతుల లేకుండా ప్రసాదిత్య సంస్థ భారీ మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్ నిర్మిస్తోంది. కనీస నిబంధనలు, రక్షణ చర్యలు చేపట్టకుండా దాదాపు 70 అడుగుల లోతు గోతులు రెండు ఎకరాల్లో తీశారు. ఫలితంగా దాని పక్కన ఉన్న అపార్ట్‌మెంట్, రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. సాధారణ ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే సవాలక్ష ఆంక్షలు, తనిఖీలు చేసే అధికారులు ఇంత పెద్ద భారీ నిర్మాణం అనధికారికంగా సాగుతుంటే ఎలా మిన్నకుండిపోయారని, ఈ విషయంపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్‌రావు, చీఫ్‌విప్ మింది నాగేంద్ర, విప్ ఈతకోట బాపన సుధారాణి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం. పిల్లి నిర్మల, కురుమిల్లి అనురాధ పట్టుబట్టారు. ఈ పెద్ద వ్యవహారంలో నిజా నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. కానీ చర్చకు అంగీకరించని అధికార పార్టీ ఎదురుదాడికి దిగింది. రెచ్చగొట్టేలా పరుష పదజాలం ఉపయోగించింది. అయినా తమ పట్టువీడకుండా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు చర్చకు డిమాండ్ చేయడంతో వారిలో కొంత మందిని సస్పెండ్ చేస్తూ మార్షల్స్‌తో బలవంతంగా బయటకు తొసేశారు.
షర్మిలారెడ్డి రెస్టారెంట్‌పై దాడులు..
అనుమతులు లేకుండా నిర్మిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించిన మల్టిప్లెక్స్‌తోపాటు అనుమతులు లేకుండానే నిర్మాణం పూర్తి చేసుకుంటున్న కన్వెన్షన్ సెంటర్‌లపై చర్చకు వైఎస్సార్‌సీపీ నేతలు పట్టుబట్టిన నేపథ్యంలో అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగారు. రెండు నిర్మాణాలు అనధికారికంగా నిర్మించడం వల్ల నగరపాలక సంస్థకు పన్నులు, ఫీజులు రూపంలో దాదాపు రూ.20 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతోంది. ఈ రెండు నిర్మాణాల్లో ఎంపీ మురళీమోహన్‌కు వాటాలున్నాయని బలమైన ఆరోపణలున్నాయి. వీటిపై ప్రశ్నించిన ప్రతిపక్ష ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి వై జంక్షన్‌లో నిర్మిస్తున్న ‘ఈట్ అండ్ ప్లే’ రెస్టారెంట్‌కి అనుమతులు లేవంటూ గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) అధికారులు దాడులు చేశారు. గుడా చీఫ్ ప్లానింగ్ అధికారి రామ్‌కుమార్, ఇతర సిబ్బంది గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రెస్టారెంట్‌కు వచ్చారు. నిర్మాణ అనుమతి పత్రాలు, ఇతర అంశాలపై అక్కడిక్కడే తనిఖీలు చేశారు. పత్రాలను పరిశీలించారు. అక్కడ నుంచే ఫోన్లు చేసి ఎవరితోనో మాట్లాడారు.
విస్తుబోతున్న రాజమహేంద్రి...
పాలనలో లోపాలపై ప్రశ్నించిన వారి వ్యాపారాలను దెబ్బతీసేలా దాడులు చేస్తామంటూ అధికార పార్టీ పెద్దల వ్యవహరిస్తున్న తీరు రాజమహేంద్రవరం నగర ప్రజలను విస్తుబోయేలా చేస్తోంది. రెస్టారెంట్‌పై దాడులు చేసే సమయంలో మేడపాటి షర్మిలారెడ్డి నగరంలో లేరు. కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత కుటుంబంతో కలసి దేవాలయాల సందర్శనకు వెళ్లారు. సంబంధిత యజమానులు లేని సమయంలో, అక్రమాలపై ప్రశ్నించిన గంటల వ్యవధిలోనే అధికారులు రెస్టారెంట్‌పై దాడులు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా..’ అన్న చందంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తున్న సదరు నేతలు ఎన్నడూ లేనిది రాజమహేంద్రవరంలో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని నగర ప్రజలు చర్చింకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment