సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి కుమారుడి కిడ్నాప్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఘటన జరిగిన తీరును బట్టి అది వారికి బాగా తెలిసిన వ్యక్తులు చేసినట్లుగా స్పష్టమవుతోంది. బుధవారం రాత్రి బాలుడితో సహా కారును దుండగుడు ఎత్తుకెళ్లగా కారు వేగం తగ్గిన సమయంలో బాలుడు దూకేసిన విషయం తెలిసిందే. అయితే తెల్లవారు జామున వాహనాన్ని అగంతకుడు గోకవరంలో వదిలాడు. కారు ఉన్న ప్రదేశాన్ని వివరిస్తూ రాసిన లేఖను గురువారం ఉదయం ఆరు గంటలకు షర్మిలా రెడ్డి నివాసం వద్ద వదలడం పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షర్మిలా రెడ్డి ఏవీ అప్పారావు రోడ్డులోని తన రెస్టారెంట్ నుంచి తన కుమారుడితో నూతన ఇన్నోవా వాహనంలో ఇంటికి వచ్చారు.
కుమారుడిని కారులోనే ఉంచిన ఆమె తన కుమార్తెను తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లారు. వెంటనే అగంతకుడు బాలుడితో సహా కారును ఎత్తుకెళ్లాడు. నగరంలోని ఎపెక్స్ ఆస్పత్రి వద్ద వాహన వేగం తగ్గడంతో బాలుడు కిందకు దూకేశాడు. నగదు కోసం బాలుడుని కిడ్నాప్ చేయాలనుకుంటే అగంతకుడు పక్కా ప్రణాళికతో వచ్చేవాడని పోలీసులు భావిస్తున్నారు. బాలుడిని స్పృహతప్పే విధంగా చేయడం, బాలుడు కిందకు దూకేస్తుంటే అడ్డుకోకపోవడం, కారు డోర్లు లాక్ చేసే అవకాశం ఉన్నా చేయకపోవడం వల్ల అగంతకుడు బాలుడుని కిడ్నాప్ చేయడానికి వచ్చినట్లుగా లేదని ఘటన జరిగిన తీరు తెలుపుతోంది. నిన్ను ఏం చేయనంటూ నిందితుడు బాలుడితో చెప్పడం, కారులో నుంచి దూకుతుంటే అడ్డుకోకపోవడం అతను బాలుడిని కిడ్నాప్ చేయడానికి వచ్చినట్లుగా లేదని పోలీసులు అంచనాకు వస్తున్నారు. కిడ్నాప్ చేయాలనుకుంటే అగంతకుడు ఒక్కడే రాడని పలువురు బృందంగా వచ్చేవారని భావిస్తున్నారు.
కావాలనే చేశారా...?
తెల్లవారితే దీపావళి పండుగ నేపథ్యంలో రాజకీయ నేత అయిన షర్మిలా రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ వ్యవహారం నడిపారా అన్న అనుమానాలకు ఘటన జరిగిన తీరు, అనంతరం పరిణామాలు బలపరుస్తున్నాయి. షర్మిలా రెడ్డి కుటుంబం అంటే పడని బంధువులు, లేదా రాజకీయ ప్రత్యర్థులు ఈ పని చేసి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పండగ రోజున ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించాలన్న ఉద్దేశంతోనే తెలిసిన వారు ఈ పని చేశారని నగరంలో చర్చ జరుగుతోంది. ఘటన జరిగినప్పటి నుంచి షర్మిలారెడ్డి కుటుంబం ఇంకా కోలుకోలేకపోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేత కుటుంబానికి ఇలా జరగడంపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.
అగంతకుడి కోసం ముమ్మర గాలింపు...
అగంతకుడి కోసం ఒకటో పట్టణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సీఐ రవీంద్ర పర్యవేక్షణలో ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో మూడు బృందాలు గాలిస్తున్నాయి. అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి ఈ కేసును సవాల్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో నిందితుడిని పట్టుకుంటామని సీఐ రవీంద్ర చెప్పారు.
కారు వదిలి.. లేఖ రాసి...
బాలుడు దూకేసిన తర్వాత కారుతో వెళ్లిపోయిన అగంతకుడు వాహనాన్ని గోకవరం సమీపంలో వదిలాడు. ఆ విషయాన్ని గురువారం తెల్లవారు జామున ఆరు గంటలకు ఓ లేఖలో వివరిస్తూ దానవాయిపేటలోని షర్మిలారెడ్డి ఇంటి ముందు వదిలాడు. బుధవారం రాత్రి ఘనట జరిగిన తర్వాత తెల్లవారు జాము 3 గంటల వరకు ఆమె ఇంటి వద్ద పలువురు రాజకీయ నేతలు, నగర ప్రముఖులు ఉన్నారు. పోలీసులు 4 గంటల వరకూ అక్కడే ఉన్నారు. అయినా ఆరు గంటలకు అగంతకుడు అక్కడ లేఖను వదలడంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి తెలిసిన వారు అక్కడే ఎవరో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే జన సంచారం లేని సమయం చూసి ఖచ్చితంగా అదే సమయానికి అక్కడికి ఎలా వస్తాడన్నది ప్రశ్నగా మారింది. లేఖను అక్కడ అగంతకుడు వదిలాడా? లేక అతనికి సంబంధించిన వారు వదిలారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే కొనుగోలు చేసిన రూ.18 లక్షల విలువైన తెలుపురంగు ఇన్నోవా కారును తీసుకెళ్లి మళ్లీ గంటల వ్యవ్యధిలో నగరం బయట వదిలి ఆ సమాచారం చేరవేయడంతో అతను దొంగ కాదని పోలీసులు భావిస్తున్నారు. బాలుడిని వదిలివేయడంతో అతను కిడ్నాపర్ కాదని, రూ.18 లక్షల విలువైన కారును తిరిగి వారికి అప్పగించేలా లేఖలో సమాచారం ఇవ్వడంతో దొంగ కాదన్న విషయం స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment