సాక్షి, హైదరాబాద్: వార్షిక బడ్జెట్ సమావేశాలను (2022–23) ఈ నెల 25 లేదా 28వ తేదీ నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సుమారు పక్షం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెల 25 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే పక్షంలో తొలి రోజు గవర్నర్ ప్రసంగం, 26న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగే అవకాశముంది. ఈ నెల 28న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి శివరాత్రి పండుగ నేపథ్యంలో రెండ్రోజుల విరామం తర్వాత మార్చి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి.
బడ్జెట్‌తో పాటు పద్దులకు సంబంధించి చర్చ వచ్చే నెల 16వ తేదీ వరకు కొనసాగే సూచనలున్నాయి. సమావేశాల ప్రారంభానికి ముందు ఈ నెల 24 లేదా 25 తేదీల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కాగా, శాసన మండలి చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీ కాలపరిమితి గతేడాది జూన్‌లో ముగియడంతో భూపాల్‌రెడ్డి ప్రొటెమ్ చైర్మన్‌గా శాసన మండలి సమావేశాలను నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం కూడా పూర్తవడంతో ఆయన స్థానంలో ఎంఐఎం పార్టీకి చెందిన అమీనుల్ జాఫ్రీ ప్రస్తుతం ప్రొటెమ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల ఆరంభంలో మండలి కొత్త చైర్మన్ ఎన్నిక కోసం షెడ్యూలు విడుదలయ్యే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment