- ఏప్రిల్ 20 నుంచి లోక్‌సభ సమావేశాలు
న్యూఢిల్లీ: రాజ్యసభ మలిదశ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘రాజ్యసభ 234వ సమావేశాలు(బడ్జెట్ సమావేశాల మొదటి భాగం) మార్చి 28, 2015న ప్రొరోగ్ అయ్యాయి. పెద్దల సభ 235వ సమావేశం ఏప్రిల్ 23న మొదలవుతుంది.
లోక్‌సభ ఏప్రిల్ 20న ప్రారంభమై, మే 8తో ముగుస్తుంది. రాజ్యసభ మే 13 వరకు కొనసాగుతుంది’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభతో పాటు ఏప్రిల్ 20న రాజ్యసభను సమావేశపరచటానికి ప్రభుత్వానికి ఇబ్బంది లేనప్పటికీ, రాజ్యసభ నియమావళిలోని 39వ నిబంధన ప్రకారం వివిధ అంశాలపై నోటీసులు ఇవ్వటానికి సభ్యులకు 15 రోజుల సమయమివ్వాల్సి ఉన్నందున ఏప్రిల్ 23నుంచి పెద్దలసభ సమావేశాలను మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెజారిటీ లేకపోవటం వల్ల భూసేకరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి సాహసించలేకపోయిన ఎన్డీఏ సర్కారు, దానికి సంబంధించిన ఆర్డినెన్సును రెండోసారి జారీ చేసేందుకు పెద్దల సభను ప్రొరోగ్ చేసిన సంగతి తెలిసిందే.