మేయర్ కోనేరు శ్రీధర్ తీరును నిరసిస్తూ పోడియం ఎదుట నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు
సాక్షి, అమరావతి బ్యూరో/ భవానీపురం(విజయవాడ పశ్చిమం): నగరపాలకసంస్థ 2018–2019 బడ్జెట్ సమావేశం రసాభాసాగా మారింది. రూ.1481 కోట్ల అంచనాలతో కార్పొరేషన్ బడ్జెట్‌ను మేయర్ కోనేరు శ్రీధర్ కౌన్సిల్‌లో శుక్రవారం ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చను పక్కదారి పట్టించారు. విపక్ష మహిళా సభ్యులను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బతీశారు. బడ్జెట్‌లో చూపిన అంకెలగారడీని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ సభ్యులను బలవంతంగా మర్షల్స్‌తో బయటకునెట్టిం చారు. సమావేశంలో తానే నియంతనంటూ ఆయన వ్యవహరించిన తీరు విస్మయపరిచింది. తోటి సభ్యులను ఏక వచనంతో మాట్లాడుతూ సమావేశంలో రగడ సృష్టించారు.
విజయవాడ కార్పొరేషన్‌కు సంబంధించి 2017–18 డ్రాఫ్ట్ రివైజ్డ్ బడ్జెట్‌తోపాటు 2018–19 డ్రాఫ్ట్ బడ్జెట్ సమావేశం శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగింది. తొలుత ఇటీవల మృతి చెందిన మాజీ కార్పొరేటర్లు ఇజ్జాడ అప్పలనాయుడు, మరుపిళ్ల మోహన్ తిలక్‌కు సంతాప తీర్మానం చేసి మౌనం పాటించారు. అనంతరం మేయర్ శ్రీధర్, కమిషనర్ జె.నివాస్ కార్పొరేటర్లందరికీ ట్యాబ్‌లు అందజేశారు. అనంతరం మేయర్ కోనేరు శ్రీధర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్ల మాదిరిగానే, నాల్గో బడ్జెట్ కూడా పేద, మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం పడకుండా రూపొందించామని చెప్పారు. నగర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిధుల లభ్యతనుబట్టి అంచనాలు తయారుచేశామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నివాస్ మాట్లాడుతూ 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి నికర ఆదాయ వ్యయాలు, రెవెన్యూ ఆదాయ వ్యయాలకు, క్యాపిటల్ ఆదాయ వ్యయాలకు సంబంధించిన డ్రాఫ్ట్ బడ్జెట్‌ను తయారు చేశామని చెబుతూ వాటి వివరాలను
వెల్లడించారు.
అంకెలగారడీ
బడ్జెట్‌పై వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ బడ్జెట్ అంకెల గారడీగా ఉందని విమర్శించారు. గత బడ్జెట్‌లో పొందుపరిచిన అంకెలనే ఈ బడ్జెట్‌లోనూ చూపి మసిపూసి మారేడుకాయ చేశారని దుయ్యబట్టారు. బడ్జెట్‌లోని పలు అంశాలను ఉటంకిస్తూ వాటన్నింటికీ అధికారులతో సమాధానం చెప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కార్పొరేషన్‌కు రావాల్సిన నిధులను పొందడంలో పాలకపక్షం విఫలమైందని విమర్శించారు. దీంతో మేయర్ జోక్యంచేసుకుని ‘బడ్జెట్ గురించి తెలియకపోతే తెలుసుకోవాలి. ఎలా అంటే అలా మాట్లాడకూడదు’ అంటూ అవహేళన చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ లేచి ఒక మహిళా కార్పొరేటర్‌ను అగౌరవంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. బడ్జెట్‌లో ప్రజలకు మేలు చేస్తున్నట్లుగా లాభాలు చూపించి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో మేయర్ కల్పించుకుని ‘అంతా నా ఇష్టం.. ఈ కౌన్సిల్ నాది’ అని అనేసరికి బుల్లా విజయ్ కోపంతో బడ్జెట్ ప్రతిని బల్లపై కొట్టారు.
అదికాస్తా కిందపడటంతో బడ్జెట్ ప్రతిని విసికొట్టి అగౌరవంగా ప్రవర్తించిన విజయ్‌ను సస్పెండ్ చేయాలంటూ అధికార పార్టీ సభ్యులు గొడవకు దిగారు. ఇంతలో కార్పొరేటర్ టి.జమల పూర్ణమ్మ లేచి పుణ్యశీల, విజయ్‌కు మద్దతుగా మాట్లాడటంతో ‘ఇదేమన్నా సంతనుకున్నారా? ఎవరుపడితే వాళ్లు ఇష్టం వచ్చి నట్లు లేచి మాట్లాడటానికి, ఆవిడను బయటకు పంపించేయండి’ అంటూ సెక్రటరీని మేయర్ ఆదేశించారు. దీంతో జమల పూర్ణమ్మ, విజయ్, చందన సురేష్ వెళ్లి మేయర్ పోడియం ఎదుట బైఠాయించారు. దీంతో ఈ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నానని మేయర్ ప్రకటించారు. మార్షల్స్ వచ్చి వారిని బలవంతాన బయటకు తీసుకెళ్లడంతో సభ రసాభాసగా మారింది. అనంతరం మేయర్ సభను 3 గంటలకు వాయిదా వేశారు.
పుస్తకం విసిరేస్తే సస్పెండ్ చేస్తారా?
ఏ బైలాలో ఉందో చెప్పండి : పుణ్యశీల
భవానీపురం (విజయవాడ పశ్చిమం): సభ వాయిదా అనంతరం వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల మాట్లాడుతూ పుస్తకం విసిరేస్తే సభ్యులను సస్పెండ్ చేయాలని ఏ బైలాలో ఉందని మేయర్‌ను ప్రశ్నిం చారు. ‘మేయర్‌గా నాకు ఆ అధికారం ఉంది. నా ఇష్టం’ అంటూ శ్రీధర్ అన్నారు. నాలుగేళ్లగా కౌన్సిల్‌లో అదే జరుగుతోంది కదా అని పుణ్యశీల విమర్శించారు. క్యాపిటల్ ఆదాయంపై మాట్లాడే అవకాశం తనకు ఇవ్వరని, పాలకపక్ష సభ్యులు ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడినా పట్టించుకోరని పేర్కొన్నారు. ప్రతి పక్ష సభ్యులను మాట్లాడనివ్వనప్పుడు కౌన్సిల్ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు.
ట్యాబ్ వెనక్కు ఇచ్చిన ఆదిలక్ష్మి
తనకు ఇచ్చిన ట్యాబ్‌ను సీపీఎం ఫ్లోర్‌లీడర్ గాదె ఆది
లక్ష్మి వెనక్కు ఇచ్చారు. దీంతో టీడీపీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున స్పందించి ఈ చర్య కౌన్సిల్‌ను అవమానించడమన్నారు. మేయర్ జోక్యం చేసుకుని వారి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆమె తిరిగి ఇచ్చేశారని హితవుపలకడంతో కాకు మిన్నకుండిపోయారు. అనంతరం ఆదిలక్ష్మి మాట్లాడుతూ కార్పొరేషన్ తాకట్టు పెట్టిన ఆస్తులను ఎప్పుడు విడిపిస్తారని ప్రశ్నించారు. కొండ ప్రాంత అభివృద్ధికి గత బడ్జెట్లో రూ.7కోట్లు కేటా యించి, రూపాయి ఖర్చుపెట్టలేదని, మళ్లీ అదే మొత్తం కేటాయించారని విమర్శించారు. ఇప్పుడైనా ఖర్చుపెడతారా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత యువజనోత్సవాలు నిర్వహించడం లేదని, వన్‌టౌన్‌లోని షేక్ రాజా హాస్పిటల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు 010 అంశంపై మాట్లాడారు.
సంస్కారం తెలియని మేయర్
వైఎస్సార్ సీపీ సభ్యుల విమర్శ
భవానీపురం(విజయవాడ పశ్చిమం): తమను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బుల్లా విజయ్, చందన సురేష్, జమల పూర్ణమ్మ కౌన్సిల్ హాల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వారికి మద్దతుగా ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, బొప్పన భవకుమార్, కె.దామోదర్, షేక్ బీజాన్‌బీ, బట్టిపాటి సంధ్యారాణి, పాల ఝాన్సీ నిలిచారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ కౌన్సిల్‌ను సంతతో పోల్చిన మేయర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ పూర్ణమ్మను సంతలో మనిషిగా మాట్లాడిన మేయర్ శ్రీధర్ సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. మహిళా సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ ఆ పదవికి అనర్హుడని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. జమల పూర్ణమ్మ మాట్లాడుతూ మేయర్‌కు మహిళలపై గౌరవం లేదన్నారు. ఆయనకు సస్పెండ్ చేయడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కళ్లకు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు బాధ్యతలను డెప్యూటీ మేయర్‌కు అప్పగించవచ్చుకదా అని సూచించారు. చందన సురేష్ మాట్లాడుతూ ప్రజావాణిని కౌన్సిల్‌లో వినిపించనీయకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. పాలకపక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. ప్రజలపై పన్నుల భారం వేయలేదంటూనే త్వరలో నీటి మీటర్లు పెట్టే అంశంపై కౌన్సిల్‌లో మాట్లాడటంలో ఆంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment