Koneru Sridhar
-
చంద్రబాబు ఫోటో ఎందుకు తీశారంటూ...
సాక్షి, విజయవాడ : నగర కార్పొరేషన్లో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోల రగడ తీవ్రస్థాయికి చేరింది. కార్పొరేషన్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలను తొలగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోటోను ఏర్పాటు చేశారు అధికారులు. దీనిపై నగర మేయర్ కోనేరు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడకుండా హాల్లో చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలు ఎందుకు తీశారంటూ అధికారులపై చిందులేశారు. ఎన్టీఆర్ ఫోటో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ ఫోటో పెడితే వైఎస్సార్ ఫోటో కూడా పెట్టాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇద్దరు మాజీ సీఎంలే కాబట్టి ఒద్దరివి పెట్టాలని మేయర్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. కార్పొరేషన్ తనదని, తాను చెప్పిందే చేయాలంటూ అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘విజయవాడ టీడీపీ నాయకుల సొత్తా?’
సాక్షి, విజయవాడ: నగరంలో రాజకీయ పార్టీల కటౌట్ల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంపై జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఆ పార్టీ నాయకులు మంగళవారం నగర మేయర్ కోనేరు శ్రీధర్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నగరంలో టీడీపీ కటౌట్లు తప్ప ఇతర పార్టీలకు చెందిన కటౌట్లను పెట్టనియడం లేదని ఆరోపించారు. ఒకవేళ కటౌట్లు పెట్టినప్పటికీ.. 24 గంటలలోపే తొలగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు చెందిన కటౌట్లకు అనుమతి లేకపోయిన వాటిని నెలల తరబడి చూసిచూడనట్టు వదిలేస్తున్నారని తెలిపారు. విజయవాడ టీడీపీ నాయకుల సొత్తు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నగరంపై అన్ని పార్టీలకు సమాన హక్కు ఉందన్నారు. -
విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ ఇంట్లో ఐటీ దాడులు
-
విజయవాడ మేయర్ ఇంట్లో సోదాలు
విజయవాడ: విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ ఇంట్లో మంగళవారం రాత్రి జీఎస్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పటమట పోస్టల్ కాలనీ బస్టాప్ సమీపంలోని మేయర్ ఇంట్లో 8 మంది అధికారుల బృందం దాడులు నిర్వహించి కీలకపత్రాలు, రికార్డులు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. పుష్కరాల సమయంలో పుష్కరనగర్ తదితర ప్రాంతాల్లో అధికారులు, సిబ్బందికి భోజనాల ఏర్పాటు సహా పలు ఈవెంట్ల నిర్వహణను చేపట్టిన కేఎంకే సంస్థపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. కేఎంకే ఈవెంట్స్ సంస్థకు మేయర్ భార్య డైరెక్టర్‌గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టిన నేపథ్యంలో కొంతమంది కార్పొరేటర్లు జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జీఎస్టీ అధికారులు మంగళవారం రాత్రి మేయర్ ఇంటికి ద్విచక్రవాహనాలపై వచ్చి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు సుమారు 2 గంటల పాటు సోదాలు జరిగాయి. జీఎస్టీ చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటంతోనే సోదాలు జరిపినట్లు సమాచారం అందింది. -
ఎమ్మెల్యే గద్దె వర్సెస్ మేయర్ కోనేరు
నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహారశైలి ఈ సారి సీఎం వద్దకు చేరింది. తాము సూచించిన పనులను పక్కన పెట్టడమేకాక తన అనుచరుల భవనాలను కూల్చివేయాలంటూ మేయర్ ఆదేశాలిస్తున్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు ఇటీవల సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు సాధించామని గొప్పకు పోయి రెండు రోజుల కిందట సీఎం వద్దకు వెళ్లిన మేయర్‌పై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోమంటూ అక్షింతలు వేశారు. ఎమ్మెల్యేలతో వివాదాలు తగదని.. పద్ధతి మార్చుకోమని చంద్రబాబు మేయర్‌కు తనదైన శైలిలో క్లాస్ పీకారు. విజయవాడ నగరంలో ఓ వైపు మేయర్ మరో ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న అంతర్యుద్ధాన్ని నగరవాసులు ఆసక్తిగా గమనించడం విశేషం. సాక్షి, అమరావతిబ్యూరో : టీడీపీకి విజయవాడ నగరంలో కొరకురాని కొయ్యగా మారిన మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహార శైలి తాజాగా మరోమారు చర్చనీయాంశంగా మారింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో విభేదాలు మరింత జఠిలంగా తయారయ్యాయి. ఇద్దరి మధ్య విభేదాలు ముదిరిన నేపథ్యంలో తూర్పు సీటు తనకే కేటాయిం చాలంటూ కోనేరు ఆ పార్టీ పెద్దలను కలుస్తూ, ముఖ్యనేతల ద్వారా పావులు కదుపుతున్న వైనం గద్దెకు మరింత కోపం తెప్పిస్తోంది. ఇప్పటికే తన వివాదాస్పద వ్యాఖ్యలతో వీఎంసీలో మేయర్ కోనేరు శ్రీధర్ ఒంటరయ్యారనే చెప్పాలి. కోనేరు వ్యవహార శైలిపై గుర్రుమంటున్న పాలకపక్ష కార్పొరేటర్లు కూడా దూరమయ్యారు. తనతో సన్నిహితంగా మెలిగే కార్పొరేటర్లు కూడా మేయర్ శైలితో విసిగిపోయి ఆయనకు దూరంగా ఉంటున్నారు. మేయర్ అధికారాలపై కత్తెర వేయడం, కమిషనర్‌కు నిధులు మంజూరు అధికారం పెంచడం లాంటి పరిణామాల నేపథ్యంలో కోనేరును పట్టించుకొనే వారు కరువయ్యారు. తోటి కార్పొరేటర్లు కలసి రాకపోవడంతో నాలుగేళ్లు పాలన పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకోలేని దుస్థితి కూడా నెలకొంది. ఇవి వివాదాస్పద అంశాలు... మొగల్రాజపురంలోని సెవెన్‌డేస్ హోటల్‌పైన వీఎంసీ అనుమతి లేకుండా అక్రమంగా అదనపు ఫ్లోర్ వేసిన వ్యవçహారంలో మేయర్ కోనేరు శ్రీధర్‌కు, ఎమ్మెల్యే గద్దెకుమధ్య వివాదం రాజుకుంది. తన అధికారాల్లో ఎమ్మెల్యే తలదూర్చుతున్నారని, తాను చెప్పినా మేయర్ పట్టించుకోవటంలేదని ఇద్దరు ఒకరినొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మేయర్ పీఠమే కదిలే పరిస్థితి ఏర్పడింది. తాజాగా వీఎంసీలోని మూడో డివిజన్ పరిధిలోని క్రీస్తురాజపురం నుంచి గుణదల వరకు (అమ్మా కల్యాణ మండపం నుంచి ఈఎస్ఐ ఆస్పత్రి వరకు) ఉన్న రోడ్డు విస్తరణకు వీఎంసీ ఇప్పటికే 80 అడుగుల రోడ్డుగా విస్తరించాలని సర్వే చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 7 కోట్లు నిధులు కేటాయించింది. ఈ డివిజన్లోని ఎల్ఐసీ కాలనీలో చేపట్టిన స్ట్రామ్‌వాటర్ పనులపై స్థానికులు అడ్డుచెప్పగా ఎమ్మెల్యే అండగా ఉన్నారు. ఆ ప్రాంతంలో స్ట్రామ్‌వాటర్ పనులు ఆపోద్దని అ«ధికారులను ఇటు మేయర్ కూడా ఆదేశించారు. తాను కూడా తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో ఉన్నానని, ముఖ్యమంత్రి తనకు సీటిస్తారని ఆశిస్తున్నానని, స్థానికేతరులను తీసుకువచ్చి తమ తలపై రుద్దితే ఒప్పుకునేదిలేదని పరోక్షంగా మేయర్ కోనేరు శ్రీధర్ తూర్పు ఎమ్మెల్యే గద్దెపై అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఇటు గద్దె మేయర్‌కు ఉన్న వివాదం మరింత దుమారం రేగుతోంది. వీఎంసీ ఆదాయంపై ఎమ్మెల్యేలు.... ‘నగరపాలక సంస్థ ఇప్పటికే అప్పుల్లో ఉంది. దీని నుంచి గట్టెక్కడానికి నగరంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు చేసింది శూన్యం. దీనికితోడు ఎమ్మెల్యేలు నగరపాలక సంస్థ ఆదాయంపై పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టాల్సిన వారే వీఎంసీ ఆదాయంలో తమకూ కోటా కావాలంటూ పట్టుబట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు అంటున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు బీపీఎస్ నిధుల నుంచి రూ. 3 కోట్లు కావాలని కమిషనర్‌ను కోరారు. ఆయనేమో అడిగిందే తడవుగా కోట్లకు కోట్లు వారికి కేటాయించేస్తున్నారు. ఓ వైపు కార్పొరేటర్లు బడ్జెట్ పెంచాలని పదేపదే అడుగుతున్నా ఇంత వరకు సరైన సమాధానం లేకుండా పోయిందని కోనేరు శ్రీధర్ తన సన్ని హితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహ్వానాల విషయంలో ... తూర్పు నియోజకవర్గంలో వీఎంసీ చేపట్టే ఎలాంటి అభివృద్ధి పనులనైనా తనను ఆహ్వానించాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె వీఎంసీ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తుండగా తనకు తెలియకుండా ఎవరికీ ఆహ్వానాలు ఇవ్వవద్దని మేయర్ అధికారులకు హుకుం జారీ చేశారు. ఇద్దరి మధ్య వైరం ఉన్న నేపథ్యంలో వీఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న విభేదాలు నగరాభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలక వర్గం ఏర్పడి నాలుగేళ్లయినా ఇప్పటికీ నగరంలో చెప్పుకోదగిన అభివృద్ధి చేయలేదు. ఈ ఏడాదిలోనూ చేసే అవకాశాలు కన్పించడం లేదు. ప్రజాప్రతినిధులు కుమ్ములాటలతోనే కాలం వెళ్లదీశారు. -
కారొద్దు...డీజిల్ ముద్దు !
‘నాకు పెద్దకారు కావాలి.. కనీసం రూ.30 లక్షలుండాలి.. అంతేతప్ప చిన్నా చితక కార్లు నాకొద్దు.. నాకు కార్లున్నాయి.. వాటిని వాడుకుంటా’.. అంటూ నగరంలో సంచలన నిర్ణయాలు తీసుకున్న మేయర్ కోనేరు శ్రీధర్ కార్పొరేషన్ అందించే వాహనాన్ని కాదని తన సొంత కారులో నగర పర్యటనలకు హాజరవుతున్నారు... అయితే ఆ కారు తిరిగేందుకు పోసే డీజిల్, ప్రతి ఏడాది ఇన్సూరెన్స్ మాత్రం కార్పొరేషనే చెల్లిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ నగర పాలక సంస్థ ఆదాయాన్ని మరింత పెంచాలి..ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా వ్యవహరించాలంటూ నిరంతరం తన కిందిస్థాయి సిబ్బందికి హితబోధ చేసే నగర ప్రథమ పౌరుడు మాత్రం కార్పొరేషన్‌కు భారీగానే కోతపెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఆయన వినియోగించే సొంతకారుకు కూడా కార్పొరేషనే ఇన్సూరెన్స్ చెల్లించేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపణలున్నాయి. నాలుగేళ్లుగా ఆయన కారుకు నగర పాలక సంస్థ ఇన్సూరెన్స్ చెల్లిస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. కేవలం మేయరే కాదు... ఆయా విభాగాల ముఖ్య అధికారులు సైతం అదేదారిలో నడుస్తున్నారు. తమ సొంత వాహనాలను కార్పొరేషన్‌కు బాడుగకు పెట్టుకుని వ్యక్తిగత అవసరాలకు కూడా అదే కారును వినియోగిస్తున్నారని పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. నగర పాలక సంస్థ ఆదాయానికి గండి... కార్పొరేషన్‌లోని వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు దాదాపు 30 మంది ఉన్నారు. వీరంతా సొంతకార్లను వినియోగించుకుంటూ వాటి ఖర్చులను మాత్రం కార్పొరేషన్ ఖాతాలో కలిపేస్తున్నారు. ప్రతి అంశానికి నిబంధనలు గుర్తుచేసే అధికారులు మాత్రం తమ సొంత వ్యవహారాల విషయంలో మాత్రం రూల్స్ తొక్కిపెడుతూ నగర పాలక సంస్థ ఆదాయానికి గండికొడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల మేరకు అధికారులకు కేటాయించే కార్లు టాక్సీప్లేట్తో ఉండాలి. అందుకు విరుద్ధంగా అధికారులు వినియోగించే కార్లు మాత్రం వ్యక్తిగత పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్న తెల్లప్లేటు కార్లే ఉన్నాయి. ఇదే అదునుగా ఆయా విభాగాల అధికారులు తమ సొంత కార్లను సైతం కాంట్రాక్టర్ పేరుతో ఏర్పాటు చేసుకుని బిల్లుల చెల్లింపులు చేసేసుకుంటున్నారు. ఒక్కో అధికారి కారుకు రూ. 25 వేలు వెచ్చిస్తున్నప్పటికీ టాక్సీప్లేట్ కాంట్రాక్టర్లు రావటంలేదని వివరణ ఇస్తున్నారు. ఆర్టీఏ నిబంధనలకు వ్యతిరేకం.... సాధారణంగా అధికారులకు వారి పర్యటనలకు ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్లు నిబంధన మేరకు టాక్సీ రిజిస్ట్రేషన్‌తోనే ఉండాలి. ఇది పసుపు రంగులో ఉంటుంది. వ్యక్తిగత కారుకు మాత్రం తెలుపురంగు ఉంటుంది. అధికారులకు కేటాయించే కార్లు ప్రజాధనంతో తిరిగేవి కావటం, అలా ఉంటేనే కాంట్రాక్టర్ నుంచి ప్రభుత్వానికి మూడు నెలలకోమారు బ్రేక్ (వాహనం కండీషన్ ఉందీ లేనిదీ ఆర్టీఏ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి) చేయించాలి. ఇలా చేయటం వల్ల ప్రభుత్వానికి కొంత సొమ్ము ఫీజుల రూపంలో కట్టాల్సి ఉంది. నగర పాలక సంస్థలో అధికారులు వినియోగించే కార్లలో 90 శాతం కార్లు యాజమాని పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్న కార్లే కావటం విశేషం. తెలుపురంగు రిజిస్ట్రేషన్ ఉన్న కార్లు వాణిజ్య వ్యవహారాలకు వినియోగించరాదు. ఇది ఆర్టీఏ నిబంధనల మేరకు చట్టవ్యతిరేకం కూడా. ప్రభుత్వం కూడా అలా తిరిగే కార్లకు బిల్లులు చెల్లించకూడదు. ఇలా చేస్తే చట్టరీత్యా నేరం అని నిపుణులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు నిబంధనల ప్రకారం అయితే అధికారులకు పెట్టే కార్లు టాక్సీప్లేట్ రిజిస్ట్రేషన్‌తోనే ఉండాలి. కానీ కార్పొరేషన్ కాంట్రాక్టర్‌కు రూ. 25 వేలు మాత్రమే చెల్లించటంతో కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావటంలేదు. దీంతో ఓనర్ రిజిస్ట్రేషన్ ఉన్న కార్లకు అనుమతించాల్సి వచ్చింది. మేయర్‌కు మేం డీజిల్ మాత్రమే అందిస్తాం. అదీ పరిమితి లేకుండా. ఇన్సూరెన్స్ మాత్రం మాకు సంబంధం లేదు. ఆయన సొంతకారు కాబట్టి ఆయనే చెల్లించుకుంటున్నారు.– ప్రసాద్, వెహికల్ డిపో అధికారి -
వార్నింగా.. ఊస్టింగా...!
అమరావతిబ్యూరో/భవానీపురం: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఉద్యోగుల ఆగ్రహానికి గురయ్యి వివాదంలో చిక్కుకున్న విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్‌కు అధిష్టానం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందా? అందరి ఒత్తిడి మేరకు ఊస్టింగ్ చేస్తారా అన్నది ప్రస్తుతం నగర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఈ విషయంలో జోక్యం చేసుకుని రచ్చకెక్కిన మేయర్‌పై గత నాలుగు రోజుల నుంచి పత్రికల్లో వస్తున్న కథనాలపై అధిష్టానం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే జరుగుతున్న పరిణామాలపై నివేదిక ఇవ్వాలని పార్టీ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్నకు ఆదేశించినట్లు తెలిసింది. మేయర్‌ను పదవి నుంచి తప్పించాల్సిందే... నోటి దురుసుతో అందరినీ బూతులు తిడుతున్న మేయర్ శ్రీధర్‌ను ఆ పదవి నుంచి తప్పించాల్సిందేనని స్వపక్ష కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. గతంలోకూడా అధిష్టానం ఆదేశాల మేరకు సర్దుకుపోయామని, ఇక తమవల్ల కాదంటున్నారు కార్పొరేటర్లు. మేయర్ వ్యవహారశైలితో ప్రతిపక్షంతోపాటు అధికారులు, ప్రజల మధ్య పార్టీ చులకనై పోతుందని, ఇప్పుడు కూడా వదిలేస్తే రానున్న ఎన్నికలలో ప్రభావం పడుతుందంటున్నారు. ఎవరెన్ని చెప్పినా ఆయన మారరని, పార్టీ ప్రతిష్ట కోసం ఆయన్ని మార్చడం ఒకటే మార్గమని కుండబద్దలు కొడుతున్నారు. అధిష్టానానికి కూడా వారు ఇదే సమాధానం చెబుతున్నారు. ఇటీవల ఇందిరాగాంధీ స్టేడియంలో షాపుల లీజు విషయమై వివాదం కూడా చోటుచేసుకుంది. ఇతర ప్రాంతాలలో ప్రభావం.. విజయవాడ మేయర్‌ను మారిస్తే ఆ ప్రభావం రా>ష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న అధికార పార్టీ మేయర్లపై పడుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల రెండేళ్లకు ఒకరు మేయర్‌గా ఉండాలన్న ఒప్పందాలు అమలుకాక పార్టీలో అంతర్గత కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ శ్రీధర్‌ను మారిస్తే ఒప్పందాన్ని ఉల్లంఘించి కొనసాగుతున్న తమ మేయర్లను కూడా మార్చాలని, ఇతర ప్రాంతాలలోని ఆశావహులు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందని భావిస్తుంది. మంత్రాంగం ఫలించేనా? వాస్తవానికి ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)ని మంగళవారం కలిసి తాడోపేడో తేల్చుకోవాలని అసమ్మతి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. అయితే మంగళవారం శివరాత్రి కావడం, ఆయన కూడా అందుబాటులో లేకపోవడంతో సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేసుకున్నారు. కార్పొరేటర్లతోపాటు మేయర్, ఎమ్మెల్సీ, నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న, మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలుకూడా పాల్గొననున్నట్లు తెలుస్తుంది -
మేయరు.. మస్తుగా మేస్తారు
‘ఎదుటవారిని వేలెత్తి చూపేటప్పుడు మిగిలిన నాలుగు వేళ్లూ మనవైపు చూపిస్తాయన్న సంగతి తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా? ఆయనేమన్నా సత్య హరిశ్చంద్రుడా? తనకు కావాల్సిన పనులను అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ చేయించుకుంటారు. ఎదుటివారు తమ పనులు చేయించుకుంటే హడావుడి చేస్తారు. మమ్మల్ని కూడా ప్రజలే ఎన్నుకున్నారు. మేమంతా ఆయనను నాయకుడిగా ఎన్నుకున్నాం. అంతమాత్రాన నేను మోనార్క్ అనుకోవడం సరికాదు. నోటిదూలతో అధికారులను, తోటి ప్రజాప్రతినిధులను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరికైనా అహం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసు కోనంతకాలం ఇంటా బయట ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.’ – మేయర్ కోనేరు శ్రీధర్‌పై స్వపక్ష కార్పొరేటర్లు ధ్వజమెత్తుతున్న తీరిది.. అమరావతిబ్యూరో/భవానీపురం (విజయవాడ పశ్చిమ): మేయర్ కోనేరు శ్రీధర్‌ను ఆ పదవి నుంచి తప్పించాలనే ప్రయత్నాలు మమ్మురమయ్యాయి. స్వపక్ష కార్పొరేటర్లే ఆయన వ్యవహార శైలిపై విసిగి కుర్చీ నుంచి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీరి వెనుక ఎమ్మెల్యే గద్దె, మరో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీలు ఉండడంతో అతి త్వరలోనే కోనేరుకు పదవీ గండం ఉంటుందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. నేడు ఎంపీ కేశినేనితో భేటీ మేయర్ కోనేరు వ్యవహారశైలిపై దాదాపు 30 మంది కార్పొరేటర్లు ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ, టీడీపీ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న దగ్గర పంచాయితీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి వారందరినీ బుజ్జగించినట్లు తెలిసింది. దీంతో వారందరూ సోమవారం ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) దగ్గరకు వెళదామనుకుంటే ఆయన అందుబాటులో లేక మంగళవారం భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. గద్దెతో వైరమే ముసలానికి కారణమా? గతంలో కూడా మేయర్‌ను ఆ సీటు నుంచి తప్పించాలని స్వపక్ష కార్పొరేటర్లు మూకుమ్మడిగా తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ నాని చొరవతో ఆ గొడవ సద్దుమణిగింది. అదే సమస్య మళ్లీ పునరావృత్తం కావడంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కీలక అనుచరుడి హోటల్‌పై అనధికారికంగా ఫ్లోర్ వేయించటం, దానిని మేయర్ కూలగొట్టించడంతో ముసలం ప్రారంభమైంది. మేయర్ వ్యవహారశైలి నచ్చక ఆత్కూరి రవికుమార్, నజీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో అసమ్మతి కార్పొరేటర్లందరూ ఒకచోట సమావేశమయ్యారు. ఇప్పటికి రెండుసార్లు మేయర్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఏం చెయ్యాలనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. టీడీపీ కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, జాస్తి సాంబశివరావు వీరందరి వెనుకా ఉండి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ సీనియర్ కార్పొరేటర్లు కావడంతో మిగిలినవారు వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నారు. ఎంపీ నానితో భేటీ అయ్యాక మేయర్ వ్యవహారం ముదిరి పాకాన పడుతుందా.. టీ కప్పులో తుపాన్ మాదిరిగా తేలిపోతుందో వేచి చూడాలి. ఆరోపణలు అనేకం.. అందరినీ తప్పపడుతున్న ఆయనేమన్నా సత్య హరిశ్చంద్రుడా.. అంటున్నారు అసమ్మతి కార్పొరేటర్లు. కృష్ణా పుష్కరాల సమయంలో కొన్ని కాంట్రాక్టు పనులను ఆయన భార్య నిర్వహిస్తున్న కేఎంకే సంస్థ ద్వారా చేయించారు. ఇద్దరు కాంట్రాక్టర్లను బినామీలుగా పెట్టి మరికొన్ని పుష్కర పనులు చేపట్టారు. ఈ పనులు చేసి ఏడాదిన్నర గడిచినా బిల్లులు పూర్తిస్థాయిలో రాక కొందరు, అసలేమీ రాక మరికొందరు కాళ్లరిగేలా తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. మేయర్ మాత్రం బినామీల పేర్లతో చేయించిన పనుల బిల్లులను సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పూర్తిగా తీసేసుకున్నారు. ఈ విషయంలోనే అకౌంట్స్ సెక్షన్ అధికారిని పక్కకు తప్పించిన ఘనత కూడా మేయర్దేనన్న ఆరోపణలున్నాయి. ఇంజినీరింగ్ సెక్షన్లో చీఫ్ ఇంజినీర్ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ గోపాలకృష్ణ తన పనుల విషయంలో అడ్డం వస్తున్నాడని మేయర్ ఆగ్రహించి అతడిని కూడా తప్పించారు. త్వరలో మేయర్ కొడుకు పెళ్లికి మున్సిపల్ కాంట్రాక్టర్ల ద్వారా భారీగా నిధులు సమీకరించి ఆటోనగర్‌లోని ఒక ప్రైవేట్ స్థలంలో భారీ ఎత్తున పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఎర్రమట్టి తోలించి, రోలర్పెట్టి తొక్కించి చదును చేయించారన్న ఆరోపణలు చేస్తున్నారు. మేయరే కోనేరు శ్రీధర్ అవినీతికి పాల్పడుతూ మిగిలినవారిని తప్పుపట్టడాన్ని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
పుస్తకం విసిరేస్తే సస్పెండ్ చేస్తారా?
సాక్షి, అమరావతి బ్యూరో/ భవానీపురం(విజయవాడ పశ్చిమం): నగరపాలకసంస్థ 2018–2019 బడ్జెట్ సమావేశం రసాభాసాగా మారింది. రూ.1481 కోట్ల అంచనాలతో కార్పొరేషన్ బడ్జెట్‌ను మేయర్ కోనేరు శ్రీధర్ కౌన్సిల్లో శుక్రవారం ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చను పక్కదారి పట్టించారు. విపక్ష మహిళా సభ్యులను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బతీశారు. బడ్జెట్లో చూపిన అంకెలగారడీని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ సభ్యులను బలవంతంగా మర్షల్స్తో బయటకునెట్టిం చారు. సమావేశంలో తానే నియంతనంటూ ఆయన వ్యవహరించిన తీరు విస్మయపరిచింది. తోటి సభ్యులను ఏక వచనంతో మాట్లాడుతూ సమావేశంలో రగడ సృష్టించారు. విజయవాడ కార్పొరేషన్‌కు సంబంధించి 2017–18 డ్రాఫ్ట్ రివైజ్డ్ బడ్జెట్‌తోపాటు 2018–19 డ్రాఫ్ట్ బడ్జెట్ సమావేశం శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగింది. తొలుత ఇటీవల మృతి చెందిన మాజీ కార్పొరేటర్లు ఇజ్జాడ అప్పలనాయుడు, మరుపిళ్ల మోహన్ తిలక్‌కు సంతాప తీర్మానం చేసి మౌనం పాటించారు. అనంతరం మేయర్ శ్రీధర్, కమిషనర్ జె.నివాస్ కార్పొరేటర్లందరికీ ట్యాబ్‌లు అందజేశారు. అనంతరం మేయర్ కోనేరు శ్రీధర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్ల మాదిరిగానే, నాల్గో బడ్జెట్ కూడా పేద, మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం పడకుండా రూపొందించామని చెప్పారు. నగర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిధుల లభ్యతనుబట్టి అంచనాలు తయారుచేశామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నివాస్ మాట్లాడుతూ 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి నికర ఆదాయ వ్యయాలు, రెవెన్యూ ఆదాయ వ్యయాలకు, క్యాపిటల్ ఆదాయ వ్యయాలకు సంబంధించిన డ్రాఫ్ట్ బడ్జెట్‌ను తయారు చేశామని చెబుతూ వాటి వివరాలను వెల్లడించారు. అంకెలగారడీ బడ్జెట్‌పై వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ బడ్జెట్ అంకెల గారడీగా ఉందని విమర్శించారు. గత బడ్జెట్లో పొందుపరిచిన అంకెలనే ఈ బడ్జెట్లోనూ చూపి మసిపూసి మారేడుకాయ చేశారని దుయ్యబట్టారు. బడ్జెట్లోని పలు అంశాలను ఉటంకిస్తూ వాటన్నింటికీ అధికారులతో సమాధానం చెప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కార్పొరేషన్‌కు రావాల్సిన నిధులను పొందడంలో పాలకపక్షం విఫలమైందని విమర్శించారు. దీంతో మేయర్ జోక్యంచేసుకుని ‘బడ్జెట్ గురించి తెలియకపోతే తెలుసుకోవాలి. ఎలా అంటే అలా మాట్లాడకూడదు’ అంటూ అవహేళన చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ లేచి ఒక మహిళా కార్పొరేటర్‌ను అగౌరవంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. బడ్జెట్లో ప్రజలకు మేలు చేస్తున్నట్లుగా లాభాలు చూపించి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో మేయర్ కల్పించుకుని ‘అంతా నా ఇష్టం.. ఈ కౌన్సిల్ నాది’ అని అనేసరికి బుల్లా విజయ్ కోపంతో బడ్జెట్ ప్రతిని బల్లపై కొట్టారు. అదికాస్తా కిందపడటంతో బడ్జెట్ ప్రతిని విసికొట్టి అగౌరవంగా ప్రవర్తించిన విజయ్ను సస్పెండ్ చేయాలంటూ అధికార పార్టీ సభ్యులు గొడవకు దిగారు. ఇంతలో కార్పొరేటర్ టి.జమల పూర్ణమ్మ లేచి పుణ్యశీల, విజయ్‌కు మద్దతుగా మాట్లాడటంతో ‘ఇదేమన్నా సంతనుకున్నారా? ఎవరుపడితే వాళ్లు ఇష్టం వచ్చి నట్లు లేచి మాట్లాడటానికి, ఆవిడను బయటకు పంపించేయండి’ అంటూ సెక్రటరీని మేయర్ ఆదేశించారు. దీంతో జమల పూర్ణమ్మ, విజయ్, చందన సురేష్ వెళ్లి మేయర్ పోడియం ఎదుట బైఠాయించారు. దీంతో ఈ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నానని మేయర్ ప్రకటించారు. మార్షల్స్ వచ్చి వారిని బలవంతాన బయటకు తీసుకెళ్లడంతో సభ రసాభాసగా మారింది. అనంతరం మేయర్ సభను 3 గంటలకు వాయిదా వేశారు. పుస్తకం విసిరేస్తే సస్పెండ్ చేస్తారా? ఏ బైలాలో ఉందో చెప్పండి : పుణ్యశీల భవానీపురం (విజయవాడ పశ్చిమం): సభ వాయిదా అనంతరం వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల మాట్లాడుతూ పుస్తకం విసిరేస్తే సభ్యులను సస్పెండ్ చేయాలని ఏ బైలాలో ఉందని మేయర్‌ను ప్రశ్నిం చారు. ‘మేయర్‌గా నాకు ఆ అధికారం ఉంది. నా ఇష్టం’ అంటూ శ్రీధర్ అన్నారు. నాలుగేళ్లగా కౌన్సిల్లో అదే జరుగుతోంది కదా అని పుణ్యశీల విమర్శించారు. క్యాపిటల్ ఆదాయంపై మాట్లాడే అవకాశం తనకు ఇవ్వరని, పాలకపక్ష సభ్యులు ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడినా పట్టించుకోరని పేర్కొన్నారు. ప్రతి పక్ష సభ్యులను మాట్లాడనివ్వనప్పుడు కౌన్సిల్ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. ట్యాబ్ వెనక్కు ఇచ్చిన ఆదిలక్ష్మి తనకు ఇచ్చిన ట్యాబ్‌ను సీపీఎం ఫ్లోర్‌లీడర్ గాదె ఆది లక్ష్మి వెనక్కు ఇచ్చారు. దీంతో టీడీపీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున స్పందించి ఈ చర్య కౌన్సిల్‌ను అవమానించడమన్నారు. మేయర్ జోక్యం చేసుకుని వారి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆమె తిరిగి ఇచ్చేశారని హితవుపలకడంతో కాకు మిన్నకుండిపోయారు. అనంతరం ఆదిలక్ష్మి మాట్లాడుతూ కార్పొరేషన్ తాకట్టు పెట్టిన ఆస్తులను ఎప్పుడు విడిపిస్తారని ప్రశ్నించారు. కొండ ప్రాంత అభివృద్ధికి గత బడ్జెట్లో రూ.7కోట్లు కేటా యించి, రూపాయి ఖర్చుపెట్టలేదని, మళ్లీ అదే మొత్తం కేటాయించారని విమర్శించారు. ఇప్పుడైనా ఖర్చుపెడతారా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత యువజనోత్సవాలు నిర్వహించడం లేదని, వన్‌టౌన్‌లోని షేక్ రాజా హాస్పిటల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు 010 అంశంపై మాట్లాడారు. సంస్కారం తెలియని మేయర్ వైఎస్సార్ సీపీ సభ్యుల విమర్శ భవానీపురం(విజయవాడ పశ్చిమం): తమను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బుల్లా విజయ్, చందన సురేష్, జమల పూర్ణమ్మ కౌన్సిల్ హాల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వారికి మద్దతుగా ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, బొప్పన భవకుమార్, కె.దామోదర్, షేక్ బీజాన్బీ, బట్టిపాటి సంధ్యారాణి, పాల ఝాన్సీ నిలిచారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ కౌన్సిల్‌ను సంతతో పోల్చిన మేయర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ పూర్ణమ్మను సంతలో మనిషిగా మాట్లాడిన మేయర్ శ్రీధర్ సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. మహిళా సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ ఆ పదవికి అనర్హుడని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. జమల పూర్ణమ్మ మాట్లాడుతూ మేయర్‌కు మహిళలపై గౌరవం లేదన్నారు. ఆయనకు సస్పెండ్ చేయడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కళ్లకు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు బాధ్యతలను డెప్యూటీ మేయర్‌కు అప్పగించవచ్చుకదా అని సూచించారు. చందన సురేష్ మాట్లాడుతూ ప్రజావాణిని కౌన్సిల్లో వినిపించనీయకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. పాలకపక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. ప్రజలపై పన్నుల భారం వేయలేదంటూనే త్వరలో నీటి మీటర్లు పెట్టే అంశంపై కౌన్సిల్లో మాట్లాడటంలో ఆంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. -
వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్
విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన వెంటనే కృష్ణా పుష్కర పనుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అందుకు అధ్యక్ష స్థానంలో ఉన్న మేయర్ కోనేరు శ్రీధర్ ససేమిరా అన్నారు. దీంతో ఆగ్రహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు... మేయర్ పోడియం వద్దకు బైఠాయించారు. మేయర్ కోనేరు శ్రీధర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మేయర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మేయర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మేయర్ సస్పెన్షన్‌ను నిరసిస్తూ... కౌన్సిల్ హాల్లోనే వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
చాల్లే ఆపండి.. పార్టీ పరువు తీశారు
అసమ్మతి గ్రూపునకు చంద్రబాబు క్లాస్ శ్రీధర్‌ను మార్చే ప్రసక్తి లేదు స్వరం మారుస్తున్న కార్పొరేటర్లు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో ఉవ్వెత్తున ఎగసిన అసమ్మతి తుస్సుమంది. మేయర్ చైర్‌ను టార్గెట్ చేస్తూ అసమ్మతి వర్గం నడిపిన కథకు మహానాడు సాక్షిగా ఆ పార్టీ అధిష్టానం తెరదించింది. మీరు చేసిన అల్లరి వల్ల ఇప్పటికే పార్టీ పరువుపోయింది. మేయర్‌ను మార్చే ప్రసక్తే లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమ్మతి వర్గానికి క్లాస్ తీసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. చీటికిమాటికి గొడవలు పడితే జనంలో పల్చబడతామంటూ చీవాట్లు పెట్టినట్లు భోగట్టా. తాజా పరిణామాల నేపథ్యంలో కోనేరు శ్రీధర్‌ను మార్చాలంటూ సంతకాలు చేసిన కార్పొరేటర్లు స్వరం మారుస్తున్నారు. ఏదో తెలియక సంతకం చేశాం. మేము మీకు వ్యతిరేకం కాదంటూ మేయర్‌కు సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం. శ్రీధర్‌దే పై చేయి మేయర్ చైర్ వార్‌లో శ్రీధర్‌దే పై చేయి అయింది. కౌన్సిల్లో 38 మంది సభ్యుల బలం టీడీపీకి ఉంది. వ్యూహాత్మకంగా పావులు కదిపిన అసమ్మతి వర్గం 23 మంది సంతకాలను సేకరించింది. ఒకదశలో శ్రీధర్ అవుట్ అన్న వాదనలు వినిపించాయి. డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు, ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబుతో పాటు మరో 13 మంది మేయర్ పక్షాన నిలిచారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సైతం అసమ్మతి వర్గం కొమ్ము కాసింది. ఈ క్రమంలో అసమ్మతి వర్గం నెలవారీ మామూళ్లు ఇస్తామంటూ కార్పొరేటర్లకు ఎర వేయడాన్ని మేయర్ క్యాష్ చేసుకున్నారు. అసమ్మతి గ్రూపు వ్యవహరిస్తున్న తీరువల్ల పార్టీ అల్లరైపోతుందంటూ నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఇంటిలిజెన్స్ అధికారులు సైతం అసమ్మతి నేతల తీరుపై వ్యతిరేకంగా నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇవన్నీ శ్రీధర్‌కు కలిసొచ్చిన పరిణామాలు. కొరవడిన ఐక్యత శ్రీధర్‌ను గద్దె దించాలని ప్లాన్ చేసిన అసమ్మతి గ్రూపులో ఐక్యత కొరవడింది. మేయర్‌చైర్ కోసం పోటీపడ్డ ముగ్గురు కార్పొరేటర్లు తలోదారి అవ్వడంతో సంతకాలు చేసిన కార్పొరేటర్లు సైతం వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. పార్టీలో గ్రూపు తగదాల కారణంగా విజయవాడలో మేయర్‌ను మారిస్తే ఇదే తరహాలో మిగతా కార్పొరేషన్లు, మునిసిపాల్టీల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు మార్పు కోరుకొనే అవకాశం ఉందని అధిష్టానం అంచనా కట్టినట్లు తెలుస్తోంది. మేయర్ చైర్ మార్చే అవకాశం లేదని తేల్చిన అధిష్టానం, డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్లను ఇప్పట్లో మార్చమంటూ సంకేతాలు ఇచ్చినట్లు భోగట్టా. తాజా పరిణామాల నేపథ్యంలో మేయర్ వర్గం హుషారు కాగా, అసమ్మతి గ్రూపు దిగాలు పడింది. -
మేయరా.. మోనార్కా!?
మేయర్ తీరుపై కార్పొరేటర్ల గుర్రు సమోసాలు తినేందుకేనా స్టాండింగ్ కమిటీ చిన్నబుచ్చడమేనా ‘పెద్దరికం’ విజయవాడ : ఏమ్మా.. స్టాండింగ్ కమిటీలో ఏదో వచ్చేస్తోంది అనుకోవద్దు. సమోసాలు తిని వెళ్లేందుకే ఈ మీటింగ్.. చాయ్ తాగి, సమోసాలు తినేందుకే అయితే స్టాండింగ్ కమిటీ సమావేశాలెందుకు అన్నది స్టాండింగ్ కమిటీ సభ్యుల ప్రశ్న. జీతాలు చాలకపోతే వెళ్లిపోండి. రెండేవేలకు పని చేసేందుకు ఏఎన్ఎంలు వస్తారని అన్నా. అంటే మీరు పేపరోళ్లకు చెబుతారా. ఆందోళన చేస్తే జీతాలు రావు. అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బందిపై కస్సుబుస్సు.. మాట్లాడింది చాల్లే అమ్మా.. కూర్చో, కూర్చుంటారా సభ నుంచి బయటకు పంపేయమంటారా? కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులకు ఇచ్చే వార్నింగ్. ఏం కమిషనర్ మాటే వింటారా? నా దగ్గరకు వచ్చే పన్లేందా. మీరు సమావేశంలో ఉండొచ్చు. ఇంకెక్కడైనా ఉండొచ్చు. పిలిస్తే రావాలికదా. ఓ ముఖ్య అధికారిపై కన్నెర్ర వివిధ సందర్భాల్లో మేయర్ వ్యవహారశైలి ఇది... నగరపాలక సంస్థలో మేయర్ కోనేరు శ్రీధర్ ఏకపాత్రాభినయంపై నిరసన వెల్లువెత్తుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన తమను డమ్మీల్ని చేస్తూ అంతా నా ఇష్టం అన్న చందంగా మేయర్ వ్యవహారశైలి మారిందని టీడీపీ కార్పొరేటర్లే ధ్వజమెత్తుతున్నారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల క్రితం స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ వ్యవహరించిన తీరుపై సభ్యులు గుర్రుగా ఉన్నారు. సమావేశానికి ముందు ఓ సభ్యురాలు చాంబర్‌కు వెళ్లగా స్టాండింగ్ కమిటీలో ఏదో వచ్చేస్తోంది అనుకోవద్దని, సమోసాలు తిని వెళ్లేం దుకు తప్ప ఎందుకు ఉపయోగం ఉండదని మేయర్ అనడంపై ఆమె మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయాన్ని తోటి సభ్యులకు చెప్పి వాపోయారు. నగరపాలక సంస్థ ఆప్స్ కాంట్రాక్ట్‌ను కోడ్ట్రీ టెక్నాలజీస్‌కు రూ.27.36 లక్షలు కట్టబెట్టే విషయంలో చర్చకు సభ్యులు పట్టుబట్టగా మేయర్ ఏకపక్షంగా టెండర్‌ను ఆమోదిస్తూ తీర్మానం చేయడంలో ఆంతర్యమేమిటని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కోటరీకే ప్రాధాన్యం మేయర్ కీలక నిర్ణయాలు తీసుకొనే సందర్భంలో కోటరీకే ప్రాధాన్యత ఇస్తూ తమను పక్కకు నెట్టేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. మూడు నెలలకు ఒకసారి జరిగే కౌన్సిల్ సమావేశాల్లో సైతం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే ఆవేదనను జూనియర్ కార్పొరేటర్లు వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ‘లబ్ధి’ చేకూర్చేలా మేయర్ నిర్ణయాలు ఉంటున్నాయన్నది టీడీపీ కార్పొరేటర్ల వాదన. చిన్నబుచ్చుతున్నారు కౌన్సిల్ సమావేశాల అజెండాలో ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ ఒక్క రోజులో అయిపోవాలనే విధంగా మేయర్ తీరు ఉంటుందని, దీనివల్ల ప్రధాన అంశాలపై సమగ్ర చర్చ జరగడం లేదన్నది పలువురి సభ్యుల అభిప్రాయం. తమ ప్రశ్నలకు అధికారులతో సమాధానం చెప్పించాల్సి ఉండగా మేయరే జోక్యం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఇబ్బందికరంగా ఉందని కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. ప్రశ్నోత్తరాల నుంచి తీర్మానాల వరకు అంతా గందరగోళంగా సాగుతోందన్నది సభ్యుల ఆరోపణ. అజెండా లో చేర్చాల్సిన ప్రతిపాదనల్లోనూ కోతలు వేయడాన్ని తప్పుబడుతున్నారు. నగరపాలక సంస్థకు ‘పెద్ద’లా వ్యవహరించాల్సిన మేయర్ తమను ‘చిన్న’బుచ్చడంపై అధికారపార్టీ సభ్యులు మనస్తాపానికి గురవుతున్నారు. హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తాం - స్టాండింగ్ కమిటీ సభ్యులు నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహారశైలిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు కాకు మల్లిఖార్జున యాదవ్, కొరకాని అనూరాధ, నాగోతు నాగమణి స్పష్టం చేశారు. ప్రజాఫిర్యాదుల కమిటీ హాల్లో శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడారు. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో తమను ఉత్సవ విగ్రహాలను చేస్తున్నారన్నారు. అధికారులను తాము ప్రశ్నిస్తే మేయర్ ఎందుకు సమాధానమిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆప్స్ కాంట్రాక్ట్‌పై సమగ్ర చర్చ జరగాల్సి ఉండగా ఆమోదించాననే ఒక్క మాటతో మేయర్ తేల్చేశారన్నారు. గంటలో సమావేశం పూర్తి చేయాలనే హైరానా తప్ప స్టాండింగ్ కమిటీలో సమగ్ర చర్చ జరగడం లేదని తెలిపారు. కబేళాలో కోటి రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన మిషన్‌ను వాడకుండా పక్కన పడేశారని కాకు పేర్కొన్నారు. ఆప్స్ కాంట్రాక్ట్‌ను ఐదుగురు సభ్యులు ఆమోదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. మేయర్‌పై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని, కార్పొరేటర్లకు కనీస గౌరవం ఇవ్వాలన్నదే తమ వాదన అన్నారు. మేయర్ నియంతలా వ్యవహరిస్తున్నారు -వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల విజయవాడ సెంట్రల్ : మేయర్ కోనేరు శ్రీధర్ నియంతలా వ్యవహరిస్తున్నారని నగరపాలక సంస్థ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల దుయ్యబట్టారు. శుక్రవారం తన చాంబర్లో విలేకర్లతో మాట్లాడారు. కౌన్సిల్లో ప్రతిపక్షాల గొంతునొక్కుతున్న మేయర్ స్టాండింగ్ కమిటీలో సొంతపార్టీ వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. గుట్టుగా పాలన సాగిద్దామనుకుంటే కుదరదని, ప్రతి సభ్యుడికి స్వతంత్రంగా అభిప్రాయాలు తెలియజేసే అవకాశం ఉందన్న విషయాన్ని మేయర్ గుర్తిస్తే మంచిదని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగం దేశానికి బైలా లాంటిదంటూ ప్రసంగం చేసిన మేయర్ ప్రజాప్రతినిధులకు మాట్లాడే స్వేచ్ఛను ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. స్టాండింగ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా యాప్స్ కాంట్రాక్ట్‌ను ఎం దుకు ఆమోదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్టాండింగ్ కమిటీని, కౌన్సిల్‌ను అడ్డుపెట్టుకొని మేయర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. కనకదుర్గ సొసైటీ లే అవుట్ అప్రూల్ విషయంలో మేయర్ తొందరపాటు నిర్ణయం వెనుక కాసుల కక్కూర్తి ఉందన్నారు. సొంతపార్టీ సభ్యుల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న శ్రీధర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ దాసరి మల్లీశ్వరి పాల్గొన్నారు. -
బాబు ఆదేశిస్తే ఇప్పుడే రాజీనామా
విజయవాడ: విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో అధికార టీడీపీలో నెలకొన్న వర్గ విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. నగర మేయర్ కోనేరు శ్రీధర్ సొంత పార్టీ కార్పొరేటర్లు, ఇతర నేతలు వ్యవహరిస్తున్న తీరుపై శుక్రవారం విజయవాడలో నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ఆదేశిస్తే ఇప్పడే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. తనపై బురద జల్లి పార్టీ పరువు తీశారని ఆరోపించారు. చంద్రబాబు వద్దకు వెళ్లి పదవుల పంచాయితీ పెట్టుకోండంటూ కోనేరు శ్రీధర్... పార్టీ కార్పోరేటర్లు, నాయకులకు సూచించారు. విజయవాడ నగర మేయర్‌గా కోనేరు శ్రీధర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సొంత పార్టీ కార్పొరేటర్లకు ఆయనకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్‌పై చంద్రబాబుకు టీడీపీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్లు ఫిర్యాదు చేశారు. మేయర్ కోనేరు శ్రీధర్‌ను మార్చాలంటూ వారు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. దాంతో మేయర్ కోనేరు శ్రీధర్‌పై విధంగా స్పందించారు. -
రాజధాని నిర్మిస్తాం... డబ్బులివ్వండి
* డ్వాక్రా సంఘాల నుంచి జిల్లాకు రూ.కోటి చొప్పున వసూలుకు యత్నాలు * పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల నుంచి సీఎం చేతికి చేరిన చెక్కులు సాక్షి విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని నిర్మాణం బాధ్యతను తాము చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పేరుతో ప్రజలు, వివిధ సంఘాల నుంచి విరాళాల వసూళ్ల జోరుపెంచింది. ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళా సంఘాల సభ్యుల నుంచి జిల్లాకు రూ.కోటి చొప్పున వసూలు చేసే కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వుందని చెబుతూ రుణమాఫీ లాంటి ఎన్నికల హామీలను కూడా సీఎం వాయిదా వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నినాదంతో రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి రాజధాని నిర్మాణం కోసం నిధులు సేకరించే పనిలోపడ్డారు. చంద్రబాబు పర్యటనల సందర్భంగా జిల్లాల్లోని డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి జిల్లాకు రూ.కోటి చొప్పున వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చే వ్యవహారాల బాధ్యతలను డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్లు గ్రామైక్య సంఘం అధ్యక్షురాళ్లకు అప్పగించారు. రాష్ట్రంలో 6,51,000 డ్వాక్రా సంఘాలు ఉండగా, ఇందులో 65 లక్షల 10 వేలమంది సభ్యులు వున్నారు. వీరిలో ఒకొక్కక్కరి నుంచి రూ.20 మొదలు రూ.50 వరకూ వసూలుచేసి చెక్కు రూపంలో సీఎం చేతికి అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన సీఎం రెండు రోజుల పర్యటన సందర్భంగా ఆ జిల్లా డ్వాక్రా సంఘాల సభ్యులు రాజధాని నిర్మాణం కోసం పేరుతో రూ.62 లక్షలు చంద్రబాబుకు అందించారు. అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆ జిల్లా డ్వాక్రా సంఘాల సభ్యులు రూ.కోటి చెక్కు సీఎంకు అందించారు. ఆ జిల్లాలోని 5 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యుల్లో ఒక్కొక్కరి నుంచి రూ.20 చొప్పున తీసుకుని ఈ మొత్తం సేకరించారు. తమకు మాట మాత్రమైనా చెప్పకుండా గ్రామైక్య సంఘాల అధ్యక్షురాళ్లు ఈ డబ్బులు చెల్లించారని కొందరు సభ్యులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రస్తుతం ఇదే తరహాలో కర్నూలు జిల్లాలో రూ.కోటికి పైగా వసూలుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన రశీదులు డ్వాక్రా సంఘాలకు చేరాయి. ఈ రకమైన విరాళాలు అందించేందుకు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సంఘాల సభ్యుల మీద ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘బాబు’ బాటలోనే విజయవాడ మేయర్! రాష్ర్టం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పుకుంటూ తమ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్న వ్యవహారాన్ని స్ఫూర్తిగా తీసుకున్న విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ కూడా ఇదే బాట పట్టారు. కొర్పొరేషన్ రూ.500 కోట్ల అప్పుల్లో ఉందనీ, ఆర్థిక సహాయం అందించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రిక్తహస్తాలు ఎదురయ్యే సంకేతాలు కనిపించాయని ఆయన చెబుతున్నారు. రాజధాని నిర్మాణం కంటే ముందు నగరాభివృద్ధి ముఖ్యమనీ అందువల్ల నగరవాసులు విరాళాలు అందజేయాలని ఇటీవల నిర్వహించిన బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదనీ ఇందుకు సుమారు రూ.48 కోట్లు, కాంట్రాక్టర్ల బకాయిల చెల్లింపునకు రూ.20 కోట్లు ఇవ్వాల్సి ఉందని, నిధుల కొరత వల్ల వాహనాలకు డీజిల్ కూడా కొట్టించే పరిస్థితి లేదంటూ ఆయన ఏకరువు పెడుతున్నారు.