మేయర్ కోనేరు , ఎమ్మెల్యే గద్దె
నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహారశైలి ఈ సారి సీఎం వద్దకు చేరింది. తాము సూచించిన పనులను పక్కన పెట్టడమేకాక తన అనుచరుల భవనాలను కూల్చివేయాలంటూ మేయర్ ఆదేశాలిస్తున్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ఇటీవల సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు సాధించామని గొప్పకు పోయి రెండు రోజుల కిందట సీఎం వద్దకు వెళ్లిన మేయర్‌పై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోమంటూ అక్షింతలు వేశారు. ఎమ్మెల్యేలతో వివాదాలు తగదని.. పద్ధతి మార్చుకోమని చంద్రబాబు మేయర్‌కు తనదైన శైలిలో క్లాస్ పీకారు. విజయవాడ నగరంలో ఓ వైపు మేయర్ మరో ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న అంతర్యుద్ధాన్ని నగరవాసులు ఆసక్తిగా గమనించడం విశేషం.
సాక్షి, అమరావతిబ్యూరో : టీడీపీకి విజయవాడ నగరంలో కొరకురాని కొయ్యగా మారిన మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహార శైలి తాజాగా మరోమారు చర్చనీయాంశంగా మారింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో విభేదాలు మరింత జఠిలంగా తయారయ్యాయి. ఇద్దరి మధ్య విభేదాలు ముదిరిన నేపథ్యంలో తూర్పు సీటు తనకే కేటాయిం చాలంటూ కోనేరు ఆ పార్టీ పెద్దలను కలుస్తూ, ముఖ్యనేతల ద్వారా పావులు కదుపుతున్న వైనం గద్దెకు మరింత కోపం తెప్పిస్తోంది. ఇప్పటికే తన వివాదాస్పద వ్యాఖ్యలతో వీఎంసీలో మేయర్ కోనేరు శ్రీధర్ ఒంటరయ్యారనే చెప్పాలి. కోనేరు వ్యవహార శైలిపై గుర్రుమంటున్న పాలకపక్ష కార్పొరేటర్లు కూడా దూరమయ్యారు. తనతో సన్నిహితంగా మెలిగే కార్పొరేటర్లు కూడా మేయర్ శైలితో విసిగిపోయి ఆయనకు దూరంగా ఉంటున్నారు. మేయర్ అధికారాలపై కత్తెర వేయడం, కమిషనర్‌కు నిధులు మంజూరు అధికారం పెంచడం లాంటి పరిణామాల నేపథ్యంలో కోనేరును పట్టించుకొనే వారు కరువయ్యారు. తోటి కార్పొరేటర్లు కలసి రాకపోవడంతో నాలుగేళ్లు పాలన పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకోలేని దుస్థితి కూడా నెలకొంది.
ఇవి వివాదాస్పద అంశాలు...
మొగల్రాజపురంలోని సెవెన్‌డేస్ హోటల్‌పైన వీఎంసీ అనుమతి లేకుండా అక్రమంగా అదనపు ఫ్లోర్ వేసిన వ్యవçహారంలో మేయర్ కోనేరు శ్రీధర్‌కు, ఎమ్మెల్యే గద్దెకుమధ్య వివాదం రాజుకుంది. తన అధికారాల్లో ఎమ్మెల్యే తలదూర్చుతున్నారని, తాను చెప్పినా మేయర్ పట్టించుకోవటంలేదని ఇద్దరు ఒకరినొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మేయర్ పీఠమే కదిలే పరిస్థితి ఏర్పడింది. తాజాగా వీఎంసీలోని మూడో డివిజన్ పరిధిలోని క్రీస్తురాజపురం నుంచి గుణదల వరకు (అమ్మా కల్యాణ మండపం నుంచి ఈఎస్‌ఐ ఆస్పత్రి వరకు) ఉన్న రోడ్డు విస్తరణకు వీఎంసీ ఇప్పటికే 80 అడుగుల రోడ్డుగా విస్తరించాలని సర్వే చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 7 కోట్లు నిధులు కేటాయించింది. ఈ డివిజన్‌లోని ఎల్‌ఐసీ కాలనీలో చేపట్టిన స్ట్రామ్‌వాటర్ పనులపై స్థానికులు అడ్డుచెప్పగా ఎమ్మెల్యే అండగా ఉన్నారు. ఆ ప్రాంతంలో స్ట్రామ్‌వాటర్ పనులు ఆపోద్దని అ«ధికారులను ఇటు మేయర్ కూడా ఆదేశించారు. తాను కూడా తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో ఉన్నానని, ముఖ్యమంత్రి తనకు సీటిస్తారని ఆశిస్తున్నానని, స్థానికేతరులను తీసుకువచ్చి తమ తలపై రుద్దితే ఒప్పుకునేదిలేదని పరోక్షంగా మేయర్ కోనేరు శ్రీధర్ తూర్పు ఎమ్మెల్యే గద్దెపై అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఇటు గద్దె మేయర్‌కు ఉన్న వివాదం మరింత దుమారం రేగుతోంది.
వీఎంసీ ఆదాయంపై ఎమ్మెల్యేలు....
‘నగరపాలక సంస్థ ఇప్పటికే అప్పుల్లో ఉంది. దీని నుంచి గట్టెక్కడానికి నగరంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు చేసింది శూన్యం. దీనికితోడు ఎమ్మెల్యేలు నగరపాలక సంస్థ ఆదాయంపై పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టాల్సిన వారే వీఎంసీ ఆదాయంలో తమకూ కోటా కావాలంటూ పట్టుబట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు అంటున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు బీపీఎస్ నిధుల నుంచి రూ. 3 కోట్లు కావాలని కమిషనర్‌ను కోరారు. ఆయనేమో అడిగిందే తడవుగా కోట్లకు కోట్లు వారికి కేటాయించేస్తున్నారు. ఓ వైపు కార్పొరేటర్లు బడ్జెట్ పెంచాలని పదేపదే అడుగుతున్నా ఇంత వరకు సరైన సమాధానం లేకుండా పోయిందని కోనేరు శ్రీధర్ తన సన్ని హితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆహ్వానాల విషయంలో ...
తూర్పు నియోజకవర్గంలో వీఎంసీ చేపట్టే ఎలాంటి అభివృద్ధి పనులనైనా తనను ఆహ్వానించాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె వీఎంసీ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తుండగా తనకు తెలియకుండా ఎవరికీ ఆహ్వానాలు ఇవ్వవద్దని మేయర్ అధికారులకు హుకుం జారీ చేశారు. ఇద్దరి మధ్య వైరం ఉన్న నేపథ్యంలో వీఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న విభేదాలు నగరాభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలక వర్గం ఏర్పడి నాలుగేళ్లయినా ఇప్పటికీ నగరంలో చెప్పుకోదగిన అభివృద్ధి చేయలేదు. ఈ ఏడాదిలోనూ చేసే అవకాశాలు కన్పించడం లేదు. ప్రజాప్రతినిధులు కుమ్ములాటలతోనే కాలం వెళ్లదీశారు.
Comments
Please login to add a commentAdd a comment