అమరావతిబ్యూరో/భవానీపురం: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఉద్యోగుల ఆగ్రహానికి గురయ్యి వివాదంలో చిక్కుకున్న విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్‌కు అధిష్టానం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందా? అందరి ఒత్తిడి మేరకు ఊస్టింగ్ చేస్తారా అన్నది ప్రస్తుతం నగర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఈ విషయంలో జోక్యం చేసుకుని రచ్చకెక్కిన మేయర్‌పై గత నాలుగు రోజుల నుంచి పత్రికల్లో వస్తున్న కథనాలపై అధిష్టానం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే జరుగుతున్న పరిణామాలపై నివేదిక ఇవ్వాలని పార్టీ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్నకు ఆదేశించినట్లు తెలిసింది.
మేయర్‌ను పదవి నుంచి తప్పించాల్సిందే...
నోటి దురుసుతో అందరినీ బూతులు తిడుతున్న మేయర్ శ్రీధర్‌ను ఆ పదవి నుంచి తప్పించాల్సిందేనని స్వపక్ష కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. గతంలోకూడా అధిష్టానం ఆదేశాల మేరకు సర్దుకుపోయామని, ఇక తమవల్ల కాదంటున్నారు కార్పొరేటర్లు. మేయర్ వ్యవహారశైలితో ప్రతిపక్షంతోపాటు అధికారులు, ప్రజల మధ్య పార్టీ చులకనై పోతుందని, ఇప్పుడు కూడా వదిలేస్తే రానున్న ఎన్నికలలో ప్రభావం పడుతుందంటున్నారు. ఎవరెన్ని చెప్పినా ఆయన మారరని, పార్టీ ప్రతిష్ట కోసం ఆయన్ని మార్చడం ఒకటే మార్గమని కుండబద్దలు కొడుతున్నారు. అధిష్టానానికి కూడా వారు ఇదే సమాధానం చెబుతున్నారు. ఇటీవల ఇందిరాగాంధీ స్టేడియంలో షాపుల లీజు విషయమై వివాదం కూడా చోటుచేసుకుంది.
ఇతర ప్రాంతాలలో ప్రభావం..
విజయవాడ మేయర్‌ను మారిస్తే ఆ ప్రభావం రా>ష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న అధికార పార్టీ మేయర్లపై పడుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల రెండేళ్లకు ఒకరు మేయర్‌గా ఉండాలన్న ఒప్పందాలు అమలుకాక పార్టీలో అంతర్గత కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ శ్రీధర్‌ను మారిస్తే ఒప్పందాన్ని ఉల్లంఘించి కొనసాగుతున్న తమ మేయర్లను కూడా మార్చాలని, ఇతర ప్రాంతాలలోని ఆశావహులు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందని భావిస్తుంది.
మంత్రాంగం ఫలించేనా?
వాస్తవానికి ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)ని మంగళవారం కలిసి తాడోపేడో తేల్చుకోవాలని అసమ్మతి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. అయితే మంగళవారం శివరాత్రి కావడం, ఆయన కూడా అందుబాటులో లేకపోవడంతో సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేసుకున్నారు. కార్పొరేటర్లతోపాటు మేయర్, ఎమ్మెల్సీ, నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న, మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలుకూడా పాల్గొననున్నట్లు తెలుస్తుంది
Comments
Please login to add a commentAdd a comment