బాబు ఆదేశిస్తే ఇప్పుడే రాజీనామా
విజయవాడ: విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో అధికార టీడీపీలో నెలకొన్న వర్గ విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. నగర మేయర్ కోనేరు శ్రీధర్ సొంత పార్టీ కార్పొరేటర్లు, ఇతర నేతలు వ్యవహరిస్తున్న తీరుపై శుక్రవారం విజయవాడలో నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ఆదేశిస్తే ఇప్పడే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. తనపై బురద జల్లి పార్టీ పరువు తీశారని ఆరోపించారు.
చంద్రబాబు వద్దకు వెళ్లి పదవుల పంచాయితీ పెట్టుకోండంటూ కోనేరు శ్రీధర్... పార్టీ కార్పోరేటర్లు, నాయకులకు సూచించారు. విజయవాడ నగర మేయర్గా కోనేరు శ్రీధర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సొంత పార్టీ కార్పొరేటర్లకు ఆయనకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్పై చంద్రబాబుకు టీడీపీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్లు ఫిర్యాదు చేశారు. మేయర్ కోనేరు శ్రీధర్ను మార్చాలంటూ వారు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. దాంతో మేయర్ కోనేరు శ్రీధర్పై విధంగా స్పందించారు.