‘ఎదుటవారిని వేలెత్తి చూపేటప్పుడు మిగిలిన నాలుగు వేళ్లూ మనవైపు చూపిస్తాయన్న సంగతి తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా? ఆయనేమన్నా సత్య హరిశ్చంద్రుడా? తనకు కావాల్సిన పనులను అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ చేయించుకుంటారు. ఎదుటివారు తమ పనులు చేయించుకుంటే హడావుడి చేస్తారు. మమ్మల్ని కూడా ప్రజలే ఎన్నుకున్నారు. మేమంతా ఆయనను నాయకుడిగా ఎన్నుకున్నాం. అంతమాత్రాన నేను మోనార్క్ అనుకోవడం సరికాదు. నోటిదూలతో అధికారులను, తోటి ప్రజాప్రతినిధులను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరికైనా అహం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసు కోనంతకాలం ఇంటా బయట ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.’ – మేయర్ కోనేరు శ్రీధర్‌పై స్వపక్ష కార్పొరేటర్లు ధ్వజమెత్తుతున్న తీరిది..
అమరావతిబ్యూరో/భవానీపురం (విజయవాడ పశ్చిమ): మేయర్ కోనేరు శ్రీధర్‌ను ఆ పదవి నుంచి తప్పించాలనే ప్రయత్నాలు మమ్మురమయ్యాయి. స్వపక్ష కార్పొరేటర్లే ఆయన వ్యవహార శైలిపై విసిగి కుర్చీ నుంచి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీరి వెనుక ఎమ్మెల్యే గద్దె, మరో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీలు ఉండడంతో అతి త్వరలోనే కోనేరుకు పదవీ గండం ఉంటుందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.
నేడు ఎంపీ కేశినేనితో భేటీ
మేయర్ కోనేరు వ్యవహారశైలిపై దాదాపు 30 మంది కార్పొరేటర్లు ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ, టీడీపీ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న దగ్గర పంచాయితీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి వారందరినీ బుజ్జగించినట్లు తెలిసింది. దీంతో వారందరూ సోమవారం ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) దగ్గరకు వెళదామనుకుంటే ఆయన అందుబాటులో లేక మంగళవారం భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు.
గద్దెతో వైరమే ముసలానికి కారణమా?
గతంలో కూడా మేయర్‌ను ఆ సీటు నుంచి తప్పించాలని స్వపక్ష కార్పొరేటర్లు మూకుమ్మడిగా తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ నాని చొరవతో ఆ గొడవ సద్దుమణిగింది. అదే సమస్య మళ్లీ పునరావృత్తం కావడంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కీలక అనుచరుడి హోటల్‌పై అనధికారికంగా ఫ్లోర్ వేయించటం, దానిని మేయర్ కూలగొట్టించడంతో ముసలం ప్రారంభమైంది. మేయర్ వ్యవహారశైలి నచ్చక ఆత్కూరి రవికుమార్, నజీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో అసమ్మతి కార్పొరేటర్లందరూ ఒకచోట సమావేశమయ్యారు. ఇప్పటికి రెండుసార్లు మేయర్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఏం చెయ్యాలనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. టీడీపీ కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, జాస్తి సాంబశివరావు వీరందరి వెనుకా ఉండి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ సీనియర్ కార్పొరేటర్లు కావడంతో మిగిలినవారు వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నారు. ఎంపీ నానితో భేటీ అయ్యాక మేయర్ వ్యవహారం ముదిరి పాకాన పడుతుందా.. టీ కప్పులో తుపాన్ మాదిరిగా తేలిపోతుందో వేచి చూడాలి.
ఆరోపణలు అనేకం..
అందరినీ తప్పపడుతున్న ఆయనేమన్నా సత్య హరిశ్చంద్రుడా.. అంటున్నారు అసమ్మతి కార్పొరేటర్లు. కృష్ణా పుష్కరాల సమయంలో కొన్ని కాంట్రాక్టు పనులను ఆయన భార్య నిర్వహిస్తున్న కేఎంకే సంస్థ ద్వారా చేయించారు. ఇద్దరు కాంట్రాక్టర్లను బినామీలుగా పెట్టి మరికొన్ని పుష్కర పనులు చేపట్టారు. ఈ పనులు చేసి ఏడాదిన్నర గడిచినా బిల్లులు పూర్తిస్థాయిలో రాక కొందరు, అసలేమీ రాక మరికొందరు కాళ్లరిగేలా తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. మేయర్ మాత్రం బినామీల పేర్లతో చేయించిన పనుల బిల్లులను సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పూర్తిగా తీసేసుకున్నారు. ఈ విషయంలోనే అకౌంట్స్ సెక్షన్ అధికారిని పక్కకు తప్పించిన ఘనత కూడా మేయర్‌దేనన్న ఆరోపణలున్నాయి. ఇంజినీరింగ్ సెక్షన్‌లో చీఫ్ ఇంజినీర్ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ గోపాలకృష్ణ తన పనుల విషయంలో అడ్డం వస్తున్నాడని మేయర్ ఆగ్రహించి అతడిని కూడా తప్పించారు. త్వరలో మేయర్ కొడుకు పెళ్లికి మున్సిపల్ కాంట్రాక్టర్ల ద్వారా భారీగా నిధులు సమీకరించి ఆటోనగర్‌లోని ఒక ప్రైవేట్ స్థలంలో భారీ ఎత్తున పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఎర్రమట్టి తోలించి, రోలర్‌పెట్టి తొక్కించి చదును చేయించారన్న ఆరోపణలు చేస్తున్నారు. మేయరే కోనేరు శ్రీధర్ అవినీతికి పాల్పడుతూ మిగిలినవారిని తప్పుపట్టడాన్ని వారంతా ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment