corporation budget
-
ఆర్థిక విధానంపై అప్పుడే యూ టర్న్.. చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని
దాదాపు నెలన్నర క్రితం సంగతి. సెప్టెంబర్ 5న భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్‌ను ఓడించి లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని పీఠమెక్కారు. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిన జీవన వ్యయాన్ని తగ్గిస్తానని, చుక్కలనంటుతున్న ఇంధన ధరలకు ముకుతాడు వేస్తానని, కట్టు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని ప్రకటించారు. ‘చేసి చూపిస్తా’మంటూ ప్రతిజ్ఞ చేశారు. కానీ నెల రోజుల్లోనే అన్నివైపుల నుంచీ ఆమెకు గట్టిగా సెగ తగులుతోంది. ఆర్థిక వ్యవస్థను పట్టాలకెక్కించేందుకు ఆమె ప్రతిపాదించిన విధానాలన్నీ ద్రవ్యోల్బణ కట్టడిలో ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. ట్రస్ తొలి మినీ బడ్జెట్ అన్ని వర్గాల్లోనూ తీవ్ర విమర్శల పాలైంది. ప్రధానంగా కార్పొరేషన్ ట్యాక్స్‌ను 19 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని దాన్ని ఎప్పట్లా 25 శాతంగానే కొనసాగిస్తామంటూ యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కన్జర్వేటివ్ నేతలు, ఎంపీలను బాగా కలవరపెడుతున్నాయి. వారిలో ట్రస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బ్రిటిష్ మీడియా పేర్కొంటోంది. ఆర్థిక మంత్రిపై ఇప్పటికే వేటు పడింది. ప్రధాని మార్పు కూడా అనివార్యమని ఎంపీల్లో అత్యధికులు భావిస్తున్నారని చెబుతోంది. సమస్యలను చక్కదిద్దడంలో, సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని నిలుపుకోవడంలో విఫలమవుతున్న ట్రస్ ఏ క్షణమైనా తప్పుకోవాల్సి రావచ్చంటున్నారు! ఆమె రాజీనామాకు టోరీ ఎంపీలు త్వరలో బహిరంగ పిలుపు ఇచ్చే అవకాశముందని బ్రిటిష్ మీడియాలో వార్తలొస్తున్నాయి!! ఆరేళ్లు, నలుగురు ప్రధానులు ఆరేళ్లుగా అధికార కన్జర్వేటివ్ పార్టీకి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై 2016లో బ్రెగ్జిట్ రిఫరెండం నిర్వహించినప్పటి నుంచి ఏకంగా నలుగురు ప్రధానులు మారారు! 2016లో డేవిడ్ కామెరాన్ తప్పుకుని థెరెసా మే ప్రధాని అయ్యారు. కానీ బ్రెగ్జిట్ ఒప్పందంపై ప్రతిష్టంభన ఆమె పీఠానికి ఎసరు పెట్టింది. 2019లో బోరిస్ జాన్సన్ పగ్గాలు చేపట్టారు. మూడేళ్లయినా నిండకుండానే ఆయనా అనేకానేక వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో అయిష్టంగానే గత జూలైలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడిక ట్రస్ వంతు కూడా వచ్చినట్టేనంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఆర్థిక విధానాలపై యూ టర్న్ తీసుకోవడం ఆమెకు అప్రతిష్ట తెచ్చిపెట్టిందంటున్నారు. ఇవీ ‘తప్పు’టడుగులు... ► ఆర్థిక మంత్రిగా తొలిసారిగా నల్ల జాతీయుడైన క్వాసీ క్వార్టెంగ్ను ట్రస్ ఎంచుకున్నారు. పౌరుల నివాస పన్నులు, ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభనను వదిలించేందుకు ఆయన ప్రకటించిన మినీ బడ్జెట్ పూర్తిగా బెడిసికొట్టింది. ఏకంగా 4,500 కోట్ల పౌండ్ల మేరకు పన్ను తగ్గింపులను ప్రకటించారు. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతున్న వేళ ఇది ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ► తొలుత ఆర్థిక మంత్రి నిర్ణయాన్ని సమర్థించిన ట్రస్, కొద్ది రోజులకే యూ టర్న్ తీసుకుంటూ అత్యధిక స్థాయి ఆదాయ పన్ను రేటు తగ్గింపును రద్దు చేయడం వివాదానికి దారితీసింది. పైగా ఇది సొంత పార్టీలోనూ ఆమెపై తీవ్ర అసంతృప్తికి దారి తీయడంతో ఎటూ పాలుపోక క్వాసీని తప్పించి జెరెమీ హంట్‌కు ఆర్థిక శాఖ అప్పగించారు. రిషి పన్నుల పెంపు ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె, ఇప్పుడు ఆయన బాటలోనే నడవడాన్ని అసమర్థతగానే అంతా భావిస్తున్నారు. రిషివైపే టోరీ ఎంపీల మొగ్గు? ట్రస్ తప్పుకుంటే తదుపరి ప్రధానిగా రిషి పేరే ప్రముఖంగా విన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనే సమర్థ ప్రత్యామ్నాయమని కన్జర్వేటివ్ ఎంపీలు భావిస్తున్నట్టు బ్రిటిష్ మీడియా చెబుతోంది. రిషీని ప్రధానిగా, పెన్నీ మోర్డంట్ను ఆయనకు డిప్యూటీగా నియమించే ఆలోచన సాగుతోందంటున్నారు. లేదంటే మోర్డంట్ ప్రధానిగా, రిషి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టొచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. చివరికి మళ్లీ బోరిస్ జాన్సనే తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదంటున్న వాళ్లూ ఉన్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
చుక్క చుక్కకూ లెక్కకట్టాల్సిందే..!
సాక్షి,అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో ఇక ప్రతి నీటి బొట్టుకు లెక్క కట్టాల్సి వస్తోంది. ప్రతి కుళాయికి మీటర్లు బిగించి తద్వారా నీటి వినియోగం బట్టి భారం వేసేందుకు పాలక వర్గం రంగం సిద్ధం చేస్తుంది. త్వరలోనే ఈ విధానం అమలు చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన నగరపాలకసంస్థ బడ్జెట్ సమావేశంలో నగర ప్రథమపౌరుడు తన మనసులో మాటను చెప్పేశారు. ప్రభుత్వం తమ పై ఒత్తిడి తెస్తుందని త్వరలోనే మీటర్ల బిగింపుపై చర్చించుకుని అమలు చేద్దామని తెగేసి చెప్పారు. దీంతో త్వరలోనే ఈ విధానం అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నీటి కొలతల వల్ల పేదలపై భారం పడే అవకాశం ఉందని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా వారు పట్టించుకోనే పరిస్థితి లేదు. నీటి సరఫరా ఇలా.. నగరంలో దాదాపు 15.50 లక్షల మంది జనాభా ఉన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా అందడం లేదు. జనాభా అవసరాలకుగాను రోజుకు 49 ఎంజీడీల మంచినీటిని నగర పాలక సంస్థ సరఫరాచేయాల్సి ఉంది. కానీ కేవలం 36 ఎంజీడీల వరకు అందిస్తోంది. నగర పాలక సంస్థలో ఇప్పటికి తాగునీటికి సరైన ప్రణాళిక లేకపోవడంతో నగరంలో నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. భవానీపురంలో హెడ్ వాటర్ వర్క్స్ వద్ద 5, 8, 16,11 ఎంజీడీల చొప్పున ట్యాంకులు నిర్మించి సరఫరా చేస్తున్నారు. బ్యారేజ్ దిగువున 4 ఎంజీడీలు, రామలింగేశ్వర్‌నగర్‌లో 10 ఎంజీడీల , గంగిరెద్దుల దిబ్బ సమీపంలో 10 ఎంజీడీల సామర్థ్యం ఉన్న ట్యాంకులు ఉన్నాయి. కానీ పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. 1.13 లక్షల కుళాయిలకు మీటర్లు విజయవాడ నగర పాలక సంస్థలో 1.89 లక్షల గృహాలు ఉన్నాయి.ఇక కుళాయిల వివరాలను పరిశీలిస్తే సర్కిల్ –1 లో 31,847, సర్కిల్–2 లో 47,687, సర్కిల్ –3 లో 31,820 కుళాయి కనెక్షన్స్లున్నాయి.. మొత్తం మీద నగరంలో 1.11,354 లక్షల కుళాయిలు ఉన్నాయి. ఇంకా 78 వేల నివాసాలకు కుళాయిలు లేవు. ప్రతి కుళాయికి మీటరు బిగించి నీటి వినియోగం లెక్క గట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం నీటికుళాయి పొందాలంటే శ్లాబుల వారీగా నగదు చెల్లించాలి. ఇంటి పన్నుబట్టి శ్లాబు విధానం రూ.5525. రూ.6500, రూ.7500 ,రూ.8500 వంతున కుళాయి కనెక్షన్‌కు చెల్లించాలి. ఆపార్టెమెంట్స్లో పది ప్లాట్లు కు రూ.1.5 లక్షలు, పదిహేను ప్లాట్లకు రూ.1.55 లక్షలు వసూళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి పన్నును బట్టి నీటి పన్ను వసూళ్లు చేస్తున్నారు. ఆ పన్నులకు గాను . గత ఏడాది బడ్జెట్లో రూ.4.71 కోట్లు ఆదాయం చూపించారు. నూతన బడ్జెట్లో మాత్రం రూ.5.2 కోట్లు నీటి పన్ను ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గతేడాదికంటే నీటి పన్ను రూ.31 లక్షల అదనపు ఆదాయం వసూళ్లు చేస్తున్నట్లు బడ్జెట్లో పెరుగుదల చూపారు. విపక్షాల అభ్యంతరాలను.. నీటికి మీటర్లు విధానం వద్దని నగర పాలకసంస్థ విపక్ష సభ్యులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. నగరంలోనే కృష్ణానదీ వెళ్తుంది. ఈ నేపధ్యంలో నీటి బొట్టును లెక్కించడం తప్పు పడుతుంది. నదీ ప్రవాహం పక్కన ఉండే నగరంలోకూడా నీటి కొలతలతో ప్రజలపై భారం వేయడం సబబు కాదని వారిస్తున్నా వారి మాటలను పరిగణలోకి తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. నీటి బొట్టు కొలతే.. నగరంలో ప్రతి నీటì బొట్టు కొలత వేసేలా మీటర్లు అమర్చనున్నారు. ప్రస్తుతం ఒకొక్కరికి రోజుకు 130 లీటర్లు వరకు వినియోగం జరుగుతుదని అంచనాతో నీటి సరఫరా చేస్తున్నారు. అయితే 150 లీటర్లు పైగా వినియోగం జరుగుతుంది. దీంతో నీటి సరఫరా ప్రణాళిక సక్రమంగా లేకపోవడంతో పలు ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. ప్రస్తుతం నగరంలో 8095 నీటి మీటర్లు ఉన్నాయి. ఆయా మీటర్లు పరిధిలో నీటి వినియోగం బట్టి పన్నులు వసూళ్లు చేస్తున్నారు. ఇకపై అన్ని చోట్ల కుళాయిలకు మీటర్లు బిగిస్తే రోజువారీగా వినియోగించే నీటి పన్నుతో పాటు అదనంగా వినియోగిస్తే వాటికి అదనపు చెల్లింపులు వేస్తారు. ప్రతి లీటర్ నీటికి పన్ను విధించే అవకాశం ఉంది. నీటికి మీటర్లు విధానం సిమ్లాలో అమలవుతుంది. గతంలో పాలక వర్గం సిమ్లా వెళ్లి ఆ విధానం బాగుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం అదేవిధంగా అమలు చేయాలని పాలక వర్గంపై ఒత్తిడి పెంచింది. -
పుస్తకం విసిరేస్తే సస్పెండ్ చేస్తారా?
సాక్షి, అమరావతి బ్యూరో/ భవానీపురం(విజయవాడ పశ్చిమం): నగరపాలకసంస్థ 2018–2019 బడ్జెట్ సమావేశం రసాభాసాగా మారింది. రూ.1481 కోట్ల అంచనాలతో కార్పొరేషన్ బడ్జెట్‌ను మేయర్ కోనేరు శ్రీధర్ కౌన్సిల్లో శుక్రవారం ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చను పక్కదారి పట్టించారు. విపక్ష మహిళా సభ్యులను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బతీశారు. బడ్జెట్లో చూపిన అంకెలగారడీని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ సభ్యులను బలవంతంగా మర్షల్స్తో బయటకునెట్టిం చారు. సమావేశంలో తానే నియంతనంటూ ఆయన వ్యవహరించిన తీరు విస్మయపరిచింది. తోటి సభ్యులను ఏక వచనంతో మాట్లాడుతూ సమావేశంలో రగడ సృష్టించారు. విజయవాడ కార్పొరేషన్‌కు సంబంధించి 2017–18 డ్రాఫ్ట్ రివైజ్డ్ బడ్జెట్‌తోపాటు 2018–19 డ్రాఫ్ట్ బడ్జెట్ సమావేశం శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగింది. తొలుత ఇటీవల మృతి చెందిన మాజీ కార్పొరేటర్లు ఇజ్జాడ అప్పలనాయుడు, మరుపిళ్ల మోహన్ తిలక్‌కు సంతాప తీర్మానం చేసి మౌనం పాటించారు. అనంతరం మేయర్ శ్రీధర్, కమిషనర్ జె.నివాస్ కార్పొరేటర్లందరికీ ట్యాబ్‌లు అందజేశారు. అనంతరం మేయర్ కోనేరు శ్రీధర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్ల మాదిరిగానే, నాల్గో బడ్జెట్ కూడా పేద, మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం పడకుండా రూపొందించామని చెప్పారు. నగర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిధుల లభ్యతనుబట్టి అంచనాలు తయారుచేశామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నివాస్ మాట్లాడుతూ 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి నికర ఆదాయ వ్యయాలు, రెవెన్యూ ఆదాయ వ్యయాలకు, క్యాపిటల్ ఆదాయ వ్యయాలకు సంబంధించిన డ్రాఫ్ట్ బడ్జెట్‌ను తయారు చేశామని చెబుతూ వాటి వివరాలను వెల్లడించారు. అంకెలగారడీ బడ్జెట్‌పై వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ బడ్జెట్ అంకెల గారడీగా ఉందని విమర్శించారు. గత బడ్జెట్లో పొందుపరిచిన అంకెలనే ఈ బడ్జెట్లోనూ చూపి మసిపూసి మారేడుకాయ చేశారని దుయ్యబట్టారు. బడ్జెట్లోని పలు అంశాలను ఉటంకిస్తూ వాటన్నింటికీ అధికారులతో సమాధానం చెప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కార్పొరేషన్‌కు రావాల్సిన నిధులను పొందడంలో పాలకపక్షం విఫలమైందని విమర్శించారు. దీంతో మేయర్ జోక్యంచేసుకుని ‘బడ్జెట్ గురించి తెలియకపోతే తెలుసుకోవాలి. ఎలా అంటే అలా మాట్లాడకూడదు’ అంటూ అవహేళన చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ లేచి ఒక మహిళా కార్పొరేటర్‌ను అగౌరవంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. బడ్జెట్లో ప్రజలకు మేలు చేస్తున్నట్లుగా లాభాలు చూపించి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో మేయర్ కల్పించుకుని ‘అంతా నా ఇష్టం.. ఈ కౌన్సిల్ నాది’ అని అనేసరికి బుల్లా విజయ్ కోపంతో బడ్జెట్ ప్రతిని బల్లపై కొట్టారు. అదికాస్తా కిందపడటంతో బడ్జెట్ ప్రతిని విసికొట్టి అగౌరవంగా ప్రవర్తించిన విజయ్ను సస్పెండ్ చేయాలంటూ అధికార పార్టీ సభ్యులు గొడవకు దిగారు. ఇంతలో కార్పొరేటర్ టి.జమల పూర్ణమ్మ లేచి పుణ్యశీల, విజయ్‌కు మద్దతుగా మాట్లాడటంతో ‘ఇదేమన్నా సంతనుకున్నారా? ఎవరుపడితే వాళ్లు ఇష్టం వచ్చి నట్లు లేచి మాట్లాడటానికి, ఆవిడను బయటకు పంపించేయండి’ అంటూ సెక్రటరీని మేయర్ ఆదేశించారు. దీంతో జమల పూర్ణమ్మ, విజయ్, చందన సురేష్ వెళ్లి మేయర్ పోడియం ఎదుట బైఠాయించారు. దీంతో ఈ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నానని మేయర్ ప్రకటించారు. మార్షల్స్ వచ్చి వారిని బలవంతాన బయటకు తీసుకెళ్లడంతో సభ రసాభాసగా మారింది. అనంతరం మేయర్ సభను 3 గంటలకు వాయిదా వేశారు. పుస్తకం విసిరేస్తే సస్పెండ్ చేస్తారా? ఏ బైలాలో ఉందో చెప్పండి : పుణ్యశీల భవానీపురం (విజయవాడ పశ్చిమం): సభ వాయిదా అనంతరం వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల మాట్లాడుతూ పుస్తకం విసిరేస్తే సభ్యులను సస్పెండ్ చేయాలని ఏ బైలాలో ఉందని మేయర్‌ను ప్రశ్నిం చారు. ‘మేయర్‌గా నాకు ఆ అధికారం ఉంది. నా ఇష్టం’ అంటూ శ్రీధర్ అన్నారు. నాలుగేళ్లగా కౌన్సిల్లో అదే జరుగుతోంది కదా అని పుణ్యశీల విమర్శించారు. క్యాపిటల్ ఆదాయంపై మాట్లాడే అవకాశం తనకు ఇవ్వరని, పాలకపక్ష సభ్యులు ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడినా పట్టించుకోరని పేర్కొన్నారు. ప్రతి పక్ష సభ్యులను మాట్లాడనివ్వనప్పుడు కౌన్సిల్ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. ట్యాబ్ వెనక్కు ఇచ్చిన ఆదిలక్ష్మి తనకు ఇచ్చిన ట్యాబ్‌ను సీపీఎం ఫ్లోర్‌లీడర్ గాదె ఆది లక్ష్మి వెనక్కు ఇచ్చారు. దీంతో టీడీపీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున స్పందించి ఈ చర్య కౌన్సిల్‌ను అవమానించడమన్నారు. మేయర్ జోక్యం చేసుకుని వారి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆమె తిరిగి ఇచ్చేశారని హితవుపలకడంతో కాకు మిన్నకుండిపోయారు. అనంతరం ఆదిలక్ష్మి మాట్లాడుతూ కార్పొరేషన్ తాకట్టు పెట్టిన ఆస్తులను ఎప్పుడు విడిపిస్తారని ప్రశ్నించారు. కొండ ప్రాంత అభివృద్ధికి గత బడ్జెట్లో రూ.7కోట్లు కేటా యించి, రూపాయి ఖర్చుపెట్టలేదని, మళ్లీ అదే మొత్తం కేటాయించారని విమర్శించారు. ఇప్పుడైనా ఖర్చుపెడతారా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత యువజనోత్సవాలు నిర్వహించడం లేదని, వన్‌టౌన్‌లోని షేక్ రాజా హాస్పిటల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు 010 అంశంపై మాట్లాడారు. సంస్కారం తెలియని మేయర్ వైఎస్సార్ సీపీ సభ్యుల విమర్శ భవానీపురం(విజయవాడ పశ్చిమం): తమను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బుల్లా విజయ్, చందన సురేష్, జమల పూర్ణమ్మ కౌన్సిల్ హాల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వారికి మద్దతుగా ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, బొప్పన భవకుమార్, కె.దామోదర్, షేక్ బీజాన్బీ, బట్టిపాటి సంధ్యారాణి, పాల ఝాన్సీ నిలిచారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ కౌన్సిల్‌ను సంతతో పోల్చిన మేయర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ పూర్ణమ్మను సంతలో మనిషిగా మాట్లాడిన మేయర్ శ్రీధర్ సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. మహిళా సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ ఆ పదవికి అనర్హుడని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. జమల పూర్ణమ్మ మాట్లాడుతూ మేయర్‌కు మహిళలపై గౌరవం లేదన్నారు. ఆయనకు సస్పెండ్ చేయడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కళ్లకు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు బాధ్యతలను డెప్యూటీ మేయర్‌కు అప్పగించవచ్చుకదా అని సూచించారు. చందన సురేష్ మాట్లాడుతూ ప్రజావాణిని కౌన్సిల్లో వినిపించనీయకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. పాలకపక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. ప్రజలపై పన్నుల భారం వేయలేదంటూనే త్వరలో నీటి మీటర్లు పెట్టే అంశంపై కౌన్సిల్లో మాట్లాడటంలో ఆంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. -
బల్దియా బడ్జెట్ కట్?
► రూ.100 కోట్లు కుదించిన అధికారులు ► నేడు ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం ఖమ్మం: ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ రూపొందించిన అంచనా బడ్జెట్‌ను కుదించనున్నారా? అంటే దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. 2016–17 ఏడాదిలో ముఖ్యమంత్రి ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో నాన్‌ప్లాన్‌గ్రాంట్ ద్వారా ఖమ్మం కార్పొరేషన్‌కు అదనంగా రూ.100 కోట్లు అందాయి. అయితే ఈ ఏడాది సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేషన్ అభివృద్ధికి నిధులు ఇస్తారనే ఆశతో నాన్‌ప్లాన్ గ్రాంట్స్ నిధులల్లో రూ.102 కోట్లను చేర్చారు. బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల పాటు చర్చ సాగించిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఈసారి బడ్జెట్ భారీగా రూపొందించారని, ముఖ్యమంత్రి నిధులు ఇవ్వకపోతే బడ్జెట్ అంచనాలు తప్పుగా తేలే అవకాశాలున్నాయని అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నాన్ ప్లాన్ గ్రాంట్స్ నిధుల అంచనాలో చేర్చిన రూ.102 కోట్లను బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలగించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే రూ.543 కోట్ల అంచనాలతో రూపొందించిన కార్పొరేషన్బడ్జెట్ రూ.443 కోట్లకు చేరనుంది.రెండు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చలో కార్పొరేటర్లు సూచించిన సలహాల మేరకు కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏడాది పాటు అభివృద్ధి ప్రణాళికతో రూపొందించనున్న బడ్జెట్‌ను మంగళవారం జరగనున్న సమావేశంలో కౌన్సిల్ ఆమోదం తెలపనుంది.