
అబద్ధాలతో మభ్య పెడుతున్నారు
బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలతో మభ్య పెడుతున్నారని ఉరవకొండ...
► పేరుకే వ్యవసాయ బడ్జెట్
► ఫారంపాండ్స్ పెయిన్‌కిల్లర్‌లా పని చేస్తాయి తప్ప శాశ్వత పరిష్కారం కాదు
► ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం : బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలతో మభ్య పెడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఎమ్మెల్యే రోజాను విమర్శించడానికే టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సమయం మొత్తం కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. ఇందుకోసం అవసరమనుకుంటే సమయం పొడిగిస్తున్నారు తప్ప ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో కరువు ఉందన్నారు. కృష్ణా, గోదావరి డెల్టాల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిందన్నారు. ఉపాధి లేక లక్షలాది మంది వలసలు వెళ్తున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదన్నారు.
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అని ప్రకటించినా కేటాయింపుల్లో మాత్రం గతేడాది కంటే తగ్గించారని విమర్శించారు. ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో 500 మండలాల్లో తీవ్ర కరువు నెలకొంటే 360 దాకా మాత్రమే ప్రకటించారన్నారు. 2014 ఇన్సూరెన్స్ ఇప్పటికీ పైసా ఇవ్వలేదన్నారు. 2015-16లో రూపాయి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి కనిపించలేదన్నారు.
దుర్మార్గమైన నిబంధన అమలులోకి తెచ్చారని విమర్శించారు. సగటు ఐదేళ్ల పంట దిగుబడిలో 30 శాతం నష్టపోయి ఉంటేనే పరిహారమని ప్రకటించారన్నారు. మోసపూరిత రుణమాఫీ హామీ వల్ల ఓవర్‌డ్యూస్ రూ.24 వేల కోట్లకు పెరిగిపోయాయన్నారు. మొండిబకాయిలు రూ.5 వేల కోట్లు పెరిగాయన్నారు. ఫారంపాండ్లతో కరువు పారదోలుతామని చెబుతున్నారని, జిల్లాలో ఇవి పెయిన్ కిల్లర్‌లా పని చేస్తాయి తప్ప శాశ్వత పరిష్కారం కావని స్పష్టం చేశారు.
సీఎంకు కీర్తి కాంక్ష పట్టుకుంది
ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీర్తి కాంక్ష పట్టుకుందని, ఇందుకోసం వేల కోట్ల రూపాయల అప్పులు చేసేందుకు కూడా వెనకాడటం లేదని వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్వాకంతో రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదముందన్నారు. కొన్ని పత్రికలు, ఛానెళ్లు పని కట్టుకుని తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం మా ఎమ్మెల్యేలెవరికీ లేదన్నారు. రాజధాని భూముల కొనుగోలులో అక్రమాలను వెలికితీసిన విలేకరులను పోలీసులు విచారించడం బాధాకరమని విలేకరులు అడిగిన ఓప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం బడాయికి పోతోందని విమర్శించారు.