ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో కలిసి పాదయాత్ర చేస్తున్న ఓబుళపతి, తరిమెల శరత్‌చంద్రారెడ్డి, కె.వి.రమణ, సోమశేఖరరెడ్డి
ఉరవకొండ: చంద్రబాబు పాలనలో హంద్రీనీవా పరిధిలోని ఆయకట్టుకు నీరు రాకుండా పోయిందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. అసలు ఆయకట్టుకు నీరివ్వాలన్న చిత్తశుద్ధే ప్రభుత్వానికి లేనట్టుందని దుయ్యబట్టారు. హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో ‘జల సంకల్ప యాత్ర’ పేరిట విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం నింబగల్లుకు చేరింది. సర్పంచ్ వరలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకులు హనుమప్ప, చిదంబరి, రమేష్, ఈశ్వర్, వెంకటేష్, ఓబుళప్ప, శివరాజ్ తదితరులు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు.
పార్టీ మండల కన్వీనర్ వెలిగొండ నరసింహులు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మార్చినాటికి హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదని విరుచుకుపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని గతంలో అనేక దీక్షలతో పాటు స్వయంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉరవకొండలో ధర్నాకు దిగినా ఈ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. మాకు హక్కుగా ఇవ్వాల్సిన నీటిని ఒక నాయకుడు తాడిపత్రి, మరొకరు బుక్కపట్నం, ధర్మవరానికి తీసుకెళితే మేము చూస్తు ఊరుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే కరువు పీడిత అనంతపురం జిల్లాలోని 3.50లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో యువనేత నిఖిల్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కిసాన్‌సెల్ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, రైతు విభాగం రాయలసీమ జిల్లాల కన్వీనర్ తరిమెల శరత్‌చంద్రారెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు నారాయణరెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి, వైఎస్సార్‌సీపీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కె.వి.రమణ, రైతు సంఘం నాయకులు రాజారాం, నరేంద్రబాబు, బీసీ సెల్ నాయకులు అనిల్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment