బడ్జెట్ సమావేశానికి ఒకేఒక్కరు
► 18మంది సభ్యుల్లో 17మంది గైర్హాజరు
► కోరం లేక సమావేశం వారుుదా
► లెక్కలు తేలకనే!
మెట్‌పల్లి : మెట్‌పల్లి మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశానికి ఒకేఒక్క సభ్యుడు హాజరుకావడంతో కోరం లేక వాయిదా పడింది. మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ మర్రి ఉమారాణి ఆధ్యక్షతన అధికారులు బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 19మంది సభ్యులున్న పాలకవర్గంలో చైర్‌పర్సన్‌తోపాటు 8వార్డు కౌన్సిలర్ ధ్యావతి అరుణ మాత్రమే హాజరయ్యారు. మిగతా 17మంది ైగె ర్హాజరయ్యారు. ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభం కాగా.. ఆరగంట పాటు చైర్‌పర్సన్, అధికారులు సభ్యుల కోసం వేచి చూశారు. సభ్యులెవరూ రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు.
‘లెక్క’ తేలకే..
అభివృద్ధి పనుల కమీషన్ల లెక్కలు తేలకపోవడం, వార్డుల్లో నీటి సమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని మెజార్టీ సభ్యులు బడ్జెట్ సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతి పనిలో హోదాలవారీగా ‘ఇంత కమీషన్’ ఇవ్వాలనే ఒప్పందం కాంట్రాక్టర్లతో చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం చైర్‌పర్సన్, అధికారులకు తప్ప తమకు సక్రమంగా కమీషన్లు అందడం లేదనే అసంతృప్తి కౌన్సిలర్లలో నెలకొంది. ఈ వ్యవహారమే చైర్‌పర్సన్, కౌన్సిలర్ల మధ్య విభేధాలకు దారి తీసింది. నాలుగు రోజుల క్రితం లెక్కలు తేల్చడానికి ఓ కాంగ్రెస్ సభ్యుడి ఇంట్లో కాంట్రాక్టర్లతో కలిసి కొందరు ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఇవి కొలిక్కి రాలేదని తెలిసింది. దీనికితోడు ఈనెల 10న నిర్వహించిన సాధారణ సమావేశంలో వార్డుల్లో బోర్ల ఏర్పాటుకు సభ్యులంతా ఆమోదం తెలిపినా అధికారులు ఇంకా పనులు ప్రారంభించలేదు. అటు లెక్కలు తేల్చక.. ఇటు బోర్ల పనులు మొదలుపెట్టక తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని భావించే మెజార్టీ కౌన్సిలర్లు బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉన్నారని సమాచారం.
కంగుతిన్న కమిషనర్...
కీలకమైన బడ్జెట్ సమావేశానికి మెజార్టీ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో కమిషనర్ శైలజ కంగుతిన్నారు. వారిని మెప్పించి రెండుమూడు రోజుల్లో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వార్డుల్లో బోర్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కౌన్సిలర్లకు ఆమె హామీ ఇచ్చినట్లు తెలిసింది.