councillors
-
Hindupur: ఆ నలుగురు కౌన్సిలర్లు.. తిరిగి వైఎస్సార్సీపీ గూటికి
సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా హిందూపురం కౌన్సిలర్లు బుధవారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌హన్‌రెడ్డిని కలిశారు. శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త దీపికతో కలిసి వీరంతా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌ను కలిశారు. ఇటీవల టీడీపీలో చేరిన నలుగురు కౌన్సిలర్లు తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. వైఎస్ జగన్‌ను కలిసి పార్టీ కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ నేతల ప్రలోభాలు, బెదిరింపులకు తామిక తలొగ్గేదిలేదని ఏది ఏమైనా ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ వెంటే నడుస్తామన్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, హిందూపురం ఇన్ఛార్జీ దీపిక, ఇతర వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు.కాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందూపురం మునిసిపాలిటీలో కౌన్సిలర్లను భయపెట్టి, మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుని మునిసిపల్ ఛైర్మన్ స్ధానం దక్కించుకునేందుకు కుట్ర పన్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. వీరిలో మల్లిఖార్జున, పరుశురాముడు, రహమత్బీ, మణిలు తమ తప్పు తెలుసుకుని తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. -
వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై హత్యాయత్నం
రాయచోటి: ఎన్నికల ముందురోజు వరకు ప్రశాంతంగా ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో టీడీపీ నేతలు వరుస దాడులతో అరాచకం సృష్టిస్తున్నారు. కౌంటింగ్ ముగిసిననాటి నుంచి టీడీపీ రౌడీలు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నాలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి రాయచోటి టీడీపీ నేత సయ్యద్ ఖాన్ కొంతమంది రౌడీలతో వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాత్రి 11.30 గంటల సమయంలో నాలుగో వార్డు కౌన్సిలర్ హారూన్ బాషా ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లో నుంచి బయటికి రావాలని, చంపుతామంటూ టీడీపీ రౌడీలు కేకలు వేశారు. ఆ సమయంలో హారూన్ ఇంటిలో లేకపోవడంతో ఆయన తల్లి బయటకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని ప్రాధేయపడ్డారు. అయినా వినని టీడీపీ రౌడీలు పెద్ద బండరాళ్లతో ఇంటి ఆవరణలో ఉన్న బైక్‌ను ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పీఏ నిస్సార్ అహ్మద్‌ను కూడా చంపుతామంటూ కేకలు పెడుతూ వెళ్లిపోయారు. ఆ తర్వాత వీధుల్లో బైకులపై కేకలు వేసుకుంటూ 7వ వార్డు కౌన్సిలర్ మున్నీసా ఇంటికి వెళ్లి ఆమె భర్త ఇర్ఫాన్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ రౌడీల దాడిలో ఇర్ఫాన్ కత్తిపోట్లకు గురయ్యారు. ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయనను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ నేత సయ్యద్ ఖాన్, బాబ్జీ, ఫిరోజ్ ఖాన్, శివారెడ్డి, అఫ్రోజ్, అబూజర్లను అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి, డీఎస్పీ రామానుజులు టీడీపీ నేతలపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌంటింగ్ నాటి నుంచే వరుస దాడులు..ఈనెల నాలుగో తేదిన ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాగానే అదే రోజు రాత్రి రాయచోటి రూరల్ మండలం ఎండపల్లి పంచాయతీ బోయపల్లిలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో సుబ్బారెడ్డి సోదరుడు, మరొకరు గాయాలపాలయ్యారు. ఇంటి ముందు ఉన్న కారును కూడా ధ్వంసం చేశారు.అలాగే వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ఉన్న ఆర్టీసీ కండక్టర్ రామ్మోహన్ ఇంటిపై దాడులకు తెగబడి ఆయన బైకును తగులబెట్టారు. ఇలా రాయచోటిలో టీడీపీకీ చెందిన రౌడీ మూకలు, గ్యాంగ్‌లు దాడులు చేయడమే కాకుండా ఫోన్ల ద్వారా తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతామని బెదిరిస్తున్నారు.టీడీపీ రౌడీమూకల దాడులు దారుణంరాయచోటిలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపైన టీడీపీ రౌడీ మూకలు దాడి చేయడం దారుణమని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశాంత వాతావరణానికి అలవాటుపడిన రాయచోటి ప్రజలను ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురి చేయడం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అధికారమనేది ఎవరికీ శాశ్వతం కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా కక్షపూరిత రాజకీయాలు చేయ లేదని గుర్తు చేశారు. టీడీపీ రౌడీలు అర్ధరాత్రి వేళ మద్యం తాగి గుంపులుగా వచ్చి తమ పార్టీ కౌన్సిలర్లపై దాడులు చేయడం దారుణమన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు ఆయన ఫోన్ చేసి పరామర్శించారు. ప్రస్తుతం తాను విజయవాడలో ఉన్నానని, త్వరలో బాధితులను కలుస్తానని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
బీజేపీకిలోకి ముగ్గురు కౌన్సిలర్లు.. ఆసక్తికరంగా చండీగఢ్ రాజకీయాలు
చండీగఢ్: బీజేపీకి భారీ షాక్ తగిలింది. చంఢీగఢ్ మేయర్ పదవికి ఆ పార్టీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై నేడు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో సోంకర్ రజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి బీజేపీ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడిందని ఆప్, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ కమార్‌ను ఓడించి మేయర్‌గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్‌కు సంబంధించి ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్‌కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. చదవండి: Kejriwal: ఈడీ విచారణకు ఆరో‘సారీ’! రిటర్నింగ్ అధికారిపై సుప్రీం కోర్టు మండిపాటు ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5న విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. 'ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి' అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపరచాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా హజరు కావాలని చెప్పి, తదుపరి విచారణను ఫిబ్రవరి 19కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆప్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేశారు. పూనవ్ దేవి, నేహా, గుర్చరణ్ కాలా ఆదివారం కాషాయ కండువా కప్పుకున్నారు. మొతం 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 14 మంది కౌన్సిలర్లు ఉండగా తాజా చేరికలతో ఆ సంఖ్య 17కు చేరింది. వీరికి శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ఓ కౌన్సిలర్ మద్దతు కూడా ఉంది. అంతేగాక బీజేపీ చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్‌కు కూడా ఎక్స్ ఆఫీషియోగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. దీంతో బీజేపీకి మద్దతు సంఖ్య మొత్తం 19కి చేరింది. ఇక ఆప్‌కు 10 మంది కౌన్సిలర్లు ఉండా కాంగ్రెస్‌కు ఏడుగురు ఉన్నారు. -
ఇల్లెందులో వీగిన అవిశ్వాసం
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై కొందరు కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం వీగిపోయింది. సమావేశానికి త గిన కోరం లేనందున అవిశ్వాసం వీగిపోయినట్టుగా ఎన్నిక ల అధికారిగా వ్యవహరించిన కొత్తగూడెం ఆర్డీఓ శిరీష ప్రక టించారు. కౌన్సిలర్ల అవిశ్వాసం నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈవో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 24 మంది కౌన్సి లర్లకు గాను కోరం సరిపోవాలంటే 17 మంది హాజరు కావా ల్సి ఉంది. అయితే సమావేశ సమయానికి ఇద్దరు తక్కువగా 15 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో కొంత సమయం ఇస్తూ సమావేశం వాయిదా వేశారు. తర్వాత 12 గంటలకు మరోమారు సమావేశపర్చగా అప్పటికీ 15 మంది మాత్రమే ఉండడంతో కోరం లేదని ఈవో ప్రకటించారు.17 మంది రాత్రికే చేరుకున్నా..: అవిశ్వాస పరీక్ష నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న పెన్షనర్ భవన్ లోకి ఆదివారం రాత్రికే 17 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో వారంతా మున్సిపల్ కార్యాలయంలోకి పరుగులు తీశారు. అయితే మున్సిపల్ కార్యాలయం ఎదుట వేచి ఉన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ వారిని గమనించారు. కొక్కు నాగేశ్వరరావు అనే కౌన్సిలర్‌ను కాంగ్రెస్ శ్రేణులు ఎత్తుకుని ఎదురుగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లి, వెనుక నుంచి రోడ్డుపైకి తీసుకెళ్లి అప్పటికే సిద్ధంగా ఉంచిన ఓ కారులో హైదరాబాద్‌కు తరలించారు. ఇదే క్రమంలో పెన్షనర్ భవన్లో దాక్కుని ఉన్న సీపీఐ కౌన్సిలర్ కుమ్మరి రవీందర్ బయటకు రాగానే కాంగ్రెస్, దాని మిత్రపక్ష సీపీఐ శ్రేణులు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకుని విడిపించారు. అయితే అప్పటికే మున్సిపాలిటీలో తమ సభ్యుడి కోసం కాచుకుని కూర్చున్న సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా రవీందర్‌తో మాట్లాడటంతో ఆయన కార్యాలయం వెనుక గోడ దూకి పారిపోయారు. ఇలా ఇద్దరు సభ్యులు తక్కువ కావడంతో కోరం చాలక అవిశ్వాసం వీగిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులతో బీఆర్ఎస్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరులు వాగ్వాదానికి దిగారు. గంట పాటు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, చైర్మన్ వెంకటేశ్వరావుపై ఫిర్యాదు చేశారు. కోరం కనకయ్యపై కేసు నమోదు తన భర్తను కిడ్నాప్ చేశారంటూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు సతీమణి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు 17 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ఎంపీపీ నాగరత్నమ్మ, ఆమె భర్త జానీ తదితరులపై కేసు నమోదైందని వివరించారు. -
కౌన్సిలర్లతో దుబాయ్ వెళ్లిన మాజీమంత్రి మల్లారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాలకమండళ్ల గడువు దగ్గర పడుతున్న కొద్దీ జిల్లాలోని పలు నగర/పురపాలికల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ నెల 28తో పాలక మండళ్లు ఏర్పడి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఇప్పటికే పలువురు మేయర్లు, చైర్మన్లు, చైర్ పర్సన్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో కొంతమంది క్యాంపులకు వెళ్లారు. వీరిలో కొంత మంది తిరిగి రాగా, మరికొంత మంది అక్కడే ఉండిపోయారు. ఇంతకీ వారికి వ్యతిరేకంగా తీర్మానం ఉంటుందా? ఈ నోటీసులపై కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. మేయర్, చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలనే కల నెరవేరుతుందా? లేదా అనే ప్రశ్న ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. ఇచ్చిన నోటీసులపై ఒకవైపు తీవ్రమైన సందిగ్ధత కొనసాగుతుండగా, మరోవైపు షాద్‌నగర్, తుర్కయంజాల్ మున్సిపాలిటీలు, బడంగ్ పేట్ కార్పొరేషన్‌లోని ఆశావహులు తెరవెనుక పావులు కదుపుతున్నారు. ఆదిబట్ల.. తేలేదెట్లా..! ఆదిబట్ల మున్సిపల్ చైర్‌పర్సర్ ఆర్తిక(కాంగెస్)పై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు జనవరి 9న అదనపు కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. మున్సిపాలిటీలో 15 మంది అభ్యర్థులు ఉండగా, వీరిలో 13 మంది నోటీసులపై సంతకాలు పెట్టారు. ఆ తర్వాత 12 మంది క్యాంపు (రాజమండ్రి, వైజాగ్, బీమవరం)నకు వెళ్లారు. తాజాగా బుధవారం ఉదయం క్యాంపు నుంచి తిరిగి వచ్చారు. చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్న ఓ కౌన్సిలర్ తనతో పాటు క్యాంపునకు వచ్చిన వారికి భారీగా ప్యాకేజీ ముట్టజెప్పినట్లు తెలిసింది. బండ్లగూడ .. ఒత్తిడి తెచ్చినా.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అభ్యర్థి లతా ప్రేమ్గౌడ్పై 16 మంది (బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి 13 మంది) తిరుగుబావుటా ఎగురవేశారు. మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా, వీరిలో ఒకరు మృతి చెందారు. వీరంతా ఇటీవల కలెక్టర్ శశాంకను కలిసి నోటీసులు అందజేశారు. అదే రోజు క్యాంపునకు వెళ్లారు. నిన్నటి వరకు ఏపీలో ఉన్న నేతలు తాజాగా బుధవారం బెంగళూరుకు చేరుకున్నారు. కేవలం ఆరు నెలల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం సరైన నిర్ణయం కాదని, క్యాంపు నుంచి తిరిగి రావాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ వారిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చేదిలేదంటూ హెచ్చరించినా వారు ససేమిరా అనడం గమనార్హం. పెద్ద అంబర్‌పేట .. వీడేనా ఉత్కంఠ? పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా, వీటిలో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సీపీఐ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి చొప్పున గెలుపొందారు. ఎక్స్ అఫీషియో సభ్యులు, కాంగ్రెస్‌లోని మరికొంత మంది కౌన్సిలర్ల సహకారంతో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి చవుల స్వప్న చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకున్నారు. అప్పటి వరకు బీఆర్ఎస్లో కొనసాగిన చైర్ పర్సన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. గత జనవరి 28న 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ అప్పటి కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఒక గ్రూపు, పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు మరో గ్రూపు ఇలా రెండు గ్రూపులు 25 రోజుల పాటు క్యాంపునకు వెళ్లారు. హైకోర్టు స్టే విధించడంతో పాటు ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. గత నోటీసులనే పరిగణనలోకి తీసుకుంటారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దుబాయ్ వెళ్లిన మేడ్చల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీజేపీకి రెండు, కాంగ్రెస్‌కు ఆరు, బీఆర్ఎస్కు 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి కప్పరి స్రవంతిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం 17 మంది కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు జనవరి 8న అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు నోటీసులు ఇచ్చి, ఆ వెంటనే 11 మంది క్యాంపు(గోవా)నకు వెళ్లిపోయారు. నోటీసులు అందజేసి పది రోజులైనా ఇప్పటి వరకు బలప్రదర్శనకు ఏర్పాట్లు చేయకపోవడంతో క్యాంపుల్లో ఉన్న వారిలో ఆందోళన మొదలైంది. మేడ్చల్: అసమ్మతితో రగులుతున్న మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి కొంతమంది నాయకులు, కౌన్సిలర్లతో కలిసి మంగళవారం దుబాయ్ వెళ్లగా.. మరికొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు బుధవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైటెక్కారు. ఏడాది నుంచి మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య అసమ్మతి చెలరేగుతోంది. చైర్మన్‌ను గద్దె దించాలని అవిశ్వాస నోటీసు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటీసు ఇవ్వడంతో అవిశ్వాస తేదీ ఖరారు కాలేదు. తాజాగా రాష్ట్రంలో పరిస్థితులు మారి కాంగ్రెస్ రూలింగ్ రావడంతో తమ పార్టీ కౌన్సిలర్లు అసమ్మతితో ఎక్కడా దూరం అవుతారోనని ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లను విదేశీ టూర్‌కు తీసుకెళ్లారు. -
బీఆర్ఎస్కు షాక్.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం ‘హస్త’గతం
సాక్షి, నల్గొండ: నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ పార్టి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గంది. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా సోమవారం ప్రవేశ పెట్టి అవిశ్వాస తీర్మానానికి 47మంది కౌన్సిలర్ హాజరయ్యారు. వీరిలో 41మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టికి మద్దతు తెలపడంతో మున్సిపల్ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టి కైవసం చేసుకుంది. ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపగా. న్యూట్రల్‌గా ఉన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్లు పిల్లిరామరాజు మీగత ఇద్దరు సభ్యలు అవిశ్వాసం తీర్మానానికి హాజరు కాలేదు. నూతన చైర్మన్ ఎన్నుకునే వరకు తాత్కాలిక చైర్మన్‌గా.. ప్రస్తుత వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. -
నోటీసులిచ్చారు.. చర్యలు మరిచారు!
● చండూరు పట్టణంలో కేంద్రంలో అనుమతి లేకుండా ఓ భవన నిర్మాణం చేపట్టారు. దీనిపై మున్సిపల్ అధికారులకు ఓ నాయకుడు ఫిర్యాదు చేశాడు. అధికారులు నిర్మాణదారుడికి ముందుగా నోటీసులు ఇచ్చారు. చర్యలు తీసుకుంటామని చెప్పే లోపే (ఏడాది సమయంలో) ఆ భవన నిర్మాణం పూర్తయింది. ● పట్టణంలో ఓ వ్యక్తి అనుమతి లేకుండా మూడు ప్లోర్ల ఇంటి నిర్మాణం చేపట్టాడు. అక్రమ నిర్మాణం చేపడుతున్నారని కౌన్సిలర్లు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ● ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరి గోడ ముందు అనుమతి లేకుండా రెండు విగ్రహాలు ఏ్పాటు చేస్తున్నారని పట్టణ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారికి అధికారులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. చండూరు : చండూరు మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. పట్టణంలోని సెంటర్ నుంచి రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు మొదలుకుని పెద్ద భవనాలు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లు ఇలా చాలా వరకు అనుమతి లేని నిర్మాణాలే. అక్రమ నిర్మాణం చేసుకునే వారికి నోటీలిస్తున్న అధికారులు వారిపై చర్యలకు మాత్రం వెనుకాడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పలుకుబడి ఉన్న వారు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే.. పేదలకు మాత్రం అనుమతులు అడుగుతూ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 100 వరకు అక్రమ నిర్మాణాలు.. చండూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 100 ఇళ్ల వరకు అనుమతిలేనివిగా అధికారులు గుర్తించా రు. వీరికి గతంలో నోటీసులు సైతం అందజేసి.. చ ర్యలు తీసుకోవడం మరిచారు. అధికారులు గుర్తించనవి మరో వంద వరకు ఉంటాయని కౌన్సిలర్లే చెప్తున్నారు. అధికారులు నోటీసులు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పట్టణవాసులు అంటున్నారు. టాస్క్‌ఫోర్స్‌కు ఫిర్యాదు చేస్తున్నాం చండూరు మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, వాటి యజమానులకు నోటీసులు అందించాం. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తదుపరి చర్యలకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – మొయిజుద్దీన్, కమిషనర్, చండూరు మున్సిపాలిటీ నిబంధనలు ఇలా.. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా నిర్మాణ అనుమతులు ఇవ్వడం కోసం బీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ముందుగా అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆ తర్వాత రెవెన్యూ ఆర్ఐ లాగిన్ వెళ్తే ఆర్ఐ క్షేత్రస్థాయిలో విచారణ చేసి టౌన్ ప్లానింగ్ సెక్షన్ (టీపీఎస్)కు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే టీపీఎస్ నుంచి నేరుగా అనుమతులు ఇస్తారు. అనుమతుల కోసం ఇంటి గజాలను బట్టి ఆన్లైన్లో నగదు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇలా అనుమతుల ప్రక్రియ పట్టణంలో సాగడం లేదు. -
విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలి!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతు ఐక్య కార్యాచరణ కమిటీ.. విలీన గ్రామాల కౌన్సిలర్ల రాజీనామాకు డెడ్‌లైన్ విధించింది. మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో గురువారం సమావేశమైన రైతులు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా విలీన గ్రామాలకు చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయాలని కోరుతూ ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానించింది. ఈ నెల 20 లోపు రాజీనామా చేయాలని డెడ్‌లైన్ విధించింది. అలాగే సంక్రాంతి పండుగ రోజున రైతులంతా కుటుంబ సమేతంగా కామారెడ్డి పట్టణంలోని ప్రధాన రోడ్లపై ముగ్గులు వేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈనెల 17న పాతరాజంపేట గ్రామంలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. మున్సిపల్ మాస్టర్‌ప్లాన్ ద్వారా ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లతో పాటు వంద ఫీట్ల రోడ్ల పేరుతో భూములను కొల్లగొట్టే ప్రయత్నాలను నిరసిస్తూ రైతులంతా నెల రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కాగా, మాస్టర్‌ప్లాన్ పై అభ్యంతరాలకు ఈ నెల 11న గడువు ముగిసింది. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయడానికి మున్సిపాలిటీలో తీర్మానం చేయాలని కోరుతూ 49 మంది కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి రైతులు వినతిపత్రాలు అందజేశారు. అయితే మున్సిపల్ తీర్మానంపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు, విలీన గ్రామాల కౌన్సిలర్ల రాజీనామాల ద్వారా కౌన్సిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. కాగా విలీన గ్రామాలకు చెందిన బీజేపీ కౌన్సిలర్లు కాసర్ల శ్రీనివాస్, సుతారి రవిలు రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ తరువాత ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు చెప్పారు. -
బాలకృష్ణ ముంచేశాడు!
అనంతపురం (హిందూపురం): ‘‘హిందూపురంలో తాగునీటి సమస్య తీరుస్తామని గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపాలిటీపై అప్పుల కుప్ప పెట్టాడు. ‘అమృత్’ పథకం కింద గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురం వరకు నూతన పైప్‌లైన్‌కు రూ.194 కోట్లు ఖర్చుకాగా, కేంద్రం వాటాగా రూ.56.83 కోట్లు ఇచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.22 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. మున్సిపాలిటీ వాటా కింద మిగతా మొత్తం రూ.114.67 కోట్లు చెల్లించారు. అప్పుడు చేసిన అప్పులకు ఇప్పటి మున్సిపాలిటీ ఆదాయంతో పాటు 14, 15 ఫైనాన్స్ నిధులూ వడ్డీలకే సరిపోతున్నాయి. అయినా మీరు మూడు దశాబ్దాల్లో చేయలేని పనులు మేము మూడేళ్లలోనే చేసి చూపించాం.’’ అని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లకు సమాధానం ఇచ్చారు. 1983 నుంచి టీడీపీ నాయకులే హిందూపురం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నా.. కనీసం డ్రైనేజీ కూడా వేయించలేకపోయారని, ఇప్పుడు అధికార పార్టీ ఏం చేసిందో చెప్పాలని అడిగేందుకు టీడీపీ కౌన్సిలర్లకు సిగ్గుండాలన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా హిందూపురం అభివృద్ధికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తొలుత వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, కౌన్సిలర్ శివ మాట్లాడుతూ... సచివాలయాల పరిధిలో జరిగే అభివృద్ధి పనుల విషయాలు వార్డు సభ్యులకూ తెలియజేయాలని కోరారు. అప్పుడే వివిధ సమస్యలతో తమ వద్దకు వచ్చే ప్రజలకు తాము సమాధానం చెప్పగలమన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఓపెన్ షెడ్లు ఎన్ని..?, నిర్మాణ నిబంధనలు, వాటి నుంచి వస్తున్న ఆదాయ వివరాలు సభ్యులకు తెలపాలని కోరారు. అలాగే పన్నుల విషయంలో ప్రజలు అహుడా, మున్సిపాలిటీలకు చెల్లిస్తూ రెండు విధాలుగా నష్టపోతున్నారని, దీనిపై వార్డు అడ్మిన్ సెక్రటరీలతో మీటింగ్ ఏర్పాటు చేసి వార్డుల వారీగా ఏ నిర్మాణాలు అహుడా పరిధిలోకి వస్తాయి...ఏవి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ► కమిషనర్ వెంకటేశ్వరరావు సమాధానమిస్తూ... సచివాలయాల పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, నీటి సమస్యలు..పరిష్కారానికి తీసుకున్న చర్యలతో పాటు ఇతర వివరాలన్నీ సభ్యులకు వివరిస్తామన్నారు. ► అనంతరం కౌన్సిలర్ గిరి మాట్లాడుతూ... తన వార్డులో ఇప్పటికే రూ.2.50 కోట్ల అభివృద్ధి పనులు చేస్తే... కొందరు యాత్రలపేరుతో వార్డులో ఏం జరగలేదని నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారు కనీసం మున్సిపాల్టీకి వచ్చి లెక్కలు చూసి మాట్లాడాలన్నారు. ► కౌన్సిలర్ ఆసీఫుల్లా మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో కొందరు అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, ఇటీవల ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారని కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. పారదర్శకత కోసం మున్సిపాలిటీకి ఒక యాప్ తయారుచేసి అందులో మొత్తం వివరాలు పెడితే, అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఇటీవల విద్యానగర్‌లోని ఒక ఇంటి యజమానికి ప్రాపర్టీ టాక్సు విషయంలో రీవోక్ చేయాలని నోటీస్ పంపారని, అధికారులు మారితే పన్నులు మారతాయా..అని ప్రశ్నించారు. ప్రతినెలా ప్రాపర్టీ ట్యాక్సుల నోటీæసులు ఇచ్చినవాటి వివరాలు కౌన్సిల్‌కు తెలపాలన్నారు. ► పలువురు సభ్యులు మాట్లాడుతూ.. మార్కెట్ వల్ల ఎంజీఎం మైదానం అధ్వానంగా మారుతోందని, వ్యాపారులకు ఇబ్బందులు కలగకూడదంటే వారిని మరోచోటకు పంపి...మైదానాన్ని క్రీడాకారులకు అందుబాటులో ఉంచాలని కమిషనర్‌ను కోరారు. అనంతరం 57 అంశాలతోపాటు టేబుల్ అజెండా అంశాలను తీర్మానిస్తూ ఆమోదం తెలిపారు. టీడీపీ కౌన్సిలర్ల రభస అంతకుముందు ‘పురం’ అభివృద్ధికి మూడేళ్లలో ఏం చేశారో చెప్పాలంటూ టీడీపీ కౌన్సిలర్లు సభలో రభస చేశారు. ఇందుకు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగేంద్రబాబు మాట్లాడుతూ...వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘పురం’ దాహార్తి తీర్చడానికి పీఏబీఆర్ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తే రాజకీయం చేసి సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. నాసిరకం పైపులని నానా యాగీ చేసిన టీడీపీ వారి హయాంలో చేసిందేమిటో చెప్పాలన్నారు. గత మూడేళ్లుగా అదే పీఏబీఆర్ పైపుల నుంచే తాగునీరు పల్లెలు, ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయని, అవి నాసిరకమైతే ఎందుకు పగలడం లేదో చెప్పాలన్నారు. టీడీపీ నేతలు స్వార్థం, స్వలాభం కోసం ఏపీబీఆర్ నీటి పథకాన్ని నిరీ్వర్యం చేసి, గొల్లపల్లి పైప్‌లైన్ తెరపైకి తెచ్చారన్నారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు అభ్యతరం తెలపగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు దీటైన సమాధానం ఇచ్చారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగి అరుపులతో అడ్డుకోవడానికి ప్రయతి్నంచగా వైస్ చైర్మన్ జబివుల్లా సర్దిచెప్పారు. -
రెబల్స్‌పై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆగ్రహం
‘‘పార్టీ నిర్ణయమే శిరోధార్యం కావాలి.. కాదు.. కూడదంటే వేటు తప్పదు. మిత్రపక్ష పార్టీలకు కేటాయించిన స్థానాల్లో డీఎంకే రెబల్స్ పోటీ చేయడం తగదు. వెంటనే పట్టణ పంచాయతీ అధ్యక్ష, మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు రాజీనామా చేసి నాతో భేటీ అవ్వండి లేకుంటే తగిన మూల్యం తప్పదు..’’ అని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై: డీఎంకే కూటమి కట్టుబాట్లను అతిక్రమించి, పార్టీ అదేశాలను ధిక్కరించి కొందరు నాయకులు పదవులు చేజిక్కించుకోవడాన్ని సహించేది లేదని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. రెబల్స్ అంతా తమ పదవులకు వెంటనే రాజీనామా సమర్పించి ఆ తరువాత తనను కలవాలని హుకుం జారీ చేశారు. కూటమి నేతల నిరసన డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్పొరేషన్, మునిసిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల పదవులకు శుక్రవారం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడు డీఎంకే అధిష్టానం నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన కొందరు ధిక్కరించారు. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగి.. పదవులను కైవసం చేసుకున్నారు. మునిసిపాలిటీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులకు సంబంధించి 16 స్థానాలను మిత్రపక్ష వీసీకేకు డీఎంకే కేటాయించింది. అయితే ఏడు స్థానాల్లో డీఎంకే రెబల్స్ పోటీచేసి ఆ పదవులను దక్కించుకున్నారు. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక వీసీకే అధ్యక్షుడు తిరుమాంళవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ బహిరంగంగానే నిరసన తెలిపారు. కూటమి పా ర్టీలకు కేటాయించిన పదవుల్లో డీఎంకే కౌన్సిలర్లు పోటీ చేసి పీఠం దక్కించుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడిన స్టాలిన్ చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతలతో శుక్రవారం సాయంత్రం çసమావేశమయ్యారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి పదవులు పొందిన డీఎంకే కౌన్సిలర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకరిద్దరు ఈ ఆదేశాలకు తలొగ్గి రాజీనామా చేసినా.. అధికశాతం మంది ఆలోచనలో పడ్డారు. రాజీనామా చేయకుండానే స్టాలిన్‌ను కలిసి నచ్చజెప్పాలని, తప్పనిసరైన పక్షంలోనే రాజీనామా చేయాలని వారు భావిస్తున్నారు. చెన్నైలో కమిటీల ఎన్నికకు సన్నాహాలు చెన్నై మేయర్‌గా ఆర్. ప్రియ, డిప్యూటీ మేయర్‌గా మహేష్‌కుమార్ ఎన్నిక పూర్తయ్యింది. చెన్నై కార్పొరేషన్‌లోని 200 వార్డుల్లో 80 లక్షల మంది నివసిస్తున్నారు. వీరికి తాగునీరు, డ్రైనేజీ సౌకర్యం తదితర ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు గాను 15 మండల కమిటీలు, ఆరు స్థానిక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే వీటికి అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పదవులకు గట్టిపోటీ నెలకొనే అవకాశం ఉండటంతో అన్ని కమిటీలనూ ఏకగ్రీవం చేయాలని డీఎంకే భావిస్తోంది. -
‘రూ.15లక్షలు ఇస్తే పార్టీలోకి వస్తా..’
సాక్షి, నస్పూర్(ఆదిలాబాద్): పట్టణంలోని ఓ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్ పార్టీ మారడానికి బేరసారాలు సాగించిన ఆడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల సమయంలో రూ.15లక్షలు ఖర్చు చేశానని, మీ సార్‌తో మాట్లాడి ఇప్పిస్తే పార్టీలోకి వస్తానంటూ చెప్పగా.. సార్‌ను అడిగి చెబుతానంటూ ఫోన్లో ఇద్దరు మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫోన్లో మాట్లాడుకున్నది ఏ పార్టీకి చెందిన కౌన్సిలర్.. ఏ పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్‌తో మాట్లాడాడు అనే విషయమై పట్టణ ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. వ్యాక్సిన్ వేయకుండానే...వేసినట్లు మంచిర్యాలటౌన్: జిల్లాలో పలువురికి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేయకుండానే వేసినట్లు సెల్‌కు మెస్సేజ్‌లు వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. బెల్లంపల్లికి చెందిన మునిమంద తిరుమల అనే మహిళ గత ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన కోవిషీల్డ్ మొదటిడోసును బెల్లంపల్లిలోని శంషీర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వేసుకుంది. గత నెల 12వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ మధ్య రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవాలని సెల్‌కు మెస్సేజ్ వచ్చింది. అనారోగ్యంగా ఉండడంతో గడువులోగా వేసుకుందామని అనుకోగా గత నెల 29వ తేదీ వ్యాక్సిన్ వేసుకున్నట్లుగా సెల్‌కు మెసేజ్ 30వ తేదీన వచ్చింది. దీంతో ఆన్లైన్లో పరిశీలిస్తే వ్యాక్సిన్ రెండో డోసు పూర్తయినట్లు వ్యాక్సినేషన్ సర్టిపికేట్ రావడంతో ఖంగుతింది. ఇదే విషయమై జిల్లా వ్యాక్సినేషన్ ఇన్చార్జి డాక్టర్ ఫయాజ్‌ఖాన్‌ను వివరణ కోరగా ఒకే సెల్ నంబరుతో నలుగురు వరకు వ్యాక్సిన్‌ను వేసుకుంటున్నారని, సాంకేతిక కారణాలతో అలా వచ్చి ఉంటుందని, లబ్ధిదారులకు రెండో డోసు తప్పనిసరిగా వేస్తామని తెలిపారు. -
పశ్చిమలో టీడీపీకి షాక్..
సాక్షి, పశ్చిమ గోదావరి : రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు తయారవుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న ఆ పార్టీకి తాజాగా పశ్చిమ గోదావరిలో షాకింగ్ పరిణామం ఎదురయింది. తణుకు టీడీపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం రెండు వందల మంది కార్యకర్తలతో కలిసి తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి బాటలోనే.. మరో పదిహేను మంది కౌన్సిలర్లు కూడా వైఎస్సార్సీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పార్టీలో చేరేవారు తమ కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి రావాల్సిందిగా కారుమూరి కోరారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాణాలు టీడీపీకి మింగుడు పడటం లేదు. చంద్రబాబు ప్రకటించిన పార్లమెంటరీ పార్టీ పదవులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అలక వహించి ఫేస్బుక్లో వెటకారంగా పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పలువురు నేతలు పార్టీని వీడనున్నట్టు వార్తలు రావడం టీడీపీలో కలకలం రేపుతోంది. -
పొన్నాల ఎఫెక్ట్.. కాంగ్రెస్‌కు భారీ షాక్!
సాక్షి, జనగామ: కాంగ్రెస్ ప్రకటించిన రెండు జాబితాల్లో టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు చోటుదక్కక పోవడాన్ని నిరసిస్తూ 13 మంది కౌన్సిలర్లు, ఏడు మండలాల పరిధిలో 28 వేల మంది కార్యకర్తలు బుధవారం తమ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి లేఖ పంపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి అన్వర్లు మాట్లాడారు. ఏడు మండలాల పరిధిలో మండల, జిల్లా బాధ్యులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు, జనగామ మునిసిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేసిన వారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. వచ్చే జాబితాలో పొన్నాల పేరు ప్రకటించని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాలుగు దశాబ్దాలుగా జనగామకు పెద్ద దిక్కుగా ఉంటూ.. కాంగ్రెస్‌కు వన్నె తీసుకు వచ్చిన పొన్నాలపై పార్టీలోని ఓ వర్గం కుట్ర పూరితంగా వ్యవహరించడం పద్ధతి కాదన్నారు. పొన్నాలను కాదని కూటమి తరుపున ఎవరు పోటీ చేయాలని ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి సహకారం ఉండదని తేల్చి చెప్పారు. బీసీ నేత అని చిన్నచూపు చూస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్త కరుణాకర్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, మేడ శ్రీనివాస్, మల్లేశం, సర్వల నర్సింగారావు, చిర్ర సత్యనారాయణ రెడ్డి, మహేందర్, అభిగౌడ్, రఘుఠాకూర్, సంపత్‌నాయక్, మజార్ షరీఫ్, శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లోకి మరో ఇద్దరు..
భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ అధికార పార్టీ నుంచి సొంతగూటికి చేరడంతో పాటు 7వ వార్డుకు చెందిన కౌన్సిలర్ కూడా ఆమె వెంట బీజేపీలో చేరారు. మరుసటి రోజే కౌన్సిలర్ తిరిగి టీ ఆర్ఎస్లో చేరారు. ఈ పరిణామాలు జరిగిన 24 గంటల్లోనే మరో ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిల ర్లు లతశ్రీ, నువ్వుల ప్రసన్న శనివారం టీఆర్ఎస్ భువనగిరి పట్టణ కమిటీ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో మున్సి పాలిటీలో టీఆర్ఎస్ బలం 16కు చేరింది. కౌన్సిలర్ల సంఖ్య పెంచుకోవడంలో సఫలీకృతం టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల సంఖ్యను పెంచుకోవడంలో సఫలీకృతం అవుతుంది. ఈనెల 4న ము న్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసంపెట్టే విషయంపై ఇప్పటికే నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నమూనాపత్రంలో సంతకాలు చేసినట్లు సమాచారం. ఇందులో అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటు ప్రతి పక్షపార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసం పెట్టాలంటే 22 మంది కౌన్సిలర్లు అవసరం. కాగా టీఆర్ఎస్కు ఇప్పటికే 16 మంది కౌ న్సిలర్లు ఉన్నారు. వీరితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలి మినేటి కృష్ణారెడ్డి ఓటు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అ¯ ] ుకూలంగా ఉన్నారని చెప్పడంతో వీరికి తోడుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొనడంతో ఈ సంఖ్య 24కు చేరుకునే అవకాశం ఉంది.అవిశ్వాసం పె ట్టేందుకు టీఆర్ఎస్ తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడంలో సఫలీకృతం అవుతుందని చెప్పవచ్చు. రాజీనామా.. అవిశ్వాసమా? అవిశ్వాసం పెట్టే వారివైపు కౌన్సిలర్ల సంఖ్య పెరగడం, సొంత పార్టీ కౌన్సిలర్లు అసంతృప్తితో ఉండడంతో చైర్పర్సన్ రాజీనామ చేయాలా అవిశ్వా సం ఎదర్కోవాలా? అనే ఆలోచనలో ఉన్నట్లు తె లిసింది. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పార్టీ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. చైర్పర్సన్ పార్టీ లో చేరిక ప్రస్తుత పరిస్థితులు, మున్ముందు జరిగే పరిణామాలపై చర్చిం చినట్లు సమాచారం. -
బడ్జెట్ సమావేశానికి ఒకేఒక్కరు
► 18మంది సభ్యుల్లో 17మంది గైర్హాజరు ► కోరం లేక సమావేశం వారుుదా ► లెక్కలు తేలకనే! మెట్పల్లి : మెట్పల్లి మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశానికి ఒకేఒక్క సభ్యుడు హాజరుకావడంతో కోరం లేక వాయిదా పడింది. మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ మర్రి ఉమారాణి ఆధ్యక్షతన అధికారులు బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 19మంది సభ్యులున్న పాలకవర్గంలో చైర్‌పర్సన్‌తోపాటు 8వార్డు కౌన్సిలర్ ధ్యావతి అరుణ మాత్రమే హాజరయ్యారు. మిగతా 17మంది ైగె ర్హాజరయ్యారు. ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభం కాగా.. ఆరగంట పాటు చైర్పర్సన్, అధికారులు సభ్యుల కోసం వేచి చూశారు. సభ్యులెవరూ రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ‘లెక్క’ తేలకే.. అభివృద్ధి పనుల కమీషన్ల లెక్కలు తేలకపోవడం, వార్డుల్లో నీటి సమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని మెజార్టీ సభ్యులు బడ్జెట్ సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతి పనిలో హోదాలవారీగా ‘ఇంత కమీషన్’ ఇవ్వాలనే ఒప్పందం కాంట్రాక్టర్లతో చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం చైర్పర్సన్, అధికారులకు తప్ప తమకు సక్రమంగా కమీషన్లు అందడం లేదనే అసంతృప్తి కౌన్సిలర్లలో నెలకొంది. ఈ వ్యవహారమే చైర్పర్సన్, కౌన్సిలర్ల మధ్య విభేధాలకు దారి తీసింది. నాలుగు రోజుల క్రితం లెక్కలు తేల్చడానికి ఓ కాంగ్రెస్ సభ్యుడి ఇంట్లో కాంట్రాక్టర్లతో కలిసి కొందరు ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఇవి కొలిక్కి రాలేదని తెలిసింది. దీనికితోడు ఈనెల 10న నిర్వహించిన సాధారణ సమావేశంలో వార్డుల్లో బోర్ల ఏర్పాటుకు సభ్యులంతా ఆమోదం తెలిపినా అధికారులు ఇంకా పనులు ప్రారంభించలేదు. అటు లెక్కలు తేల్చక.. ఇటు బోర్ల పనులు మొదలుపెట్టక తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని భావించే మెజార్టీ కౌన్సిలర్లు బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉన్నారని సమాచారం. కంగుతిన్న కమిషనర్... కీలకమైన బడ్జెట్ సమావేశానికి మెజార్టీ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో కమిషనర్ శైలజ కంగుతిన్నారు. వారిని మెప్పించి రెండుమూడు రోజుల్లో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వార్డుల్లో బోర్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కౌన్సిలర్లకు ఆమె హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
మున్సిపల్ ఆఫీసులో మంత్రికి చేదు అనుభవం
శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి శుక్రవారం శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీసులో చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్నటువంటి టీడీపీ కౌన్సిలర్లు మంత్రిని నిలదీశారు. రాధారెడ్డి విషయంలో మంత్రి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఊహించని పరిణామంతో నివ్వెరపోయిన మంత్రి.. సాయంత్రం కలిసి ఈ విషయంపై మాట్లాడుతానని చెప్పి మున్సిపల్ ఆఫీసు నుండి వెళ్లిపోయారు. -
తిరుగుబావుటా..
విజయనగరం క్రైం: కేంద్రమంత్రి, టీడీపీలో సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు సమక్షంలో విజయనగరం మున్సిపల్ చైర్మన్‌పై కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తిరుగుబావుటా ఎగురవేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఆధ్యక్షతన విజయనగరం మున్సిపాలిటీకి సంబంధించిన సీనియర్‌నాయకులు, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులతో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణను లక్ష్యంగాచేసుకుని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. మున్సిపాలిటీ జరిగే ఓ ఒక్కకార్యక్రమాన్నీ చైర్మన్ తెలియపరచడంలేదని.. కనీసం సమాచారం లేకుండా పనులు చేస్తున్నారని కొందరు కౌన్సిలర్లు, పార్టీనాయకులు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో కొన్ని పనులు సభ్యుల అనుమతిలేకుండా జరిపిస్తున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని వెనుకేసుకు వస్తున్నారని అశోక్‌దృష్టికి తీసుకు వెళ్లారు. పింఛన్ ఎంపికల్లో ఎక్కువగా అక్రమాలు జరిగాయని, అర్హులకు అన్యాయం జరిగిందని, ఈవిషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని మరి కొందరు ఆవేదన వెళ్లగక్కారు. పింఛన్లలో తప్పుడుగా నమోదు చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ల విషయంలో చైర్మన్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని,ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో ఎటువంటిఅభివృద్ధి పనులూ చేయకపోవడం వల్ల వార్డుల్లో తిరగలేక పోతున్నామని, కౌన్సి లర్ల ఇంటిపైకి ప్రజలు వస్తున్నారని అశోక్‌దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమా చారం లేకుండా చేస్తున్నారని చెప్పారు. వార్డు అధ్యక్షులకు తెలియకుండా పట్టణంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అలాంటపుడు అధ్యక్షులుగా ఎందుకు నియమించారని అశోక్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలన్నీ సావధానంగా విన్న కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు పట్టణంలో జరిగే కార్యక్రమాలు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులకు సమాచారం ఇవ్వాలని చైర్మన్‌కు చురకలు అంటించినట్లు సమాచారం. ఇకముందు జరిగే ప్రతి కార్యక్రమాన్ని పట్టణ పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులకు తెలిపి..వారందరితో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని చైర్మన్‌కు అశోక్ సూచించినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ .రాజు, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు వెంకటనరసింగరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ,పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మ న్యాల కృష్ణ, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న వారికిఅశోక్‌క్లాస్..? అశోక్‌బంగ్లాలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న వారికి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రత్యేక క్లాసు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. సమావేశంలో అందరిమధ్య క్లాసు ఇస్తే బాగోదన్న ఉద్దేశంతో వారికి అశోక్ ప్రత్యేక క్లాస్ ఇవ్వనున్నట్లు సమాచారం. -
బెయిల్‌పై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విడుదల
మరో 10 మంది కార్యకర్తలు కూడా.. నంద్యాల: వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఇద్దరు శనివారం బెయిల్‌పై విడుదలయ్యారు. గత నెల 31వ తేదీన నంద్యాల పురపాలక సంఘ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించగా.. ఆక్రమణలను తొలగించడానికి, రహదారులను నిర్మించడంపై చర్చించాలని ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. దీనిని జీర్ణించుకోలేక టీడీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ దేశం సులోచన ఆధ్వర్యంలో దాడికి దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించలేదు. టీడీపీకి చెందిన చైర్పర్సన్ దేశం సులోచన, వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్‌లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెలేయ భూమాతో పాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వారి అనుచరులపై కేసును నమోదు చేశారు. నవంబర్ 1వ తేదీ తర్వాత వారిని అరెస్ట్ చేశారు. అయితే వారు కోర్టును ఆశ్రయించగా శుక్రవారం స్థానిక మూడో అదనపు కోర్టులో జడ్జి రామలింగారెడ్డి బెయిల్ మంజూరు చేశారు. దీంతో కౌన్సిలర్లు మన్నెం కృపాకర్, దిలీప్‌కుమార్‌తోపాటు మరో 10మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను జైలు అధికారులు విడుదల చేశారు. ఆళ్లగడ్డ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న మన్నెం కృపాకర్, దాసరి జగన్, చిందుకూరు మనోహర్, లింగమయ్య, చాకలి శ్రీనివాసులు, ప్రసాదరెడ్డి, అశోక్, కాటపోగు ప్రసాద్‌లను నంద్యాల సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న దిలీప్‌కుమార్‌తో పాటు చంటి, వడ్డె మనోజ్, పెయింట్ మధుబాబులను విడుదల చేశారు. వీరి విడుదల సమాచారం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆళ్లగడ్డ, నంద్యాల జైలు దగ్గరకు వెళ్లి ఆప్యాయతతో స్వాగతం పలికారు. -
బలవంతపు చేరికలు..మా సంస్కృతి కాదు
నల్లగొండ రూరల్ : పార్టీలో చేరమని ఏవరిని ఓత్తిడి చేయడం లేదు... ఎలాంటి ఆశ చూప డం లేదు... ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని బం డారు గార్డెన్స్‌లో పలువురు కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్ చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో ఆయన మాట్లాడారు. తమ పార్టీలోకి ఎవరిని బలవంతంగా చేర్చుకోవడం లేదని.. ఆ సంస్కృతి వారసులు నాడు చంద్రబాబు, ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులనేనన్నారు. కోమటిరెడ్డి నియోజవర్గ నాయకుడేనని రాష్ట్ర స్థాయి నాయకుడు కాదన్నారు. ఇక్కడ టీడీపీ నాయకులు తెలంగాణ ప్రజలకు అండ గా ఉండకుండా ఆంధ్రా ఏజెంట్లు గా అవతరించారన్నారు. సీఎల్పీ నేత జా నారెడ్డి టీడీపీ విధానాలను ప్రశ్నించడం లేదన్నారు. గత ప్రభుత్వాల నిర్వాహకం వల్లనే రైతుల పరిస్థితి బాగలేదన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం రుణమాఫీని అమలు చేస్తుందన్నారు. అర్హులైన వారికి ఆహారభద్రత కార్డులు, పింఛన్లు అందజేస్తామన్నారు. చేరికలు మలి ఉద్యమానికి నాంది వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతుండడం బంగారు తెలంగాణ మలీ ఉద్యమానికి నాంది అని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రభుత్వం అమ లు చేస్తుందన్నారు. టీడీపోళ్లకు ప్రశ్నలే దొరకడం లేదు టీడీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో అడిగేందుకు ప్రశ్నలు దొరకడం లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎద్దేవా చేశారు. గతంలో రాష్ట్రంలో 28 వేల ఫించన్లు ఉంటే నేడు 31 లక్షల మందికి అందనున్నాయన్నారు. అభివృద్ధి చేస్తాం : దుబ్బాక సమష్టిగా ముందుకు సాగుతూ నల్లగొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని పార్టీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి తెలిపారు. మాయమాటలు చెప్పి డబ్బులు మూట కట్టుకుని కోమటిరెడ్డి ప్రజలను వంచిం చారన్నారు. పార్టీలు ఖాళీ అవుతున్నాయనే సభ్యత్వ నమోదు : పల్లా కాంగ్రెస్, టీపీడీ పార్టీలు ఖాళీ అవుతుండడంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారని టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ ఇన్చార్జ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రమాదబీమా, వైద్య సౌకర్యం, ఉద్యోగ ప్రోత్సాహం, చేస్తామని ప్రకటనలు చేసినా టీడీపీలో ఏవ రూ చేరడం లేదన్నారు. అంతకుముందు నల్లగొండ పట్టణంలోని ప్రధాన రహదారిపై భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో నాయకులు బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీను, బోయపల్లి కృష్ణారెడ్డి, బొర్ర సుధాకర్, జమాల్‌ఖాద్రీ, గోలి అమరేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని కవితా రమేష్, ఖమ్యూంబేగ్, బొంత రేణుకా వెంకన్న, తక్కి, తక్కెళ్ల హారిక అశోక్, బకరం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో తారస్థాయికి విభేదాలు
(సాక్షి ప్రతినిధి-విజయనగరం) : టీడీపీ జిల్లా నేతలు, నాయకులు, కార్యకర్తల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయటపడే సమయం వచ్చేసింది. దీంతో ఎవరి స్థాయిని బట్టి వారు పెద్ద నాయకులపై ఫిర్యాదులు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా మంత్రిపై ఇప్పటికే కొందరు అసంతృప్తితో గూడుపుఠాణి అయినట్టే మరికొందరు కూడా పదవులనుభ విస్తున్న నాయకులపై గుర్రుగా ఉన్నారు. వీరిపై కేంద్ర మంత్రి అశోక్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకుంటున్న మంత్రి, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఇతర నాయకులు పరస్పర ఆగ్రహావేశాలతో ఉన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృ ణాళినిపై జిల్లాలోని తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు ఎమ్మె ల్యేలతో పాటు టీడీపీ నాయకులు కూడా ఆమె తీరు బాగా లేదని చెప్పేందుకు తమ అస్త్రాలను సిద్ధం చేశారు. కొన్ని విషయాల్లో తమకు అనుకూలంగా లేరని, దీనివల్ల ప్రజల్లో ఆశించిన స్థాయిలో పట్టు సాధించుకోలేకపోతున్నామని, అధికారుల వద్ద తమ మాట చెల్లుబాటు కావడం లేదని చెప్పేందుకు పలు కారణాలను సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణలపై కూడా కొందరు కౌన్సిలర్లు, నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే గీత ఆమెకు నచ్చిన వారితోనే పనులు చేయిస్తున్నారని, మున్సిపల్ చైర్మన్ కూడా కార్యక్రమాల్లో స్పీడుగా లేరనీ చెప్పేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు, కౌన్సిలర్లు ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దగ్గర చెప్పేందుకు ఉత్సుకతతో ఉన్నారు. కానీ వారి ఆతృతకు తగ్గ ధైర్యం, అశోక్ ముందు నోరు విప్పే తెగువ చేయలేక తటపటాయిస్తున్నారు. ఎవరైనా ముందు ఫిర్యాదు చేస్తే చాలు ముందుకొచ్చి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఫిర్యాదుల సారాంశాన్ని బయటపెట్టాలని చూస్తున్నారు. వరుసగా క్యూ కట్టేసి తమ అంతరంగాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్న నాయకులు, కౌన్సిలర్లు అశోక్ వద్ద నోరు విప్పేందుకు జంకుతున్నారు. ఒక వేళ మనమే ముందువారిపై చెబితే అది సాధారణ ఫిర్యాదులా తేలిగ్గా తీసుకుంటే? ఆ తరువాత వారి వద్ద మనం చెడ్డయిపోతామన్న ఆందోళన వారిలో నెలకొంది. మరోవైపు కేంద్ర వుంత్రి అశోక్ ఎలా స్పందిస్తారోనన్న భయం కూడా వెన్నాడడంతో ఆయావర్గాలకు చెందిన నాయకులు నోరువిప్పేందుకు సంకోచిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అశోక్ రాకముందు ఈ విషయమై ధైర్యంగా మాట్లాడినప్పటికీ ఆయన వచ్చాక మాత్రం మిన్నకుండిపోతున్నారు. దీంతో ఎవరి మానాన వారు అశోక్ బంగ్లాకు వెళ్తున్నారు, వస్తున్నారు తప్పితే ఎక్కడా ఫిర్యాదులు చేసే పరిస్థితి కనిపించడం లేదు. అయితే వారి ఆతృతను, అంతరంగాన్ని అశోక్ గుర్తించి పరిష్కరిస్తారా? లేక వీరే అశోక్ ముందు పంచాయితీ పెట్టిస్తారా? అన్నది వేచి చూడాలి. ఎందుకంటే కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మరో రెండు రోజులు మాత్రమే జిల్లాలో ఉండనున్నారు. ఈ నెల నాలుగున ఆయన ఢిల్లీ వెళ్తారు కనుక ఈ సమయాన్ని తెలుగు తమ్ముళ్లు సద్వినియోగం చేసుకుని తమ అసంతృప్తులను వెళ్లగక్కుతారా? లేక అశోక్ గజపతిరాజే వీరిని పిలిపించి వారి అంతర్గత విభే దాలకు ఫుల్స్టాప్ పెడతారా అన్నది వేచి చూడాలి. -
కొట్టుకున్న కౌన్సిలర్లు
కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ సమావేశం రణరంగంగా మారిం ది. కౌన్సిలర్లు పరస్పరం దాడులు చేసుకోవడంతో నాలుగు గం టలపాటు ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు లాఠీచార్జి చేసి పరి స్థితిని అదుపులోకి తెచ్చారు. మున్సిపల్ ప్యానల్, కాంట్రాక్టు కమిటీ ఎన్నికల కోసం శని వారం చైర్పర్సన్ సుష్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రొటోకాల్‌ను పాటించడం లేదంటూ ముందుగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు కమిషనర్ తో వాగ్వాదానికి దిగారు.అదే సమయంలో సమావేశ మందిరంలోకి అడుగుపెట్టిన వైస్ చైర్మన్ మసూద్ అలీ చైర్పర్సన్ పోడియం పక్కన కుర్చీ వేయించుకు ని కూర్చున్నారు. ఇందుకు టీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం తెలుపుతూ అధికారులపై విమర్శలకు దిగారు. పోడియం ముందుకు వచ్చి ఆందోళన చేశా రు. దీంతో చైర్పర్సన్ సమావేశాన్ని అరగంటపాటు వాయిదా వేసి బయటకు వెళ్లిపోయారు. కుర్చీలు విసురుకుని ఇదే తరుణంలో వైస్ చైర్మన్, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీ లు విసురుకున్నారు. కొట్టుకున్నారు. దీంతో టీఆర్ఎస్ కౌన్సిలర్ భూంరెడ్డి పెదవులకు గాయం కావడం తో వైస్ చైర్మన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ కౌన్సిలర్లు కార్యాలయం ఎదుట బైఠాయిం చారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని వైస్‌చైర్మన్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. వైస్ చైర్మన్ మున్సిపల్ అతిథి గృహంలోకి వెళ్లడంతో టీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులను తోసివేసి తలుపును ధ్వంసం చేసి బయటకు పడేశారు. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన పోలీసులు టీఆర్ఎస్ నేతలను పక్కకు తోసి వేశారు. వైస్ చైర్మన్‌ను బయటకు తీసుకువచ్చి కారులో ఎక్కించేందుకు యత్నించారు. ఇదే సమయంలో ఇరు పార్టీలవారు పరస్పరం దాడికి దిగారు. ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. వారిని నిలువరించినా ప్రయోజనం లేకపోవడంతో వైస్ చైర్మన్‌ను తిరిగి అతిథి గృహంలోకి తీసుకెళ్లారు. లా ఠీచార్జి చేసి గొడవకు దిగినవారిని తరిమికొట్టి, వైస్‌చైర్మన్‌ను, ఆయన కుమారుడిని బలవంతంగా లాక్కెళ్లి జీపులో ఎక్కించి ఠాణాకు తరలించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఆందోళన విరమించారు. కేసులు నమోదు మున్సిపల్ సమావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్‌చైర్మన్ మసూద్, కౌన్సిలర్ జమీల్‌తో పాటు టీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు భూంరెడ్డి, సంగిమోహన్, ముప్పారపు ఆనంద్, కుంభాల రవి, అంజద్, మాసుల లక్ష్మీనారాయణలపై కేసులు నమోదు చేశా రు. ఇరు వర్గాలవారు పరస్పరం చేసుకున్న పిర్యాదు ల మేరకు కేసులు నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. -
కౌన్సిలర్‌పై దాడిని అడ్డుకున్న రోజా
చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఆ సమావేశాన్ని వాయిదా వేయాలని టీడీపీకి చెందిన పట్టణ కౌన్సిలర్లు ఉన్నతాధికారులను పట్టుబడ్టారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ కౌన్సిలర్లు సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాంతో ఇరు పార్టీల కౌన్సిలర్ల మధ్య నెలకొన్న గోడవ తీవ్రస్థాయికి చేరింది. ఆ క్రమంలో ఇటీవల టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కౌన్సిలర్ హరిహరన్పై దాడి చేసేందుకు టీడీపీ కౌన్సిలర్లు యత్నించారు. ఆ సమావేశానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే రోజా అడ్డుకున్నారు. దాంతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఇరుపార్టీల మధ్య వాగ్వివాదాలతో సమావేశం అర్థాంతరంగా సమావేశం ఆగిపోయింది. ఆగ్రహాం చెందిన టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయం వెలుపల నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నుంచి ఎమ్మెల్యేను బయటకు రాకుండా కౌన్సిలర్లు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే రోజాను అక్కడి నుంచి పంపివేశారు. -
సమస్యలపై అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కార్పొరేషన్ పరిధిలో సమస్యలు పరిష్కారం కావడంలేద ని పలువురు కౌన్సిలర్లు అధికారులను నిలదీ శారు. కార్పొరేషన్ పరిధిలో మూడో మండల కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి మండల కమిటీ చైర్మన్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సూర్యాచారి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద అధికంగా ఉందని, ఈ విషయంపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. చర్యలు తీసుకుంటామని అంటున్నారు తప్ప పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అదే విధంగా పట్టణంలోని వీధుల్లో సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలు నిర్మించ డం ద్వారా వర్షపు నీరు నిల్వ ఉండకుండా పాలారుకు వెళుతోందని, డ్రైనేజి కాలువల్లో కింది బాగంలో సిమెంట్ వేయకుండా ఉండాలన్నారు. దీనిపై డెప్యూటీ మేయర్ ధర్మలింగం కలుగజేసుకొని వీటిని అమలు చేయడం కుదరదన్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మండల కమిటీ అధికారి కరుణాకరన్ కలుగజేసుకొని ప్రతిపాదన చేసి అధికారులకు పంపుతామన్నారు. కౌన్సిలర్ రాజ మాట్లాడుతూ ఓటేరిలోని పార్కును నిర్మించి రెండు సంవత్పరాలు కావస్తున్నా ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని మండల చైర్మన్ కుమార్ తెలిపారు. కౌన్సిలర్ శ్రీనివాస గాంధీ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వీధుల్లో దోమలు చేరకుండా బ్లీచింగ్ చల్లాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం రూ75 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టేం దుకు సభ్యులు తీర్మానించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు భరత్‌కుమార్, సూలైరవి, అధికారులు పాల్గొన్నారు.