సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాలకమండళ్ల గడువు దగ్గర పడుతున్న కొద్దీ జిల్లాలోని పలు నగర/పురపాలికల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ నెల 28తో పాలక మండళ్లు ఏర్పడి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఇప్పటికే పలువురు మేయర్లు, చైర్మన్లు, చైర్ పర్సన్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో కొంతమంది క్యాంపులకు వెళ్లారు. వీరిలో కొంత మంది తిరిగి రాగా, మరికొంత మంది అక్కడే ఉండిపోయారు. ఇంతకీ వారికి వ్యతిరేకంగా తీర్మానం ఉంటుందా? ఈ నోటీసులపై కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. మేయర్, చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలనే కల నెరవేరుతుందా? లేదా అనే ప్రశ్న ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. ఇచ్చిన నోటీసులపై ఒకవైపు తీవ్రమైన సందిగ్ధత కొనసాగుతుండగా, మరోవైపు షాద్‌నగర్, తుర్కయంజాల్ మున్సిపాలిటీలు, బడంగ్ పేట్ కార్పొరేషన్‌లోని ఆశావహులు తెరవెనుక పావులు కదుపుతున్నారు.
ఆదిబట్ల.. తేలేదెట్లా..!
ఆదిబట్ల మున్సిపల్ చైర్‌పర్సర్ ఆర్తిక(కాంగెస్)పై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు జనవరి 9న అదనపు కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. మున్సిపాలిటీలో 15 మంది అభ్యర్థులు ఉండగా, వీరిలో 13 మంది నోటీసులపై సంతకాలు పెట్టారు. ఆ తర్వాత 12 మంది క్యాంపు (రాజమండ్రి, వైజాగ్, బీమవరం)నకు వెళ్లారు. తాజాగా బుధవారం ఉదయం క్యాంపు నుంచి తిరిగి వచ్చారు. చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్న ఓ కౌన్సిలర్ తనతో పాటు క్యాంపునకు వచ్చిన వారికి భారీగా ప్యాకేజీ ముట్టజెప్పినట్లు తెలిసింది.
బండ్లగూడ .. ఒత్తిడి తెచ్చినా..
బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ అభ్యర్థి లతా ప్రేమ్‌గౌడ్‌పై 16 మంది (బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్ నుంచి 13 మంది) తిరుగుబావుటా ఎగురవేశారు. మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా, వీరిలో ఒకరు మృతి చెందారు. వీరంతా ఇటీవల కలెక్టర్ శశాంకను కలిసి నోటీసులు అందజేశారు. అదే రోజు క్యాంపునకు వెళ్లారు. నిన్నటి వరకు ఏపీలో ఉన్న నేతలు తాజాగా బుధవారం బెంగళూరుకు చేరుకున్నారు. కేవలం ఆరు నెలల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం సరైన నిర్ణయం కాదని, క్యాంపు నుంచి తిరిగి రావాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ వారిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చేదిలేదంటూ హెచ్చరించినా వారు ససేమిరా అనడం గమనార్హం.
పెద్ద అంబర్‌పేట .. వీడేనా ఉత్కంఠ?
పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా, వీటిలో కాంగ్రెస్ 13, బీఆర్‌ఎస్ 8, బీజేపీ 1, సీపీఐ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి చొప్పున గెలుపొందారు. ఎక్స్ అఫీషియో సభ్యులు, కాంగ్రెస్‌లోని మరికొంత మంది కౌన్సిలర్ల సహకారంతో అప్పటి బీఆర్‌ఎస్ అభ్యర్థి చవుల స్వప్న చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకున్నారు. అప్పటి వరకు బీఆర్‌ఎస్‌లో కొనసాగిన చైర్ పర్సన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. గత జనవరి 28న 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ అప్పటి కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఒక గ్రూపు, పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు మరో గ్రూపు ఇలా రెండు గ్రూపులు 25 రోజుల పాటు క్యాంపునకు వెళ్లారు. హైకోర్టు స్టే విధించడంతో పాటు ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. గత నోటీసులనే పరిగణనలోకి తీసుకుంటారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
దుబాయ్ వెళ్లిన మేడ్చల్ బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీజేపీకి రెండు, కాంగ్రెస్‌కు ఆరు, బీఆర్‌ఎస్‌కు 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కప్పరి స్రవంతిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం 17 మంది కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు జనవరి 8న అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు నోటీసులు ఇచ్చి, ఆ వెంటనే 11 మంది క్యాంపు(గోవా)నకు వెళ్లిపోయారు. నోటీసులు అందజేసి పది రోజులైనా ఇప్పటి వరకు బలప్రదర్శనకు ఏర్పాట్లు చేయకపోవడంతో క్యాంపుల్లో ఉన్న వారిలో ఆందోళన మొదలైంది.
మేడ్చల్: అసమ్మతితో రగులుతున్న మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి కొంతమంది నాయకులు, కౌన్సిలర్లతో కలిసి మంగళవారం దుబాయ్ వెళ్లగా.. మరికొందరు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు బుధవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైటెక్కారు. ఏడాది నుంచి మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మధ్య అసమ్మతి చెలరేగుతోంది. చైర్మన్‌ను గద్దె దించాలని అవిశ్వాస నోటీసు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటీసు ఇవ్వడంతో అవిశ్వాస తేదీ ఖరారు కాలేదు. తాజాగా రాష్ట్రంలో పరిస్థితులు మారి కాంగ్రెస్ రూలింగ్ రావడంతో తమ పార్టీ కౌన్సిలర్లు అసమ్మతితో ఎక్కడా దూరం అవుతారోనని ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను విదేశీ టూర్‌కు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment