సాక్షి,హైదరాబాద్:బీఏసీ సమావేశం నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్ చేసింది. అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నడపాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఎన్ని రోజులు సభ నడుపుతారో క్లారిటీ ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసినట్లు బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ నుంచి బయటికి వచ్చిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని ఎద్దేవా చేశారు.
‘అసెంబ్లీ సమావేశాలపై ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చినం.ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పక పోవడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేశాం. రేపు లగచర్ల అంశంపై చర్చకు బీఅర్ఎస్ పట్టు పట్టింది. ఒక రోజు ప్రభుత్వానికి,మరొక రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయం. లగచర్లపైన చర్చకు పట్టుపట్టినం. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాల కీలకం.కచ్చితంగా ఈ అంశంపైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే.
బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న సీఎం వ్యాఖ్యలపైన బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హౌస్ కమీటీ ఏర్పాటుచేయాలి. బీఏసీపైన తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసకుంటారని స్పీకర్‌ను అడిగాం. బీఏసీలో లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేశాం’అని హరీశ్‌రావు చెప్పారు.
కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్‌ఎస్ పట్టుబట్టింది. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగి సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment